గత లోక్ సభ ఎన్నికల ముందు నుండే జాతీయ రాజకీయాలపై ఆసక్తి కనబరుస్తున్న తెలంగాణ ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు ఇప్పుడు అందుకు అనుకూల సమయం వచ్చిన్నట్లు భావిస్తున్నట్లు తెలుస్తున్నది. అందుకనే ప్రస్తుతం జరుగుతున్న రాజ్యసభ ఎన్నికలలో రాజ్యసభకు వెళ్లడం ద్వారా జాతీయ స్థాయిలో ప్రతిపక్షాలను కలుపుకు వచ్చే ప్రయత్నం చేయాలని వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నట్లు చెబుతున్నారు.
సిఏఏకి వ్యతిరేకంగా త్వరలో ముఖ్యమంత్రుల సమావేశం ఏర్పాటు చేస్తున్నట్లు ఇప్పటికే ప్రకటించారు. ఎన్ పి ఆర్ అమలుకు తెలంగాణ ప్రభుత్వ యంత్రాంగం సన్నాహాలను పూర్తి చేసినా, అమలు చేయకుండా స్టే విధించారు. దేశ వ్యాప్తంగా నరేంద్ర మోదీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసనలు జరుగుతున్నా అందరిని ఒక వేదికపైకి తీసుకొచ్చి, ఉమ్మడిగా ఆందోళనలు జరపడం కోసం ఎవ్వరు చొరవ చూపలేక పోతున్నారు.
జాతీయ స్థాయిలో అందరికి ఆమోదయోగ్యమైన నాయకత్వం కనిపించడం లేదు. ఇప్పుడా లోటును పూర్తి చేయడం కోసం రాజ్యసభకు వెళ్లడమే మార్గమని భావిస్తున్నట్లు ఆ పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. కుమారుడు కేటీఆర్ కు ముఖ్యమంత్రి పదవి అప్పచెప్పి. తానింకా జాతీయ రాజకీయాలవైపు దృష్టి సారించడంకోసం నిర్ణయించుకున్నట్లు తెలుస్తున్నది.
గత లోక్ సభ ఎన్నికలలో నిజామాబాదు లో ఓటమి చెందినప్పటి నుండి రాజకీయాలకు దూరంగా ఉంటూ వస్తున్న కవితను రాజ్యసభకు పంపుతున్నట్లు కధనాలు వెలువడుతున్నా ఆమెను తాను ఖాళీచేసి గజ్వేల్ నుండి అసెంబ్లీకి పంపే అవకాశం కనిపిస్తున్నది.
గత లోక్ సభ ఎన్నికల సమయంలోనే పలు ప్రాంతీయ పార్టీలకు నిధులు సమకూర్చడం ద్వారా కేంద్రంలో హంగ్ పార్లమెంట్ ఏర్పడితే ఉప ప్రధానమంత్రి కావాలని పధకం వేయడం తెలిసిందే. అయితే నరేంద్ర మోదీ సొంతగా పూర్తి ఆధిక్యత సంపాదించుకోవడంతో ఆయన ఎత్తుగడలు ఫలించలేదు.
తొలి ఐదేళ్లు కేంద్రంలోని మోదీ ప్రభుత్వంతో సఖ్యతతో ఉంటూ, కీలకమైన అంశాలలో పార్లమెంట్ లో మద్దతు అందజేస్తూ వచ్చిన కేసీఆర్ ఈ మధ్య మాత్రం వ్యతిరేకంగా ఉండటం గమనార్హం. సిఏఏ బిల్లును పార్లమెంట్ లో వ్యతిరేకించడం తెలిసిందే.