Homeగెస్ట్ కాలమ్మనోజ్ మరణంతో బయటపడ్డ షాకింగ్ నిజాలు

మనోజ్ మరణంతో బయటపడ్డ షాకింగ్ నిజాలు


జర్నలిజం.. ఇప్పుడు విలువలేనిదన్నది నిజం.. కరోనా కాటుకు బలైందన్నది కఠిన నిజం. లాక్ డౌన్ తో జర్నలిస్టులను రోడ్డున పడేశారు. ఇప్పుడు అదే కరోనా కవరేజ్ కు వెళ్లిన వారిని కబళిస్తున్న మీడియా యాజమాన్యాలు కళ్లుండి చూడలేని కబోధుల్లా మారిపోయాయన్న విమర్శలున్నాయి. ఏ మీడియా చూసినా ఏమున్నది గర్వకారణం అన్న చందంగా మారింది. అగ్ర మీడియా నుంచి చిన్న మీడియా వరకు కోతలు, ఉద్యోగాలు తొలగించి వాతలు.. మొత్తం జర్నలిస్టుల బతుకే ఆగమైన పరిస్థితి తెలంగాణలో ఉంది.

ఇదో విషాదకమైన సంఘటనే. గుండెలు పిండేసేంత హృదయవిదారకమే.. ఒక యువ క్రైం రిపోర్టర్.. నిండా 33 ఏళ్లు కూడా లేవు. కరోనా కూడా ఏం చేయలేని వయసు. అయినా ప్రాణాలు పోయాయి.. ఎవరు కారకులు? ఆ కుటుంబానికి ఏం న్యాయం జరుగుతుంది.? ఇంత జరిగినా ఆ రిపోర్టర్ బాధను ఏ మీడియా హైలెట్ చేయలేదు. చేయదు కూడా. ఎందుకంటే చేస్తే తమ క్రూరత్వం బయటపడుతుంది. ఇలా జర్నలిస్టు బతుకులు రెంటికి చెడ్డ రేవడిలా మారిపోయాయి. చచ్చినా ఆ చావుకు విలువలేని పరిస్థితి ఎదురైంది. కరోనాతో మరణించిన హైదరాబాద్ రిపోర్టర్ మనోజ్ మరణం జర్నలిస్టుల బతుకుల్లోని విషాదకోణాలపై మరోసారి పెద్ద ఎత్తున చర్చకు తెరతీసింది. అసలు ఏ రక్షణలు, ఏ భరోసాలు లేకుండా.. ప్రతి యుద్ధంలోనూ ముందుండేది. సమాజంలోని ప్రతి వర్గానికీ అండగా ఉండేది, పోరాడేది, చివరకు తనే గాయపడి, నిశ్శబ్దంగా నిష్క్రమించేది జర్నలిస్టే అనడంలో ఎలాంటి సందేహం లేదు.

జర్నలిజం.. సమాజంలో పతనమవుతోంది. చెప్పుకునేందుకే విలువలున్నాయి. అమల్లోకి రాని విలువలు జర్నలిస్టులను రోడ్డున పడేస్తున్నాయి. అన్నిరకాలుగా సున్నితంగా మారిపోయిన బతుకులు ఎవరివీ అంటే… జర్నలిజాన్ని, ఈ కొలువుల్ని కెరీర్‌గా మార్చుకుని బతికే వాళ్లవి అనడంలో ఎలాంటి సందేహం లేదు.

ప్రత్యేకించి ప్రింట్ మీడియా జర్నలిస్టుల పరిస్థితి మరీ దారుణంగా మారుతోంది. రాబోయే రోజుల్లో ఇంకా దుర్దినాలే ఉండబోతున్నయ్. ఇంకా టీవీ మీడియా జర్నలిస్టులకు సెగ తగలడం లేదు. కానీ పత్రికలు మూతపడుతున్నయ్, కొలువులకు భద్రత లేదు. జీతాలు కోస్తున్నారు. అసలే అరకొర.. అందులోనూ కోతలు… అసలు నిలబడతామా, బజారున పడతామా..? తెలుగు, హిందీ, ఇంగ్లిష్… భాషాభేదం ఏమీ లేదు… అన్ని పత్రికలదీ అదే దురవస్థ…

టీవీ మీడియాలో ఫీల్డ్ రిపోర్టర్ల పరిస్థితీ అంత గొప్పగా ఏమీలేదు.. పరుగు, పరుగు… కాలంతో పరుగు… వృత్తిపరమైన ఒత్తిళ్లతో… అకాల వృద్ధాప్యాలు, అర్ధంతరంగా చావులు…

అసలు జర్నలిస్టు బతుకే ఫుల్ రివర్స్… దొరికే ఈమాత్రం జీతానికి సెలవులు సరిగ్గా దొరకవు, ఏ సాయంత్రమూ మనది కాదు… వేరే వృత్తులకూ దీనికీ అస్సలు పొసగదు… బంధువులో, మిత్రులో దేనికి పిలిచినా వెళ్లే సీన్ ఉండదు, అందరూ దూరం అవుతుంటారు… అందరూ వాడుకునేవాళ్లే, తీరా ఆపదొస్తే ఎవ్వడూ ఆదుకోడు… కరివేపాకు బతుకులు… ఆరోగ్యానికి భద్రత లేదు… ఆర్థికానికి భద్రత లేదు… ఏ నలభై దాటాకో, యాభై దాటాకో వెనక్కి తిరిగి చూసుకుంటే… బీపీలు, సుగర్లు, అల్సర్లు… ముందే పలకరించే ముసలితనం… ఇక ఏ పనికీ అక్కరకురాని చెరుకు పిప్పి..! కొన్ని వందల ఉదాహరణలు…

