
దేశమంతా విస్తరించిన కమల దళం దక్షిణాదిన మాత్రం బలం పుంజుకోవడం లేదు. ఒక్క కర్ణాటక తప్పితే కేరళ, తమిళనాడు, తెలుగు రాష్ట్రాల్లో అస్సలు ఉనికి చాటుకోవడం లేదు. అయితే ఇప్పుడు తెలంగాణపై బీజేపీకి కొత్త ఆశలు పుట్టుకొచ్చాయి. ప్రతిపక్ష కాంగ్రెస్ కుదేలై ఆ పార్టీ స్థానంలోకి బీజేపీ దూసుకొచ్చింది. దుబ్బాకలో గెలుపు.. జీహెచ్ఎంసీలో టఫ్ ఫైట్ ఇచ్చి 2024 సార్వత్రిక ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా ముందుకెళుతోంది. ఇక ఏపీలో కూడా ఇదే స్ట్రాటజీతోనే బీజేపీ సాగుతోంది..
Also Read: టీఆర్ఎస్ మేయర్ వ్యూహం ఏంటి?
ఆంధ్రప్రదేశ్ లోని ప్రధాన ప్రతిపక్షం టీడీపీని ఎప్పుడో బీజేపీ టార్గెట్ చేసింది. తెలంగాణలో లాగానే బలపడాలని చూస్తోంది. అందుకే ఏపీ బీజేపీ చీఫ్ గా సోము వీర్రాజును నియమించింది. ఇటు బండి సంజయ్ రెండు ఎన్నికలతో నిరూపించుకోగా.. ఇప్పుడు సోము వీర్రాజు ‘తిరుపతి’ ఉప ఎన్నికతో అదే పనిలో ఉన్నాడు. అక్కడ కూడా పాజిటివ్ వేవ్ వస్తే టీడీపీని తోసేసి ఏపీలో ప్రతిపక్షంగా బీజేపీ ఎదగవచ్చు.
ప్రస్తుతం బీజేపీ ఫుల్ ఫోకస్ తెలంగాణపై ఉంది. ఆ తర్వాతే ఏపీపై ఫోకస్ చేయనుంది. ఒక రాష్ట్రం తర్వాత మరొక రాష్ట్రంపై బీజేపీ కన్నేసినట్టు తెలుస్తోంది.
ఏపీలో అధికార, ప్రతిపక్షాలైన వైసీపీ, టీడీపీ బలంగా ఉన్నాయి. ప్రజలంతా వైసీపీకి ఏకపక్షంగా మద్దతు ఇచ్చారు. ఈ క్రమంలోనే అక్కడ బీజేపీకి అవకాశాలు తక్కువే.
తెలంగాణలో కేసీఆర్ తీరు.. వ్యతిరేకత బీజేపీకి కలిసివచ్చింది. అతివిశ్వాసం కేసీఆర్ కొంప ముంచుతోంది. ఆయన వ్యవహారశైలి కూడా ఇందుకు కారణంగా నిలుస్తోంది. తెలంగాణలో కేసీఆర్ ఆడింది ఆట పాడింది పాటగా ఇన్నాళ్లు ఉండేది. కానీ ఇప్పుడు బలమైన ప్రత్యామ్మాయంగా బీజేపీని ఓటరు తనే స్వయంగా తయారు చేసుకున్నాడు. కేసీఆర్, టీఆర్ఎస్ పై వ్యతిరేకతతోనే బీజేపీ బలపడిందన్నది కాదనలేని వాస్తవం.
Also Read: జిహెచ్ఎంసి ఫలితాల సారాంశం/పాఠాలు
అయితే తెలంగాణ ఇంటి పార్టీ గ్రేటర్ లో తక్కువ సీట్లు సంపాదించినా ఆ పార్టీ పరువును కాపాడింది ఖచ్చితంగా పొరుగున ఉన్న ఆంధ్ర సెటిలర్లే అనడంలో ఎలాంటి సందేహం లేదు. తెలంగాణ ప్రజలు తిరస్కరించినా గ్రేటర్ ఎన్నికల్లో టీఆర్ఎస్ ప్రతిష్టను నిలిపారంటే అది ఏపీ సెటిలర్లే. ఏపీ సెటిలర్లు ఎక్కువగా ఉండే కూకట్ పల్లి, శేరిలింగంపల్లి, కుత్బుల్లాపూర్ నియోజకవర్గాల్లో కేవలం 3 డివిజన్లు తప్పించి మిగిలిన అన్ని చోట్ల టీఆర్ఎస్ విజయం సాధించింది. అదే జరగకపోతే టీఆర్ఎస్ కు ఘోర ఓటమి ఎదురయ్యేది.
కేసీఆర్ తెలంగాణ ఉద్యమంలో దుమ్మెత్తిపోసిన ఆంధ్రులే ఆయన పరువును జీహెచ్ఎంసీ ఎన్నికల్లో కాపాడినట్టు తెలుస్తోంది. టీఆర్ఎస్ వైపే ఆంధ్రా ఓటర్లు నిలిచారు. అయితే ఈ తీర్పు బీజేపీకి శరాఘాతంగా మారింది. ఏపీలో పుంజుకోవాలనుకుంటున్న బీజేపీకి గ్రేటర్ లోని ఆంధ్రా ఓటర్ల నాడి షాక్ కు గురిచేసింది. జనసేనతో పొత్తు పెట్టుకున్న బీజేపీని ఆంధ్రులు తిరస్కరించిన నేపథ్యంలో ఏపీలో బీజేపీకి అంత ఈజీ కాదన్న వాదన వినిపిస్తోంది.
మరిన్ని ఆంధ్ర రాజకీయ వార్తల కోసం ఏపీ పాలిటిక్స్
-నరేశ్