
నిర్దుష్టంగా నిధులు కేటాయించకుండా ఆర్ధిక మంత్రి నిర్మల సీతారామన్ రూ 1.70 లక్షల కోట్లు అంటూ కరోనా సంబంధ దిగ్బంధానికి గురైన పేదలకు భారీ పధకాన్ని ప్రకటించారు. ప్రభుత్వంపై భారం పడకుండా, వివిధ ప్రభుత్వ రంగ సంస్థలకు, ఇప్పటికే ఉన్న ఆయా సంస్థల ఆర్ధిక వనరుల నుండే వ్యయం చేయడానికే ఆమె ప్రతిపాదించారు.
ఉదాహరణకు భవన నిర్మాణ కారకులు, గనుల కార్మికులకు ఇప్పటికే ఉన్న సంక్షేమ నిధులను రాష్ట్ర ప్రభుత్వాలను ఖర్చు పెట్టుకోమన్నారు. అదే విధంగా భవిష్యత్ నిధికి సంబంధించి ఉద్యోగులు తీసుకోనని నిధులు ఆ సంస్థ వద్ద వేల కొలది కోట్ల నిధులు మురుగుతున్నాయి. వాస్తవానికి అవి కార్మికులవే గాని, వాటికి – ప్రభుత్వానికి సంబంధం లేదు.
ఇక జాతీయ ఉపాధి హామీ పధకం క్రింద వేతనాలను రోజుకు రూ 20 పెంచడం కూడా గత వారమే వార్షిక పెంపుదలలో భాగంగా గ్రామీణ మంత్రిత్వ శాఖ పెంచిన నిధులు. గాని ఇప్పుడు కరోనా దృష్ట్యా ప్రత్యేకంగా పెంచుతున్నవి కావు. పైగా, సగటున 50 రోజులకు మించి ఈ పధకం క్రింద పనిచేయడం లేదు. అటువంటప్పుడు ఈ పెంపుదలతో రూ 2,000 అదనపు ప్రయోజనం అని ఏ విధంగా చెబుతారు? కాగా, పనితో నిమిత్తం లేకుండా వేతనాల చెల్లింపును ఉపాధి హామీ పథక కార్మికులు కోరుతున్నారు.
ఇక ఉజ్వల పధకం క్రింద ఇవ్వదలచిన ఉచిత గ్యాస్ సైలెండర్ల వ్యయాన్ని లాభదాయకమైన స్థితిలో ఉన్న ఆయా ప్రభుత్వ రంగ సంస్థలే భావించవలసి ఉంటుంది. ఈ పధకం క్రింద తీసుకున్న సిలెండర్ లలో సగంకు పైగా ఉత్తర ప్రదేశ్ వంటి రాష్ట్రాలలో వివిధ కారణాల చేత వినియోగంలో లేవని కొన్ని అనధికార సర్వేలు తెలపడం గమనార్హం.
రైతులకు వెంటనే జమ చేస్తామని అంటున్న రూ 2,000 సహితం వారికి సాలీనా రూ 6,000 ఇస్తామని భరోసా ఇచ్చిన మొత్తం నుండే గాని, అదనంగా ఇవ్వడం లేదు. పైగా, ఈ పధకం కౌలు రైతులకు, భూమి లేని వ్యవసాయ కార్మికులకు ఎటువంటి ప్రయోజనం కలిగించదు. పలు రాష్ట్రాలలో రైతులకేనా వారి సంఖ్యే ఎక్కువగా ఉండడం గమనార్హం.
దిగ్బంధనం కారణంగా అసంఘటిత కార్మికులు పెద్ద సంఖ్యలో వివిధ రాష్ట్రాలలో చిక్కుకు పోయారు. వారి కోసం ఆమె ప్యాకేజీలో కొంత స్థానం ఇస్తే బాగుండెడిది. బీహార్, ఒడిశా ముఖ్యమంత్రులు వారిని ఇతర రాష్ట్రాల నుండి తమ రాష్ట్రంకు తరలించడానికి పూర్తి వ్యయం భరిస్తామని ప్రకటించడం గమనార్హం.
ఇతర దేశాల్లో చిక్కుకుపోయిన అనేక మంది భారతీయులను మనం విమానాల ద్వారా ఇక్కడకు తరలించిన ప్రభుత్వం ఉపాధి నిమిత్తం ఇతర రాష్ట్రాలకు వలస వెళ్లిన వారు తిరిగి తమ సొంత ప్రాంతాలకు వెళ్లేందుకు సంబం ధించినటువంటి అంశం ఈ ప్యాకేజీలో చోటుచేసుకోలేదు.
ఆరోగ్య కార్యకర్తలకు ప్రకటించిన బీమా సౌకర్యం వలన ప్రభుత్వానికి ఎటువంటి ఖర్చు ఉండే అవకాశం లేదు. ఈ అంశం ప్రయివేటు రంగానికి కూడా వర్తిస్తుందా అన్న దానిపై స్పష్టత లేదు. వారికి అత్యవసరంగా కావాల్సిన రక్షణ పరికరాలు, మెడిసన్, పరీక్షా సదుపాయాలపై ప్రస్తావనే లేకపోవడం విస్మయం కలిగిస్తుంది.