https://oktelugu.com/

దుబ్బాకలో త్రిముఖ పోరు.. బరిలో గెలిచేదెవరు?

దుబ్బాక ఉప ఎన్నిక నగారా మోగింది. పార్టీలన్నీ ఈ ఉప ఎన్నికను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. అధికార పార్టీ టీఆర్‌‌ఎస్‌ను ఓడించాలని ప్రతిపక్షాలు ప్రయత్నిస్తుండగా.. మరోసారి ఈ నియోజకవర్గాన్ని తమ ఖాతాలోనే వేసుకోవాలని గులాబీ పార్టీ ఉవ్విల్లూరుతోంది. ఇప్పటికే ప్రధాన పార్టీలన్నీ తమ అభ్యర్థులను ప్రకటించాయి. కొందరైతే గత కొద్ది రోజులుగా ప్రచారంలో దూసుకెళ్తున్నారు. Also Read: రఘునందన్ రావును టీఆర్ఎస్ అదును చూసి కొట్టిందా? అధికార పార్టీ టీఆర్‌‌ఎస్‌కు ఈ సారి ఈ ఉప ఎన్నిక అంత […]

Written By:
  • NARESH
  • , Updated On : October 7, 2020 / 10:39 AM IST
    Follow us on

    దుబ్బాక ఉప ఎన్నిక నగారా మోగింది. పార్టీలన్నీ ఈ ఉప ఎన్నికను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. అధికార పార్టీ టీఆర్‌‌ఎస్‌ను ఓడించాలని ప్రతిపక్షాలు ప్రయత్నిస్తుండగా.. మరోసారి ఈ నియోజకవర్గాన్ని తమ ఖాతాలోనే వేసుకోవాలని గులాబీ పార్టీ ఉవ్విల్లూరుతోంది. ఇప్పటికే ప్రధాన పార్టీలన్నీ తమ అభ్యర్థులను ప్రకటించాయి. కొందరైతే గత కొద్ది రోజులుగా ప్రచారంలో దూసుకెళ్తున్నారు.

    Also Read: రఘునందన్ రావును టీఆర్ఎస్ అదును చూసి కొట్టిందా?

    అధికార పార్టీ టీఆర్‌‌ఎస్‌కు ఈ సారి ఈ ఉప ఎన్నిక అంత ఈజీగా కనిపించడం లేదు. ముందు నుంచీ టీఆర్‌‌ఎస్‌ ఖాతాలోనే ఉండిపోయిన దుబ్బాక నియోజకవర్గం.. ఇప్పుడు కూడా ఎలాగైనా కైవసం చేసుకోవాలని తలపిస్తోంది. కానీ.. ఆదిలోనే అధికార పార్టీకి కోలుకోలేని దెబ్బతగిలింది. అధికార పార్టీ టీఆర్‌‌ఎస్‌లో అప్పుడే కుంపట్లు మొదలయ్యాయి. నిన్నటి వరకు అధికార పార్టీలో ఉన్న మాజీ మంత్రి చెరుకు ముత్యంరెడ్డి కొడుకు చెరుకు శ్రీనివాస్‌ రెడ్డి ఒక్కసారిగా పార్టీ ఫిరాయించారు. కాంగ్రెస్‌ పార్టీలోకి చేరిపోయి ఇప్పుడు ప్రత్యర్థి అభ్యర్థి అయ్యారు. దీంతో ఇక్కడి రాజకీయ ముఖచిత్రం ఒక్కసారిగా మారిపోయింది. 2009 ఎన్నికల్లో పార్టీ తరఫున పోటీ చేసిన చెరుకు ముత్యంరెడ్డి విజయం సాధించారు. 2014లో సోలిపేట రామలింగారెడ్డి బరిలోకి దిగి గెలుపొందారు. 2018 ఎన్నికల్లోనూ మరోసారి సోలిపేట రామలింగారెడ్డినే విజయ బావుట ఎగురవేశారు.

