ఉగాది నాటికి 25 లక్షల మందికి ఇళ్ల స్థలాలు అందించేందుకు నిరుపేదల భూములను బలవంతంగా లొక్కొనే ప్రయత్నాలు జరుగుతూ ఉండడం పట్ల సర్వత్రా నిరసనలు వ్యక్తం అవుతున్నాయి. ప్రభుత్వం పేదల పొట్టగొట్టేలా వ్యవహరిస్తోందనే విమర్శలు చెలరేగుతున్నాయి.
రాష్ట్రవ్యాప్తంగా అసైన్‌మెంట్, ప్రభుత్వ పోరంబోకు భూములను సుదీర్ఘకాలంగా సాగు చేసుకుంటూ పట్టాల కోసం ఎదురుచూస్తోన్న పేదల భూములను దౌర్జన్యంగా, చట్టవిరుద్ధంగా స్వాధీనం చేసుకుంటున్నారనే ఆరోపణలు చెలరేగుతున్నాయి. ఈ విషయమై పలుచోట్ల అధికార యంత్రాంగం ప్రతి చోటా అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నది.
2013 భూసేకరణ చట్టం ప్రకారం అన్ని భూములకూ పరిహారం అందించేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవలసి ఉంది. దల భూములు, అసైన్‌మెంట్ భూముల జోలికి వెళ్లే అవకాశం లేదని ముఖ్యమంత్రి బహిరంగంగా ప్రకటించినా అధికారులు ఆ విధంగా చేస్తుండటం గమనార్హం. కోర్టు తీర్పులను పెడచెవిన పెట్టి, భూములు లాక్కోవాలని చూస్తే ఉద్యమిస్తామని ప్రతిపక్ష నేతలు హెచ్చరిస్తున్నారు.
అప్పులు పేరుకుపోయి ఉన్న రాష్ట్రంలో ఉగాది నాటికి 25 లక్షల ఇళ్ల స్థలాల పంపిణీ అసాధ్యమని, ఇప్పటికైనా ముఖ్యమంత్రి పునరాలోచించాలని మాజీ మంత్రి వడ్డే శోభనాద్రీశ్వరరావు సూచించారు. సిఎంకు సరైన సలహాలు ఇవ్వాల్సిన బాధ్యత ప్రభుత్వ సలహాదారులకు ఉన్నప్పటికీ వారు డూడూ బసవన్నల్లా వ్యవహరించడం సిగ్గుచేటని విమర్శించారు.
కాగా, తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్ర వరం బొమ్మూరులోని పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయానికి చెందిన భూములను ఇళ్లస్థలాలుగా కేటాయించే నిర్ణయం పట్ల ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ఈ నేపథ్యంలో కలెక్టర్ జారీ చేసిన ప్రొసీడింగ్‌ను నిలుపుదల చేయాలని రాజమహేంద్రవరం మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్‌కుమార్ ముఖ్యమంత్రి జగన్‌కు లేఖ పంపారు.
తెలుగు యూనివర్సిటీకి చెందిన 20 ఎకరాల భూములను ఇళ్లస్థలాల కోసం సేకరించాలని కలెక్టర్ డి.మురళీధర్‌రెడ్డి ఈనెల 17న ప్రొసీడింగ్స్‌ను జారీ చేశారు.యూనివర్సిటీ భూములను ఇళ్లసలాల సేకరణకు కుదరదని ఆ లేఖలో అరుణ్‌కుమార్ పేర్కొన్నారు. రాష్ట్ర విభజన చట్టంలో పొందుపరిచిన సెక్షన్ 75 సెంట్రల్ యాక్ట్ 6/2014 ప్రకారం వీలు కాదని స్పష్టం చేశారు.
రాష్ట్ర విభజన జరిగినప్పటికీ ఉభయ తెలుగు రాష్ట్రాల్లోని ఉమ్మడిగా ఉన్న ఐదు తెలుగు యూనివర్సిటీ క్యాంపస్‌ల పంపకాలు జరగలేదని పేర్కొన్నారు. వర్సిటీ విభజన జరగకుండా ఆ యూనివర్సిటీ భూములను సేకరణ ఎలా చేస్తారని ప్రశ్నించారు.