ఈ నెలలో జరుగనున్న స్థానిక సంస్థల ఎన్నికలు ఒక విధంగా 10 నెలల వై ఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంపై ప్రజా తీర్పుగా మారనున్నాయి. అయితే ముఖ్యమంత్రి మాత్రం ఈ ఎన్నికలు మంత్రులు, ఎమ్యెల్యేల సమర్ధతకు పరీక్షగా పెడుతున్నారు. ఎక్కడైతే పార్టీ అభ్యర్థులు ఓటమి చెందారో అక్కడి మంత్రులు నేరుగా గవర్నర్ ను కలసి రాజీనామా సమర్పించ వలసిందే అని స్పష్టం చేశారు. అదే విధంగా సంబంధిత ఎమ్యెల్యేలకు వచ్చే ఎన్నికలలో సీట్లు ఇవ్వబోమని కూడా తేల్చి చెప్పారు.
బుధవారం జరిగిన మంత్రివర్గ సమావేశం సందర్భంగా మంత్రులతో స్థానిక సంస్థల ఎన్నికల గురించి చర్చించిన ముఖ్యమంత్రి స్థానిక సంస్థల్లో పార్టీ అభ్యర్థుల గెలుపు,ఓటములు ఆయా జిల్లా ఇన్‌చార్జీ మంత్రులు, జిల్లామంత్రి బాధ్యత వహించాల్సి ఉంటుందని స్పష్టం చేశారు.
ఎన్నికల్లో మంత్రుల నియోజకవర్గాల్లో ఓటమి పాలైతే ఎన్నికల ఫలితాలు రాగానే ఇందుకు బాధ్యులు తమ పదవుల నుండి తప్పుకోవాల్సిఉంటుందని, వారే గవర్నర్‌కు రాజీనామా లేఖను సమర్పించాలని సిఎం హెచ్చరించారు.
అత్యధిక సీట్లు సాధించలేకపోయిన ఎమ్మెల్యేలకు 2024 ఎన్నికల్లో సీట్లు ఇచ్చేది లేదని చెప్పినట్లు సమాచారం. ఈనెల 10న స్థానిక సంస్థల ఎన్నికల నోటిఫికేషన్ వెలువడనున్న నేపథ్యంలో ఈనెల 8 తేదీ వరకు నియోజకవర్గాల స్థాయిలో అభ్యర్థుల ఎంపిక, గెలుపు అవకాశాలు , ఆశావహులు జాబితా, తదితర అంశాలను పరిగణలోకి తీసుకునేందుకు కార్యకర్తల సమావేశాలు నిర్వహించాలని ముఖ్యమంత్రి ఆదేశించారు.
పలు జిల్లాల్లో పార్టీ నేతల మధ్య పోరు నడుస్తున్నట్లు నిఘా వర్గాల నుంచి సమాచారం అందుతోందని, నేతల మధ్య సయోధ్య కుదర్చాల్సిన బాధ్యత ఆయా జిల్లా ఇన్‌చార్జీ మంత్రులదేనని కూడా చెప్పారు. అవసరాన్ని బట్టి జిల్లా మంత్రి తో కలిసి స్థానిక సమస్యలను పరిష్కరించి స్థానిక ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా ముందుకు సాగాలని సిఎం జగన్‌మోహన్‌రెడ్డి మంత్రులను ఆదేశించారు.