    ఈసారి ప్రధాన పార్టీల నుంచి పోటీ తీవ్రంగా ఉండడంతో ఈ ఉప ఎన్నికను అధికార పార్టీ అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. టీఆర్ఎస్‌ ‌‌గెలుపు కోసం అన్ని రకాల ప్రయత్నాలూ ప్రారంభించింది. గతంలో సిద్దిపేటలో అనుసరించిన వంద ఓటర్లకో ఇన్‌‌‌‌చార్జి వ్యూహాన్ని దుబ్బాకలోనూ అమలు చేయడానికి రంగం సిద్ధం చేసింది. నియోజకవర్గంలోని 8 మండలాల్లో మొత్తం 1,97,468 మంది ఓటర్లుండగా, 100 మంది ఓటర్లకు ఒకరు చొప్పున ఏకంగా 19వేల పైచిలుకు మంది టీఆర్ఎస్‌‌‌‌ నేతలు, కార్యకర్తలను ఇన్‌‌చార్జీలుగా నియమిస్తున్నారు. ఇందులో భాగంగా ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ బాధ్యతలను పర్యవేక్షిస్తున్న మంత్రి హరీశ్‌‌‌‌రావు సిద్దిపేట నుంచి పార్టీ క్యాడర్‌‌ను దుబ్బాక రప్పించారు. ఎన్నికల కోడ్రాక ముందు అభివృద్ధి పనుల శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు, పెండింగ్ పింఛన్ల క్లియరెన్స్, కల్యాణలక్ష్మి చెక్కులు సహా పలు తాయిలాలతో ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నం చేసిన టీఆర్ఎస్ పెద్దలు ఇక ఇప్పుడు ఇతర పార్టీ నేతలకు గాలం వేయడం ప్రారంభించారు. గ్రామాలవారీగా ఆపరేషన్ఆకర్ష్కొనసాగిస్తున్నారు. మరోవైపు ప్రభుత్వ వ్యతిరేకతపై ఆశలు పెట్టుకొని విజయంపై కన్నేసిన కాంగ్రెస్, బీజేపీ లీడర్లు గులాబీకి దీటుగా ప్రచారానికి రెడీ అవుతున్నారు.

    టీఆర్‌‌ఎస్ రూపొందించిన మైక్రోప్లాన్లో భాగంగా దుబ్బాకలో నియమించిన టీఆర్ఎస్ఇన్‌చార్జీలు తమకు కేటాయించిన వందమంది ఓటర్లతో రోజూ టచ్‌లో ఉంటున్నారు. ఓటర్లతో నిత్యం మాట్లాడటమే కాకుండా ఉదయం, సాయంత్రం వేళల్లో వారి ఇండ్లకు వెళ్లి ప్రచారం నిర్వహిస్తారు. తమకు కేటాయించిన ఓటర్లంతా పోలింగ్‌‌‌‌ రోజు వారి ఓట్లు వేసేలా చూడాల్సిన బాధ్యత కూడా ఈ ఇన్‌చార్జీలకే అప్పగిస్తున్నారు. ప్రచార సమయంలో వంద ఓటర్లకు సంబంధించిన పూర్తి అవసరాలను ఇన్‌‌చార్జీలే పర్యవేక్షిస్తారు. ఈ విధానం వల్ల పోలింగ్‌‌ ‌‌శాతాన్ని పెంచడంతోపాటు తమకు అనుకూలంగా ఓటింగ్‌‌‌‌ జరిగే వ్యూహంతో టీఆర్ఎస్ ముందుకుపోతోంది. ఇందుకు సంబంధించి ఆయా బూత్‌లలో వంద మంది ఓటర్ల వివరాలు, వారి ఫోన్ నంబర్ల జాబితాలను ఇన్‌‌‌‌చార్జీలకు అప్పగించారు. ఇప్పటికే దుబ్బాక మున్సిపాలిటీ, మండల పరిధిలోని గ్రామాల్లో ఇన్‌‌‌‌చార్జీలు రంగంలోకి దిగగా, మిగిలిన మండలాల్లో ఎంపిక కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నారు.

