
దేశంలోని అతిపెద్ద ఉద్యోగ కల్పనగా ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రచారం చేసుకొంటున్న గ్రామ కార్యదర్శుల వ్యవస్థ కీలకమైన కరోనా సంక్షోభం సమయంలో కుప్పకూలిందా అనే అనుమానాలు కలుగుతున్నాయి. లాక్ డౌన్ సమయంలో పేద ప్రజలకు రేషన్ ను వీరి ద్వారా ఇంటి వద్దకే పంపిస్తామని ముఖ్యమంత్రి ప్రకటించినా ఆచరణలో ప్రభుత్వం నవ్వులపాలవుతున్నది.
అధికారంలోకి రాగానే సుమారు 4 లక్షల మంది గ్రామ కార్యదర్శులను ముఖ్యమంత్రి నీయయించారు. కరోనాను కట్టడి చేయడంలో వీరంతా క్షేత్రస్థాయిలో సైనికుల వలె అందుబాటులో ఉంటారని ప్రకటించారు. ఇతర రాష్ట్రాలు సహితం ఈ వ్యవస్థను చూసి ముచ్చట పడుతున్నట్లు చెప్పుకున్నారు.
అయితే గత రెండు నెలలుగా విదేశాల నుండి వచ్చిన వారిని గుర్తించి, వారికి కరోనా పరీక్షలు జరిపించడంలో వీరే క్కడ ఆరోగ్య అధికారులకు తగు సహకారం అందిస్తున్న దాఖలాలు కనిపించడం లేదు. ఇటువంటి సంక్షోభ సమయంలో , ప్రభుత్వానికి మధ్య వారధిగా ఉండవలసిన వారి ఆచూకీ కనిపించడం లేదనే విమర్శలు చెలరేగుతున్నాయి. వారికి తగు శిక్షణ లేకపోవడమే అనుదుకు ప్రధాన కారణంగా భావిస్తున్నారు.
పైగా, వారి నియామకం జరిగిన తీరు సహితం లోపబోయిష్టంగా ఉండడం గమనార్హం. ఈ వ్యవస్థ ఏర్పాటుకు తగు రూపకల్పన చేసిన మాజీ ప్రధాన కార్యదర్శి అజయ్ కళ్లెంకు మినహా ప్రభుత్వంలో ఇతరులకు ఎవ్వరికీ తగు అవగాహన లేకపోవడంతో వారిని తగు రీతిలో ఉపయోగించుకోలేక పోతున్నట్లు తేటతెల్లం అవుతున్నది.
మరోవంక, నగదు పంపిణి, నిత్యావసర వస్తువుల పంపిణి వంటి పనులను వారు చేయకుండా స్థానిక వైసిపి కార్యకర్తలకు అప్పచెప్పడం, వారి స్థానిక సంస్థల ఎన్నికలలో పార్టీ ప్రచారానికి వెళ్లిన్నట్లుగా గుంపులుగా వెళ్లి హడావుడి చేయడంతో రాష్ట్ర ఎన్నికల సంఘం కన్నెర్ర చేయవలసి వచ్చింది.
వాస్తవానికి గ్రామా కార్యదర్శుల వ్యవస్థ ప్రభుత్వ సలహాదారుడు అజయ్ కళ్ళం ఆలోచనల నుండి వచ్చింది. ఆయన సలహాపై అధికారమలోకి రాగానే వారి నియామకం అయితే జగన్ చేశారు గాని, ఆ తర్వాత ఆ వ్యవస్థను సుస్థిరం చేయడం పట్ల ఎటువంటి శ్రద్ద చూపలేదు. కనీసం ఆ విషయం పట్టించుకోనని లేదు.
నాలుగు లక్షల మందిని నియమించడమే గొప్ప విజయంగా భావిస్తూ వచ్చారు. దానితో అసలు ఆలోచనకు, ఆచరణలో వారి పనితీరుకు సంబంధం లేకుండా పోతున్నది. పైగా, వారి గతంలో చంద్రబాబు నాయుడు హయాంలో టిడిపి కమిటీలుగా పనిచేసి నవ్వులపాలైన జన్మభూమి కమిటీలను దృష్టిలో ఉంచుకొంటూ రావడంతో వీరు కూడా అదే బాటలో నడుస్తూ వస్తున్నారు.
పార్టీ కార్యకర్తల వలే కాకుండా, ప్రభుత్వ ప్రతినిధుల వలే వ్యవహరిస్తే గాని గ్రామీణ వ్యవస్థలో మౌలిక మార్పులకు వీరు సారధులు కాలేరు. ఏపీని చూసి ఇటువంటి వ్యవస్థలను ఏర్పాటు చేసుకున్న కేరళ, ఒడిస్సా ప్రభుత్వాలు చాలా తక్కువ వ్యవధిలో అద్భుతంగా ఉపయోగించుకోవడాన్ని ఈ సందర్భంగా ఏపీ ప్రభుత్వం గమనించ వలసి ఉంది.