కరోనా కల్లోలానికి ఆగమైన బతుకులు ఎవరివైనా ఉన్నాయంటే అవి జర్నలిస్టులవే.. ఫ్రంట్ వారియర్స్ అని పేరుకు పొగడ్త… కానీ పారిశుద్ధ్య సిబ్బందికి, పోలీసులకు, డాక్టర్లకు, పారామెడికల్ స్టాఫ్‌కు… చివరకు కరెంటోళ్లను కూడా ఇదే జాబితాలో చేర్చారు పాలకులు.. కానీ జర్నలిస్టులకు ఏ దిక్కూ లేదు.. మరీ మరీ అడిగితే పది కిలోల బియ్యం, అయిదు కిలోల కూరగాయలు పంపిణీ.. అదీ జర్నలిస్టుల బతుకు…

పుసుక్కున ప్రాణగండం వస్తే… బీమా లేదు, ధీమా లేదు… భార్యాబిడ్డలకు దిక్కూ లేదు… మేనేజ్మెంట్లు వదిలేస్తాయి, ప్రభుత్వాలు పట్టించుకోవు… ఎంత దారుణం అంటే..? ఓ పత్రిక హెడ్డాఫీసులో ఓ రిపోర్టర్‌కు కరోనా పాజిటివ్… మిగతావారిలో భయం… పరీక్షలు చేయించండి మహాప్రభో అని మొత్తుకుంటే కనికరించినవారు లేరు… మరో పత్రికలోనూ అదే దుర్గతి… జాతీయ చానెళ్ల వీడియోమెన్, ఢిల్లీలో జర్నలిస్టులూ ఈ కరోనా సెగను అనుభవించారు…

అందుకే ఇప్పుడు జర్నలిజం అనే వృత్తి వైపు ఎవరూ రావడం లేదు.. నిజానికి ఇప్పుడున్న స్థితిలో ఈ వృత్తి వైపు రావాలని కోరడమూ అన్యాయమే.. జర్నలిజం అనేది ఈరోజుల్లో మీడియా హౌజుల ఓనర్ల ప్రయోజనాలకు మాత్రమే… సమాజానికి కాదు, జర్నలిస్టులకు అంతకన్నా కాదు.. ఎంత సర్దిచెప్పుకున్నా, ఈ భావనను ఎంత దాచేసుకుంటున్నా సరే… పదే పదే పైకి లేచి వికృతరూపంలో వికటంగా నవ్వుతూ వెక్కిరిస్తున్న చేదునిజం ఇదే…

ప్రస్తుతం కరోనాతో 33 ఏళ్లకే మరణించిన ఓ ప్రముఖ న్యూస్ చానెల్ క్రైం రిపోర్టర్ దీనగాథ జర్నలిస్టు సర్కిల్స్ లో హాట్ టాపిక్ గా మారింది.. అతడు కరోనాతో ఆస్పత్రిలో చికిత్స పొందుతుండగా చూసిన దైన్యాన్ని వాట్సాప్ లో ఫ్రెండ్స్ కు షేర్ చేసుకున్నాడు. ఐసీయూలో చికిత్స పొందుతున్న మనోజ్.. ఇది ఏమాత్రం బాగాలేదని.. నన్ను ఏదైనా ప్రైవేట్ ఆస్పత్రికి తరలించాలని స్నేహితులను వేడుకున్న ధైన్యం కనిపించింది. ఇక్కడ ఎవరూ పట్టించుకోవడం లేదని.. తనను బతికించండి అని వేడుకుంటూ స్నేహితుడికి వాట్సాప్ చేసిన స్క్రీన్ షాట్స్ ఇప్పుడు మీడియాలో వైరల్ అవుతున్నాయని.. రోగం వచ్చిందని గాంధీ ఆసుపత్రికి వెళ్లే కన్నా.. స్వశానానికి వెళ్లి పడుకోవడం ఉత్తమం అని మనోజ్ అన్న మాట ఇప్పుడు తెలంగాణలో కరోనా కేంద్రంగా ఉన్న గాంధీ ఆస్పత్రి లోగుట్టును బయటపెడుతోంది.

మనోజ్ చావు బతుకుల మధ్య పంపిన ఈ వాట్సాప్ స్క్రీన్స్ షాట్స్ తో తెలంగాణలో వైద్య ఆరోగ్యం పరిస్థితి కళ్లకు కట్టింది. మీడియా మనోజ్ లాంటి జర్నలిస్టు వార్తలు బయటపడకుండా జాగ్రత్త పడుతోంది. ప్రభుత్వాన్ని కాపాడుతున్నాయి. ఇంకా ఎంతమంది ఇలాంటి చావులు చూశాకైనా ఈ మీడియా, ప్రభుత్వాలు కళ్లు తెరుస్తాయో చూడాలి మరీ..

NARESH
NARESHhttps://oktelugu.com/
Naresh Ennam is a Editor who has rich experience in Journalism and had worked with top Media Organizations.He has more than 19 years experience in Journalism. He has good Knowledge on political trends and can do wonderful analysis on current happenings on Cinema and Politics. He Contributes Politics, Cinema and General News.
Exit mobile version