    దుబ్బాక ఉప ఎన్నికల ప్రచార బాధ్యతలను భుజాన ఎత్తుకున్న మంత్రి హరీష్‌‌‌రావు అన్నీ తానై వ్యవహరిస్తున్నారు. ఎన్నికల షెడ్యూల్‌‌ ‌‌వెలువడే వరకు నియోజకవర్గంలోని గ్రామాల్లో పలు అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభోత్సవాలు చేయడంతోపాటు పలు పనులకు నిధుల మంజూరుకు హామీ ఇచ్చారు. ఇప్పటికే ఉమ్మడి జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలను మండలాల వారీగా ఇన్‌‌‌‌చార్జీలుగా నియమించడమే కాకుండా వారి ఆధ్వర్యంలో కార్యకర్తలను యాక్టివ్చేశారు. రానున్న రోజుల్లో మరింత ఉధృతంగా ఇంటింటి ప్రచార కార్యక్రమాల నిర్వహణకు ప్రణాళిక రూపొందించారు. అయితే.. దుబ్బాకలో టీఆర్‌‌ఎస్ గెలుపు అంత ఈజీ కాదనే ప్రచారం నేపథ్యంలో టీఆర్ఎస్‌‌ ‌‌నేతలు అందుబాటులో ఉన్న ఏ అవకాశాన్నీ వదులుకోవడం లేదు. కొద్ది రోజులుగా ఇతర పార్టీల నుంచి నేతలు, కార్యకర్తలను చేర్చుకోవడంపై దృష్టిపెట్టారు. ఎన్నికలు దగ్గరపడడంతో దీనిని మరింత స్పీడప్చేశారు. ముఖ్యంగా మంత్రి హరీష్‌ రావు మెదక్‌‌ ‌‌నియోజకవర్గానికి చెందిన ముఖ్యనేతతో కలసి అసమ్మతి నేతలను బుజ్జగిస్తున్నారు. గతంలో మహబూబ్‌‌‌‌నగర్‌‌ ‌‌జిల్లాలో రెండు అసెంబ్లీ సెగ్మెంట్లలో ప్రతిపక్ష పార్టీలకు చెందిన ముఖ్యనేతల ఓటమికి రచించిన వ్యూహాన్నే దుబ్బాకలో ప్రయోగిస్తున్నారు. ముఖ్యంగా అసంతృప్త నేతలను బుజ్జగిస్తూనే ప్రతిపక్ష పార్టీల నుంచి చేరికలపై అధికంగా దృష్టి సారించడం గమనార్హం.

    Also Read: తెలంగాణ ప్రజలకు సీఎం కేసీఆర్ శుభవార్త… !

    రామలింగారెడ్డి మృతితో ఈ నియోజకవర్గానికి ఉప ఎన్నిక అనివార్యమైంది. అయితే ముందు నుంచీ ఆ టికెట్‌ను ఎవరికి కేటాయిస్తారా అని అధికార పార్టీలో ఆసక్తి నెలకొంది. ఉద్యమం ప్రారంభం నుంచి రామలింగారెడ్డి యాక్టివ్‌గా ఉన్నారు. పార్టీలోనూ కీ రోల్‌ పోషించారు. దీనికితోడు రెండు సార్లు నియోజకవర్గం నుంచి వరుసగా గెలుపొందారు. ఈ నేపథ్యంలో ఆయన మృతితో.. ఆయన కుటుంబానికే టికెట్‌ ఇస్తారో లేదా మరో క్యాండిడేట్‌ను ఎవరినైనా సెలక్ట్‌ చేస్తారా అని అనుకున్నారు. ఈ క్రమంలో చాలా మంది పేర్లు కూడా వినిపించాయి. కానీ.. చివరకు రామలింగారెడ్డి భార్యను సుజాతను అభ్యర్థిగా ప్రకటించారు. సుజాతను ప్రకటిచడంపై కేసీఆర్‌‌ స్ట్రాటజీ కూడా అందరికీ అర్థం కాకుండా ఉంది. రామలింగారెడ్డిపై ఆది నుంచీ ప్రజల్లో పార్టీలకతీతంగా అభిమానం ఉంది. దీనికితోడు ఆయన హఠాన్మరణం అందరినీ కలిచివేసింది. ఆయన ఫ్యామిలీలోనే టికెట్‌ ఇస్తే అటు సింపతి కూడా వర్కవుట్‌ అవుతుందని కేసీఆర్ అభిప్రాయం. సింపతితో బయటపడొచ్చని సుజాతకు టికెట్‌ ఇచ్చినట్లుగా రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

