AMR
AMR: వైద్యరంగంలో ఒకవైపు విప్లవాత్మక మార్పులు.. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులోకి వస్తుండగా, మరోవైపు వైరస్‌లు, బ్యాక్టీరియాలు, ఇతర వ్యాధులు ఆందోళనకర రీతిలో పెరుగుతున్నాయి. తాజాగా ప్రపంచ వైద్య నిపుణులను యాంటీ మైక్రోబిలయ్ రెసిస్టెన్స్(ఏఎంఆర్) భయపెడుతోంది. విచ్చలవిడిగా ఔషధాల వాడకంతో వివిధ రోగకారక వైరస్‌లు, బ్యాక్టీరియాలు ఔషధాలకు లొంగనంతగా శక్తిని పెంచుకుంటున్నాయి. దీనినే వైద్య పరిభాషలో ఏఎంఆర్‌గా వ్యవహరిస్తారు. ఇదే జరిగితే ఇప్పటి వరకు కనిపెట్టిన ఔషధాలేవీ భవిష్యత్‌లో వ్యాధులపై పనిచేయవు. ఈ కారణంగా 2050 నాటికి ఏటా కోటి మంది చనిపోతారని శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు.
ఇప్పటికే స్ట్రోక్‌ల భయం..
ప్రపంచవ్యాప్తంగా రక్త పోట్లతో తలెత్తే బ్రెయిన్ స్ట్రోక్‌ల కారణంగా 2050 నాటికి ఏటా దాదాపు కోటి మంది చనిపోతారని ఇటీవలే ఓ వైద్య నివేదిక తెలిపింది. ప్రత్యేకించి బడుగు వర్గాలు, మధ్య ఆదాయ తరగతి ప్రజలతో కూడిన ఎల్‌ఎంఐసీ దేశాలకు ఈ బ్రెయిన్ స్ట్రోక్ ముప్పు ఎక్కువగా ఉంటుందని వరల్డ్ స్ట్రోక్ ఆర్గనైజేషన్, లాన్సెట్‌న్యూరాలజీ కమిషన్(ఎల్‌ఎన్‌సీ) సంయుక్త పరిశోధనలో తేలిన విషయాలను వెలువరించింది.
పెరుగుతున్న వ్యాధుల ముప్పు..
ఈ అధ్యయనం ప్రకారం.. 2029 నాటికి రక్తపోటులతో ఏటా 6 లక్షల మంది చనిపోతున్నట్లు తెలిపింది. ఈ సంఖ్య 2050 నాటికి ఏటా కోటికి చేరుతుందని నిర్ధారించింది. పలు ప్రాంతాల్లో అందరిలోనూ బీపీ ప్రధాన సమస్య. ఇదే తర్వాత దశల్లో అధిక రక్తపోటుకు దారితీస్తుంది. దీనిపై ఏర్పాటు చేసిన ఇండియా హైపర్‌టెన్షన్ కంట్రోల్ ఇన్షియేటివ్ (ఐహెచ్‌సీఐ) చేపట్టిన చర్యలు సత్ఫలితాలు ఇస్తున్నాయి.
మరోవైపు క్యాన్సర్..
ఇక మారిన ఆహారపు అలవాట్లతో క్యాన్సర్ కూడా చాపకింద నీరులా విస్తరిస్తోంది. ఒకప్పుడు నూటికి 10 మందికి మాత్రమే వచ్చే ఈ వ్యాధి ఇప్పుడు నూటికి 30 మందికైగా వస్తోంది. రాబోయే రోజుల్లో ఇది 50 నుంచి 60 శాతానికి చేరుతుందని డబ్ల్యూహెచ్‌వో తెలిపింది. నియంత్రణకు చర్యలు చేపట్టాలని సూచించింది.
వైరస్‌ల ముప్పు..
ఒకవైపు దీర్ఘకాలిక వ్యాధులు పెరుగుతుండగా, ఇంకోవైపు కొత్తకొత్త వైరస్‌లు పుట్టుకొచ్చి ప్రపంచాన్ని భయపెడుతున్నాయి. ఇప్పటికే కోవిడ్ నాలుగు దశల్లో ప్రపంచాన్ని అతలాకుతలం చేసింది. ఇప్పుడిప్పుడే చాలా దేశాలు కోలుకుంటున్నాయి. ఈ క్రమంలో మరో ముప్పు పొంచి ఉందని డబ్ల్యూహెచ్‌వో హెచ్చరిస్తోంది.
ఎన్ని వ్యాధులు వచ్చినా, ఎన్ని వైరస్‌లు సోకినా.. చికిత్సే ప్రధానం. అయితే చికిత్సకు వాడుతున్న ఔషధాలు కూడా భవిష్యత్‌లో ప్రమాదకరంగా మారతాయని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. విచ్చల విడిగా వాడుతున్న ఔషధాలతో ఏఎంఆర్ పెరిగి చికిత్సలు ఏమీ భవిష్యత్‌లో పనిచేయవని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.