కరోనా వైరస్ తో దేశవ్యాప్త దిగ్బంధనం ప్రకటించినా వ్యవసాయ పనులకు మాత్రం అడ్డు ఉండబోదని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు భరోసా ఇస్తున్నా మొత్తం ఆర్ధిక కార్యకలాపాలు స్తంభించి పోవడంతో రైతులు ఆర్ధికంగా కుంగిపోతున్నారు. ఇప్పటికే పంటల కోతలు పూర్తయి సరైన ధరలేక అమ్మకాలు జరగని ఖరీఫ్ పంటలు ఒక వైపు, ఇప్పుడిప్పుడే కోతలకొస్తున్న రబీ పంటలు మరో వైపు వారిని వేధిస్తున్నాయి.
ఇటువంటి కీలక సమయంలో కరోనా కట్టడికి ప్రభుత్వం లాక్‌డౌన్ ప్రకటించడంతో ఎక్కడి పనులు అక్కడ ఉన్నపళంగా స్తంభించిపోయాయి. ఏప్రిల్ 1 నుంచి పంటల కొనుగోళ్లు ప్రారంభిస్తామని ప్రభుత్వం ఇంతకు ముందు ప్రకటించింది. కానీ ఇప్పుడు ఆ విషయమే అనుమానాలు తలెత్తుతున్నాయి.
మిగిలిన జిల్లాలతో పోల్చితే ఆలస్యంగా నెల్లూరులో ఖరీఫ్ వరి సాగవుతుంది. ఫిబ్రవరి నుంచి పంటలు చేతికొస్తాయి. లాక్‌డౌన్‌కు ముందే నెల్లూరులో ధాన్యం కొనుగోళ్లు సాఫీగా లేవు. అలాంటిది లాక్‌డౌన్ వేళ ఎక్కడికక్కడ కొనుగోళ్లు నిలిచిపోయాయి.
జిల్లాలో లక్షన్నర హెక్టార్లలో సన్నరకం వరి సాగైందని అంచనా. ఈ తడవ దిగుబడి ఆశాజనకంగా ఉంది. ఎంత లేదన్నా లక్షన్నర టన్నుల ధాన్యం రైతుల వద్ద పేరుకుపోయింది. కచ్చితంగా కనీస మద్దతు ధర (ఎంఎస్‌పి)పై ధాన్యం మొత్తాన్నీ కొంటామని ప్రభుత్వం పేర్కొన్నా అందుకు తగ్గ చర్యలు కనబడటం లేదు.
మరోవంక, విజయనగరం జిల్లాలో గోదాములు ఖాళీ లేవన్న పేరుతో రైతుల నుంచి ధాన్యం కొనట్లేదు. ఈ సమస్య నెల రోజుల ముందే ప్రభుత్వ దృష్టికి వచ్చినా పరిష్కారం కాలేదు. ఇదిలా ఉండగా రబీలో రాష్ట్ర వ్యాప్తంగా టార్గెట్‌కు మించి వరి సాగైంది. సాగు లక్ష్యం 7.40 లక్షల హెక్టార్లకు 8.07 లక్షల హెక్టార్లలో వరి సేద్యం జరిగిందని వ్యవసాయశాఖ చెబుతోంది.
ఏప్రిల్ నుంచి కోతలు మొదలవుతాయి. పెద్ద ఎత్తున ధాన్యం మార్కెట్‌కొస్తుంది. రైతులకు పడే ధరలపై కరోనా, లాక్‌డౌన్‌ల ప్రభావం పడే అవకాశం ఉందన్న ఆవేదన రైతులను నిద్ర పోనీయట్లేదు.
ఇంకోవైపు, రబీలో సాగైన మొక్కజొన్న, పప్పుశనగ, మినుములు, పెసర, జొన్న కోతలు మొదలయ్యాయి. లాక్‌డౌన్‌కు ముందే అక్కడక్కడ మార్కెట్‌కు కూడా వచ్చాయి. ఎంఎస్‌పిపై రైతులు భయభ్రాంతులకు గురవుతున్నారు. మొక్కజొన్న, పప్పుశనగ రబీలో ఆశాజనకంగా సాగవగా, మినుములు, పెసలు సాధారణం కంటే తక్కువ పడ్డాయి.
ఉభయగోదావరి, కృష్ణా, గుంటూరు, ప్రకాశం, కర్నూలు జిల్లాల్లో ఈ పంటలు ఎక్కువగా సాగయ్యాయి. రాయలసీమ జిల్లాల్లో ఖరీఫ్‌లో పండిన కందులను ప్రభుత్వం కొనలేదు. తెగుళ్లతో మిరప రైతు నష్టపోగా, చేతికొచ్చిన పంటకు ధర తొలుత బాగానే ఉందనిపించినా, ఇప్పుడు అమాంతం తగ్గిపోయింది. ఒకానొకదశలో క్వింటాలుకు గరిష్టంగా రూ.20 వేల వరకు పలకగా అనంతరం క్రమంగా రూ.ఏడెనిమిది వేలకు దిగజారింది. లాక్‌డౌన్‌తో అదీ లేదు.
కడప, అనంతపురం జిల్లాల్లో అరటి ధర బాగా దిగజారింది. టన్ను రూ.20 వేల నుంచి ఏడు వేలకు పడిపోయింది. ప్రభుత్వం రూ.8 వేలకు కొంటామన్నప్పటికీ ఆచరణ మొదలవలేదు. ఇంతలో లాక్‌డౌన్ రావడంతో అదీ ఆగిపోయింది. లాక్‌డౌన్‌తో టమాటా ధర ఒక్కసారిగా బహిరంగ మార్కెట్‌లో కిలో రూ.45కు చేరగా ఇంతకుముందు కొనే దిక్కులేక రైతులు పొలాల్లోనే పంటను వదిలేశారు. ధర పెరిగిందని టమాటాను తీద్దామన్నా చేజారిపోయిందని రైతులు వాపోతున్నారు.
మామిడి సీజన్ ఆరంభంలోనే లాక్‌డౌన్‌లు వచ్చి, ఎగుమతులపై భరోసా లేక భవిష్యత్తులో భారీగా ధరల పతనం తప్పదన్న ఆందోళన రైతుల్లో నెలకొంది. రవాణా సౌకర్యం లేక ములగ, ఇతర కూరగాయల ధరలు బహిరంగ మార్కెట్‌లో పెరగ్గా, రవాణ లేదన్న పేరుతో రైతులకు వ్యాపారులు, దళారీలు ధరలు దిగ్గొస్తున్నారు. ట్రాన్స్‌పోర్టు సమస్య, ఎగుమతులు నిలిచిపోయాయన్న వదంతులతో ఆక్వా రైతులు, ఆ రంగంపై ఆధారపడ్డ మత్స్యకారులు, కూలీలు నష్టాలపాలవుతున్నారు.
Neelambaram is a Web Admin and is working with our organisation from last 6 years and he has good knowledge on Content uploads and Content Management in website. He takes cares of all Content uploads and Content administration on our website.
Read MoreWeb Title: Ap farmers who are economically stunted with corona
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com