    మరోవైపు కాంగ్రెస్‌ కూడా ఈ ఎన్నికను అంత ఈజీగా వదిలిపెట్టడం లేదు. ఒకవిధంగా పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌ కుమార్‌‌రెడ్డికి ఈ ఎన్నికలు రెఫరెండం అనే చెప్పాలి. హుజూర్‌‌నగర్‌‌లో ఓటమితో ఇప్పటికే ఆయన పీసీసీ పదవి కోల్పోవాల్సి ఉండే. కానీ.. ఆ పార్టీలో వర్గ పోరు.. కుమ్ములాటలు కారణంగా ఇప్పటికిప్పుడు తప్పించి.. మళ్లీ ఎవరికి ఇవ్వాలో తెలియక ఉత్తమ్‌నే కొనసాగిస్తోంది. అందుకే.. తన పదవిని కాపాడుకోవడానికి ఈసారి ఉత్తమ్‌ ఈ నియోజకవర్గ బాధ్యతలను తీసుకున్నారు. ఒకవేళ ఈ ఎన్నికల్లో గనుక కాంగ్రెస్‌ విజయం సాధిస్తే మున్ముందు గ్రేటర్, ఎమ్మెల్సీ ఎన్నికలు కూడా రాబోతున్నాయి. అవి పూర్తయ్యే వరకు కూడా ఉత్తమ్‌ పీసీసీ పదవికి వచ్చిన ఢోకా ఏమీ ఉండదు.

    కాంగ్రెస్‌ పార్టీలోకి నిన్ననే మాజీ మంత్రి చెరుకు ముత్యం రెడ్డి కొడుకు చెరుకు శ్రీనివాస్‌రెడ్డి కాంగ్రెస్‌ పార్టీలో చేరారు. గాంధీభవన్‌ వేదికగా ఆయన కాంగ్రెస్‌ కండువా కప్పుకున్నారు. పీసీసీ చీఫ్‌ ఉత్తమ్‌ ఆయనను పార్టీలోకి ఆహ్వానించి కాంగ్రెస్‌ అభ్యర్థి ప్రకటించేశారు. దుబ్బాక, దొమ్మాట అభివృద్ధి కోసం ముత్యంరెడ్డి నిరంతరం కృషి చేశారని చెప్పుకొచ్చారు. ఇది ఒక విధంగా కాంగ్రెస్‌ పార్టీకి కలిసొచ్చే అంశమనే చెప్పాలి. ముత్యంరెడ్డికి ఆ నియోజకవర్గంలో ఎంతవరకు పలుకుబడి ఉందో అందరికీ తెలిసిందే. దానిని క్యాష్‌ చేసుకోవడంతోపాటు.. ముత్యంరెడ్డి గతంలో చేసిన అభివృద్ధి పనులను కూడా తమ ఖాతాలోనే వెసుకునేందుకు కాంగ్రెస్‌ ప్రయత్నిస్తోంది.

    దీనికితోడు ఇప్పుడు కాంగ్రెస్‌ పార్టీ మరో అస్త్రాన్ని కూడా ఎంచుకుంది. అదేంటంటే.. ఇటీవల టీఆర్‌‌ఎస్‌ ప్రభుత్వం తీసుకొచ్చిన ఎల్‌ఆర్‌‌ఎస్‌. ఈ స్కీంపై ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా ప్రజల్లో అసంతృప్తి నెలకొంది. తాము కష్టపడి కొనుక్కున్న జాగలకు సర్కార్‌‌కు పన్ను కట్టడం ఏంటని ఫైర్‌‌ అవుతూనే ఉన్నారు. ఇప్పటికే కాంగ్రెస్‌ కూడా ఓ ప్రకటన చేసింది. తాము అధికారంలోకి వస్తే పైసా ఫీజు లేకుండా భూములను క్రమబద్ధీకరిస్తామని ప్రకటించింది. దీంతో ప్రజల ఆలోచన కాంగ్రెస్ వైపు మళ్లుతుందని ఆ పార్టీ ఆశగా ఉంది.

