Obesity: ప్రపంచవ్యాప్తంగా ప్రజలను వేధిస్తున్న ఆరోగ్య సమస్యల్లో ప్రధానమైనది ఊబకాయం. చిన్న, పెద్ద అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరిని ఈ సమస్య వేధిస్తుంది. ఊబకాయం విషయంలో జాగ్రత్త వహించని పక్షంలో తీవ్ర అనారోగ్యానికి గురి కావాల్సి వస్తుంది.
ఊబకాయం వలన అనేక వ్యాధులు, హెల్త్ పరమైన సమస్యలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది. ముఖ్యంగా ఈ ఊబకాయం వలన గుండె సమస్యలతో పాటు అధిక రక్తపోటు, కాలేయ వ్యాధి, స్లీప్ అప్నియా, కొన్ని రకాల క్యాన్సర్లు మరియు కొలెస్ట్రాల్ లెవెల్స్ పెరగడం వంటి సమస్యలు వస్తుంటాయని వైద్య నిపుణులు చెబుతున్నారు.
అధిక స్థాయిలో పోషకాలు తీసుకోవడాన్ని (అధిక పోషణ) సైతం పోషకాహార లోపమనే అంటారు. దీని వల్ల ఊబకాయం, మధుమేహం వంటి రోగాల బారిన పడుతుంటారు. చిన్నారులు వయసు తగిన ఎత్తు, బరువు లేకపోవడంతో పాటు రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి తక్కువగా ఉండటం వంటి లక్షణాలు కన్పిస్తాయని నిపుణులు చెబుతున్నారు. ఇక నిద్రపట్టకపోవడం, గురక సమస్య, సాధారణం కంటే చెమటలు ఎక్కువగా పట్టడం, నడుము చుట్టూ కొవ్వు పట్టడం వంటి వాటిని పెద్ద వారిలో ఊబకాయం లక్షణాలుగా వైద్య నిపుణులు చెబుతున్నారు. అంతేకాకుండా తీవ్ర అలసట, వెన్ను నొప్పి, కీళ్ల నొప్పులు వంటి లక్షణాలు కూడా ఊబకాయం ఉన్న వారిలో కన్పిస్తాయట.
ఈ క్రమంలో ఊబకాయం రాకుండా ఉండాలంటే కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. మితంగా ఆహారాన్ని తీసుకోవడంతో పాటు రోజూ క్రమం తప్పకుండా వ్యాయామం చేయాలని నిపుణులు వెల్లడిస్తున్నారు. అదేవిధంగా ఒత్తిడిని తగ్గించుకోవడం వంటి చర్యలతో ఊబకాయం నుంచి వచ్చే కొన్ని సమస్యల బారి నుండి కాపాడుకునే ఛాన్స్ ఉందని తెలియజేస్తున్నారు.