తెలంగాణలో బలపడాలని చూస్తున్న బీజేపీ.. అందుకు బలమైన మీడియా అండ ఉండాలని భావిస్తోంది. టీఆర్ఎస్, కాంగ్రెస్ లకు ఉన్నట్టే బీజేపీ కూడా తెలుగు రాష్ట్రాల్లో బలమైన మీడియాను సంపాదించాలని ప్లాన్ చేస్తోంది.
ఇప్పటికే తెలంగాణలో సీనియర్లను అంతా పక్కనపెట్టి ఫైర్ బ్రాండ్ అయిన కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ ను రాష్ట్ర అధ్యక్షుడిగా నియమించింది బీజేపీ అధిష్టానం.. ఆయన టీఆర్ఎస్ ప్రభుత్వాలపై దూకుడుగా వెళుతున్నారు. బీజేపీని క్షేత్రస్థాయి నుంచి బలోపేతం చేస్తున్నారు. ఓవైపు కాంగ్రెస్ పార్టీ పరిస్థితి తెలంగాణలో రోజురోజుకు దిగజారుతోంది. ఈ క్రమంలోనే తెలంగాణలో బలపడేందుకు కావాల్సిన మీడియా సపోర్టు కోసం బీజేపీ చూస్తోంది.
తాజాగా తెలుగు రాష్ట్రాల్లో టాప్ ఇంగ్లీష్ దినపత్రికను బీజేపీ కొనాలని ప్రయత్నాలు చేస్తోందట.. తెలంగాణలో అతిపెద్ద చలమణీలో ఉన్న దినపత్రికలలో ఒకటైన ఈ సికింద్రాబాద్ కేంద్రంగా నడుస్తున్న దినపత్రికను సొంతం చేసుకోవడానికి బీజేపీ ప్రయత్నిస్తోందని బీజేపీ వర్గాల ద్వారా తెలుస్తోంది.
ఈ దెబ్బతో జగన్ బీజేపీతో కలుస్తాడా?
పలు మనీలాండరింగ్ కేసులను ఎదుర్కొంటున్న ఆ మీడియా హౌస్ యజమానులు బీజేపీకి దగ్గరగా ఉండే కొంతమంది పెట్టుబడిదారులను సంప్రదించారని.. చర్చలు ప్రారంభించారని ఆ వర్గాలు చెబుతున్నాయి.
మీడియా హౌస్ ను కాంగ్రెస్ పార్టీకి చెందిన మాజీ ఎంపీ సొంతం చేసుకున్నారు. ఇటీవలి వరకు అది అతిపెద్ద సర్య్కలేట్ ఇంగ్లీష్ దినపత్రికగా ఉంది. ఇది శక్తివంతమైన ఇంగ్లీష్ పత్రికగా ప్రసిద్ధి చెందింది. స్పోర్ట్స్ స్పాన్సర్ షిప్ లో యజమాని ఇరుక్కొని సంస్థ నష్టాలపాలైంది. దీంతో ఈ పేపర్ ను అమ్మాలని ఆయన ప్రయత్నాలు చేస్తున్నారు. అనేకమంది కొనడానికి చూసి వెళ్లారు. ఇప్పుడు బీజేపీకి దగ్గరగా ఉన్న పారిశ్రామికవేత్తలు ఈ ఆస్తిని కొనడానికి ఆసక్తి చూపుతున్నారని చెబుతున్నారు.
కానీ ఇక్కడే బీజేపీ లాజిక్ మిస్ అవుతోంది. తెలంగాణలో బలపడాలని చూస్తున్న బీజేపీ ఇంగ్లీష్ పత్రికను కొనడం వల్ల ఉపయోగం ఏంటనేది ఇప్పుడు అందరినీ తొలుస్తున్న ప్రశ్న. తెలుగుప్రజలపై ఒక ముద్రవేయాలంటే ప్రతీరోజు తెలుగు పత్రికే అవసరం. మరి తెలంగాణలో ఇంగ్లీష్ పత్రికను బీజేపీ కొని ఏం చేస్తుందనేది అంతుబట్టకుండా ఉంది.
-ఎన్నం