    దుబ్బాక ఉప ఎన్నికల్లో గట్టి పోటీ ఇస్తామంటున్న కాంగ్రెస్‌‌ ‌‌పార్టీ గ్రామానికో ఇన్‌‌చార్జిని నియమించనున్నట్టు ప్రకటించింది. దుబ్బాక నియోజకవర్గం పరిధిలోని మొత్తం 149 గ్రామాలకు ఒక్కో ఇన్‌‌చార్జిని నియమించి ప్రచారం నిర్వహించేందుకు వ్యూహాలు రూపొందిస్తున్నారు. దుబ్బాక నియోజకవర్గంలోని ఒక్కో మండలానికి ఐదుగురు రాష్ట్ర స్థాయి నాయకులను ఇన్‌‌‌‌చార్జీగా నియమించిన టీపీసీసీ గ్రామాలవారీగా జిల్లా ముఖ్యనేతలను ఇన్‌‌చార్జీలుగా నియమించనున్నది. ప్రస్తుతానికి గ్రామాల ఇన్‌‌చార్జీల ఎంపిక ప్రక్రియ ప్రారంభం కాకపోయినా త్వరలోనే జాబితాను వెల్లడిస్తామని కాంగ్రెస్‌‌‌‌ నేతలు చెబుతున్నారు. ఏదేమైనా దుబ్బాక ఉప ఎన్నికను అధికార టీఆర్ఎస్‌‌ ‌‌పార్టీ ప్రతిష్టాత్మకంగా తీసుకుని గెలుపే లక్ష్యంగా పనిచేస్తుంటే ప్రధాన ప్రతిపక్షాలైన బీజేపీ, కాంగ్రెస్‌‌ దీటుగా ప్రచార వ్యూహాలను రూపొందిస్తున్న తీరు ఆసక్తిని కలిగిస్తోంది.

    ఇక బీజేపీ విషయానికొస్తే.. రఘునందన్‌రావును ఆ పార్టీ తమ అభ్యర్థిగా ప్రకటించింది. రఘునందన్‌రావు 2018 అసెంబ్లీ ఎన్నికల్లో ఇక్కడ పోటీ చేసి మూడో స్థానంలో నిలిచాడు. తర్వాత ఎంపీ అభ్యర్థిగానూ పోటీ చేసి ఓడిపోయారు. దీంతో అప్పటి నుంచి రఘునందన్‌రావు కేడర్‌‌ను బలోపేతం చేసుకోవడంపై దృష్టి సారించారు. అడ్వొకేట్‌గా, మంచి వక్తగా రఘునందన్‌రావుకు మంచి పేరుంది. నియోజకవర్గంలో చాలా వరకు పరిచయాలున్నాయి. వాస్తవానికి బీజేపీ నుంచి ఈ బై ఎలక్షన్‌లలో పోటీ చేసేందుకు చాలా మంది దరఖాస్తు చేసుకున్నారు. కానీ.. టీఆర్‌‌ఎస్‌కు దీటైన నాయకుడు కావాలని.. దీనికితోడు రఘునందన్‌రావు రెండు నెలలుగా ప్రజాక్షేత్రంలో ఉండడంతో అధిష్టానం కూడా టికెట్‌ ఆయనకే ఖరారు చేసింది.

    మరోవైపు.. మెదక్‌ ఉమ్మడి జిల్లాలోని నియోజకవర్గాల్లో అన్నింటిలోనూ ఓ స్థాయి అభివృద్ధి జరిగింది. కానీ.. ఒక్క దుబ్బాక నియోజకవర్గంలో మాత్రం అభివృద్ధి ఎక్కువగా కనిపించడం లేదు. అటు సిద్దిపేట చూసుకున్నా.. ఇటు మెదక్‌ చూసుకున్నా అభివృద్ధిలో దూసుకెళ్తున్నాయి. ఒక్క దుబ్బాక మాత్రం వెనుకబడి పోయింది. బీజేపీ ప్రధానంగా ఇదే అస్త్రాన్ని ప్రయోగిస్తోంది. దీనికితోడు ప్రభుత్వ వైఫల్యాలను ప్రజాక్షేత్రంలోకి తీసుకెళ్లేందుకు ప్రయత్నిస్తోంది. కరోనా టైంలోనూ ప్రభుత్వం ఏపాటి చర్యలు తీసుకుంది.. ఎలా వ్యవహరించింది అనే విషయమై ప్రజల ముందుంచుతున్నారు. అంతేకాదు.. ఇప్పటివరకు కేంద్రం నుంచి వచ్చిన నిధుల లెక్కలు వివరించేందుకు సిద్ధమయ్యారు. కేంద్ర ప్రభుత్వ పథకాలకు టీఆర్‌‌ఎస్‌ ప్రభుత్వం ఎందుకు మోకాలడ్డుతోందో కూడా చెప్పేందుకు ప్రయత్నిస్తున్నారు.

