ఆయన స్టైల్ ఎవర్ గ్రీన్.. ఆయన చూపు చురకత్తి.. ఆరు పదులు దాటినా ఆయన కోసం పడిచచ్చే అభిమానులు ఎందరో.. దాదాపు 25 ఏళ్లుగా దక్షిణాది సూపర్ స్టార్ గా వెలుగొందుతున్న రజినీకాంత్ రాజకీయ ప్రవేశం దాదాపు రెండు పుష్కరాల తర్వాత జరుగుతుండడం విశేషం.
Also Read: కేంద్రంతో రైతుల చర్చలు మరోసారి వాయిదా.. కొసాగుతున్న ప్రతిష్టంభన..!
నా దారి రహదారి అంటూ సూపర్‌స్టార్ రజనీకాంత్ రాజకీయ రంగ ప్రవేశంపై మూడేళ్లుగా నెలకొన్న సస్పెన్స్‌కు తెరదింపారు. రాజకీయాల్లోకి రావాలా వద్దా అన్న ఊగిసలాటకి ఎట్టకేలకు తెరదించారు. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలకు సరిగ్గా 6 నెలల ముందు రాజకీయాల్లోకి వస్తున్నట్టుగా ప్రకటించారు.
వచ్చే ఏడాది జనవరిలో రాజకీయ పార్టీ ప్రారంభిస్తానని, దీనికి సంబంధించిన వివరాలను డిసెంబర్ 31న వెల్లడిస్తానని పేర్కొన్నారు. కుల, మత, ప్రాంతాలకు అతీతంగా తాము ఆధ్యాత్మిక లౌకిక రాజకీయాలనే కొత్త పంథాలో నడవనున్నట్టు తెలిపారు.
గత అక్టోబర్‌లో అనారోగ్య కారణాలతో రాజకీయాల్లోకి రాలేనంటూ రజనీకాంత్ పేరిట రాసిన ఒక లేఖ సోషల్ మీడియాలో వైరల్ అయిన విషయం తెలిసిందే. ఆ లేఖలో పేర్కొన్నట్టుగా అనారోగ్య సమస్యలు తనని వేధిస్తున్నాయని, కిడ్నీ మార్పిడి ఆపరేషన్ అవడంతో కరోనా వ్యాక్సిన్ వచ్చే వరకు సమూహాలకు దూరంగా ఉండాలని వైద్యులు సలహా ఇచ్చారని అప్పట్లోనే చెప్పారు.
రజనీకాంత్ 2021 జనవరిలో రాజకీయ పార్టీని ప్రారంభించనున్నట్లు ప్రకటించారు. వచ్చే తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో తమ పార్టీ పోటీ చేస్తుందని చెప్పారు. ఆయన అభిమానులు రజనీకాంత్ పార్టీ అధికారిక ప్రకటన కోసం 1990లనుంచీ ఎదురుచూస్తున్నారు.
Also Read: ఏపీలో కలకలం.. కళ్లు తిరిగి పడిపోతున్న ప్రజలు
*రజినీకాంత్ రాజకీయ అడుగులు..
మొదటిసారిగా 1996లో రజనీకాంత్ రాజకీయాల పట్ల ఆసక్తి చూపిస్తున్నారన్న విషయం వెలుగులోకి వచ్చింది. అప్పటి తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత దత్త పుత్రుడు వీఎన్ సుధాకరన్ వివాహం విలాసవంతంగా, అంగరంగ వైభోగంగా జరగడం జాతీయ స్థాయిలో పలువురి దృష్టిని ఆకర్షించింది.అప్పుడు రజనీకాంత్, ప్రభుత్వంలో చాలా అవినీతి పేరుకుపోయిందని, ఇలాంటి ప్రభుత్వం కొనసాగడానికి వీల్లేదని బహిరంగంగా విమర్శించారు.
తొలిసారిగా రజనీకాంత్ రాజకీయ అంశాల గురించి 1995లో పెదవి విప్పారు. ఎంజీఆర్ కళగం పార్టీ అధ్యక్షుడు ఆర్ఎం వీరప్పన్ హాజరైన ఒక సమావేశంలో రజనీకాంత్ మాట్లాడుతూ… తమిళనాడులో బాంబుల కల్చర్ పెరిగిపోయిందని, దీనికి తమిళనాడు ప్రభుత్వం బాధ్యత వహించాలని అన్నారు.
మూపనార్ అనే నేత 1996లో కాంగ్రెస్ పార్టీనుంచీ బయటకు వచ్చి, తమిళ మానిల కాంగ్రెస్ అనే పార్టీని స్థాపించారు. అప్పట్లో పీవీ నరసింహరావు భారత ప్రధానిగా ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ తమిళనాడులో ఏడీఎంకే పొత్తు కోసం ప్రయత్నిస్తోంది. దీన్ని వ్యతిరేకిస్తూ మూపనార్ కాంగ్రెస్ నుంచి బయటకు వచ్చి, తమిళ్ మానిల కాంగ్రెస్ స్థాపించి డీఎంకేతో పొత్తు పెట్టుకున్నారు.
ఈ క్రమంలోనే రజనీకాంత్ డీఎంకే కూటమికి బహిరంగంగా తన మద్దతు ప్రకటించారు. ఆయన ఒక రాజకీయ పార్టీకి మద్దతు ప్రకటించడం అదే తొలిసారి. అప్పటి ఏడీఎంకే ప్రభుత్వంపై ప్రజలు తీవ్ర అసంతృప్తితో ఉండడంతో ఆ అసెంబ్లీ ఎన్నికల్లో డీఎంకే ఘన విజయం సాధించింది. ఈ విజయంలో రజనీకాంత్ పాత్ర కూడా ఉందని, ఆయన బహిరంగంగా మద్దతు తెలపడం సానుకూల ఫలితాలనిచ్చిందని పలువురు భావించారు. ఎన్నికల సమయంలో రజనీకాంత్ అభిమానులు డీఎంకే కూటమికి మద్దతుగా నిలుస్తూ తమ సహాయ సహకారాలు అందించారు.
మరిన్ని జాతీయ రాజకీయ వార్తల కోసం జాతీయ పాలిటిక్స్
తాను రాజకీయాల్లోకి వస్తున్నట్టు డిసెంబర్ 31, 2017న ప్రకటించారు రజినీకాంత్. అయితే తాను కొత్త పార్టీ పెడతానని కానీ, వేరే పార్టీలో చేరతానని కానీ అప్పుడు ఆయన చెప్పలేదు. ఆ తరువాత రాజకీయాల్లో యాక్టివ్‌గా ఉండేందుకు కూడా ప్రయత్నించలేదు. లోక్‌సభ ఎన్నికలు తమకు ప్రాధాన్యం కాదని ప్రకటించారు. మూడేళ్ల నుంచి రాజకీయాలపై రజినీకాంత్ నుంచి ఎలాంటి స్పష్టమైన ప్రకటన రాకపోవడంతో.. ఆయన పొలిటికల్ ఎంట్రీ ఉండకపోవచ్చని అంతా అనుకున్నారు. అయితే మరికొన్ని నెలల్లోనే తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న తరుణంలోనే కొత్త రాజకీయ పార్టీ ఏర్పాటు చేస్తానని ప్రకటించి తమిళనాడు రాజకీయాల్లో రజినీకాంత్ వేడి పుట్టించారు. మూడేళ్ల క్రితం డిసెంబర్ 31న రాజకీయాల్లోకి వస్తున్నట్టు ప్రకటించిన రజినీకాంత్.. రాబోయే డిసెంబర్ 31న తన కొత్త పార్టీ వివరాలు ప్రకటించనున్నారు.