    Also Read: ఏకశిలా నగరిపై ఎగిరేది ఎవరి జెండా?

    ఇక ఫైనల్‌గా.. ఇప్పటికే పలు ఎన్నికల్లోనూ ఓడిపోయిన రఘునందన్‌రావుపై సింపతి ఉందని పార్టీ భావిస్తోంది. ఈ ఒక్కసారైనా సింపతి వర్కవుట్‌ కాకపోతుందా అనే నమ్మకంతో ఉంది. అటు రఘునందన్ కూడా ప్రజలను ఇలానే కోరుతున్నారు.

    మరోవైపు.. టీఆర్ఎస్‌‌ ‌‌మైక్రో ప్లానింగ్‌‌‌‌కు దీటుగా బీజేపీ ప్రచార వ్యూహాలను రూపొందిస్తోంది. రెండు మూడు పోలింగ్‌‌బూత్‌‌‌‌లకు ఒక్కో శక్తి కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ఉమ్మడి మెదక్‌‌ ‌‌జిల్లాలోని బీజేపీ ముఖ్యనేతలంతా శక్తి కేంద్రాల పరిధిలో ప్రచార కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. సిద్దిపేట జిల్లా పరిధిలో 54 , మెదక్‌‌ ‌‌జిల్లా పరిధిలో 12 బీజేపీ శక్తి కేంద్రాలున్నాయి. వీటి పరిధిలో ప్రచారాలకు ప్రత్యేక టీమ్‌లను ఏర్పాటుచేస్తున్నారు. ఐదుగురు సభ్యులుండే ఈ ప్రచార టీమ్‌లు సంబంధిత శక్తి కేంద్రం పరిధిలోని కార్యకర్తలతో కలిసి ప్రతిరోజూ ప్రచార కార్యక్రమాలను నిర్వహిస్తాయి. వచ్చే రెండు మూడు రోజుల్లో శక్తి కేంద్రాల ప్రచార బృందాలను ఎంపిక చేసి ప్రచార రంగంలోకి దిగేందుకు రెడీ అవుతున్నారు. ఇప్పటికే ఈ విషయంపై దౌల్తాబాద్‌‌‌‌ మండలంలో ముఖ్య నేతలతో సమావేశాన్ని నిర్వహించారు.

    ఫైనల్‌గా.. ఈ దుబ్బాక ఉప ఎన్నిక మాత్రం అన్ని పార్టీలకూ రెఫరెండం కానున్నాయి. ఇక్కడి ఫలితాలతోనే ఫ్యూచర్‌‌ ఏంటని తెలియనుంది. ముందు ముందు గ్రేటర్ హైదరాబాద్‌, వరంగల్‌, ఖమ్మం కార్పొరేషన్లకు ఎన్నికలు ఉన్నాయి. వీటన్నింటి నేపథ్యంలో ఈ ఎన్నికలో మరోసారి గులాబీ గుబాళిస్తుందా..? ప్రజాక్షేత్రంలో వస్తున్న వ్యతిరేకతతో ఢమాల్‌ అని పడిపోతుందా..? మరోవైపు ప్రజలు కాంగ్రెస్‌కు స్నేహ ‘హస్తం’ అందిస్తారా..? లేక ‘హ్యాండ్‌’ ఇస్తారా..? ఈసారైనా ఈ ఉప ఎన్నికలో కమలం వికసిస్తుందా..? లేక వాడిపోతుందా..? తేలాల్సి ఉంది.

    -శ్రీనివాస్.బి