Homeగెస్ట్ కాలమ్క‘న్నీటి’ సంద్రాలు.. మన మహానగరాలు

క‘న్నీటి’ సంద్రాలు.. మన మహానగరాలు

Rain in hyderabad
హైదరాబాద్‌ అదో పెద్ద మహానగరం. ఎంతో అందమైన సిటీ. కానీ.. ఒక్క వాన పడితే కానీ తెలియదు దాని అందమంతా..! విడవని వానలు.. పొంగే నాలాలు. గంటల తరబడి ట్రాఫిక్‌ జామ్‌.. ఇళ్లకు చేరాలంటే గంటల టైమ్‌. ఏళ్ల తరబడి ఇదే సమస్య.. అయినా పాలకులు పట్టించుకోరు. అడుగు తీసి అడుగు వేస్తే ఎక్కడ ఏ మ్యాన్హోల్ ఓపెన్ ఉందో తెలియని పరిస్థితి.

వర్షమొస్తే నీళ్లే వస్తాయి..
‘వర్షమొస్తే నీళ్లు రాకుంటే మంటొస్తదా?.. చిన్న వర్షానికి ప్రపంచం అంతా బద్ధలైనట్లు కొన్ని టీవీ చానల్స్ ప్రచారం చేస్తున్నాయి. హైదరాబాద్లో రోడ్ల మీద నీళ్లున్నట్లు ఎక్కడైనా చూపిస్తరా? వర్షం కురిసిన రోజు రాత్రి  అంతా అతలాకుతలమైనట్లు చూపిస్తున్నారు. లాక్ డౌన్  టైమ్ లో సిటీలో రోడ్లను అభివృద్ధి చేశాం. 70 ఏండ్లలో ఇంత అభివృద్ధి ఎక్కడా జరగలేదు. రోడ్లు, డ్రైనేజీల అభివృద్ధి అంతా మా ప్రభుత్వం హయాంలోనే జరిగింది.
………ఇవి స్వయానా మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ మాట్లాడిన మాటలు.

అయ్యా మంత్రి గారూ.. మహానగరంలో అంత బాగున్నప్పుడు నిన్నటి రోజున ఓ చిన్నారి నాలాలో పడి ఎందుకు చనిపోయినట్లు..? రోడ్లు అంతా బాగానే ఉంటే… గంటల తరబడి ట్రాఫిక్‌ ఎందుకు నిలిచినట్లు..? ఇవీ ప్రజల నుంచి వస్తున్న ప్రశ్నలు.. వీటికీ సమాధానం చెప్పండి మరి.

* ‘నాలా’ ఎవరూ చనిపోకూడదు..
అది హైదరాబాద్‌లోని నేరేడ్‌మెట్‌ పరిధిలోని సంతోషిమా నగర్‌‌. స్ట్రీట్‌ నంబర్‌‌ 2లో ఉంటున్న కపూరియా అభిజిత్‌, సుకన్య దంపతులు ఓ ప్రైవేటు కంపెనీలో పనిచేస్తున్నారు. గురువారం వారిద్దరూ డ్యూటీకి వెళ్లగా.. ఒక్కగానొక్క కూతురు సుమేధ (11) నానమ్మతో కలిసి ఇంట్లో ఉంది. సాయంత్రం నానమ్మకు మ్యాగీ చెయ్యమని చెప్పి సైకిల్‌‌‌‌ పై సుమేధ బయటకు వెళ్లింది. కాసేపు ఫ్రెండ్స్ తో ఆడుకొని.. సాయంత్రం 6.20 గంటలకు ఇంటికి బయలుదేరింది. అదే టైంలో భారీ వర్షం మొదలైంది. డ్యూటీ నుంచి ఇంటికి వచ్చిన తల్లి సుకన్యకు కూతురు కనిపించకపోయే సరికి చుట్టుపక్కల వెతికింది. అప్పటికే వరద నీరు మోకాలు లోతులో ప్రవహిస్తోంది. కాలనీలోని సీసీ ఫుటేజ్ను పరిశీలించగా.. దీన్‌‌‌‌దయాల్‌ ‌‌‌నగర్‌ ‌‌‌‌‌‌‌ మీదుగా తన ఇంటికి సుమేధ సైకిల్ పై వస్తున్నట్టు కనిపించింది. ఆ వర్షంలోనే ఆ ప్రాంతమంతా వెతికినా పాప ఆచూకీ దొరకలేదు. పాప తండ్రి అభిజిత్‌‌‌‌ నేరేడ్‌‌‌‌మెట్‌‌‌‌ పోలీసులకు ఫిర్యాదు చేయగా.. స్థానికులతో కలిసి గురువారం రాత్రి పోలీసులు సెర్చ్‌‌‌‌ చేశారు. కానీ.. పాప ఆచూకీ దొరకలేదు. శుక్రవారం తెల్లవారు జామున జీహెచ్‌ఎంసీ డిజాస్టర్‌‌ మేనేజ్‌మెంట్‌ టీమ్‌ రంగంలోకి దిగి గాలింపు చర్యలు చేపట్టింది. ఇళ్ల మధ్య ఉన్న నాలాకు సమీపంలో సుమేధ సైకిల్‌ను గుర్తించారు. వరద ప్రవాహానికి అందులో పడి కొట్టుకుపోయి ఉండొచ్చని.. రెండు కిలోమీటర్ల దూరంలో ఉన్న బండ చెరువులో గాలించారు. అక్కడ మధ్యాహ్నం టైంలో సుమేధ డెడ్‌ బాడీ దొరికింది. చనిపోయిన ఆ పాప ఆత్మలా అధికారులను ఇలా కోరుతోంది. ‘అంకుల్‌ మనది మహానగరం అని గొప్పలు చెబుతుంటారు.కానీ.. ఇలాంటి నాలాలా ఓపెన్‌ అయి సిటీ మొత్తం ఎన్నో ఉన్నాయి. ఎక్కడా వాటిని పట్టించుకోవడం లేదు. ‘నాలా’గా మరెవ్వరూ వాటిలో పడి చనిపోకుండా చూడండి. వాటిని క్లోజ్‌ చేయించండి’ అంటూ వేడుకుంటోంది.

హైదరాబాద్‌ మహానగరం తర్వాత అంతటి పేరొందిన చారిత్రక నగరం వరంగల్. ఇక్కడా ఇదే పరిస్థితి. గొప్పకు పెద్ద సిటీ అయినా.. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు ఏ స్థాయిలో మునిగిందో అందరం చూశాం.వరద నీరు, బురద నీరు కలగలిసి రోడ్లపై పొంగిపొర్లాయి. చిన్న చిన్న బస్తీలు మొదలు.. పెద్ద పెద్ద కాలనీల దాకా నీట మునిగాయి. చిన్నపాటి వాన పడినా స్లమ్ ఏరియాల్లోని జనం బిక్కుబిక్కుమంటూ గడపాల్సి వస్తోంది. బుధ, గురువారాల్లో కురిసిన వర్షానికి హైదరాబాద్లో చాలా కాలనీలు జలమయమయ్యాయి. ఇండ్లలోకి నీళ్లు చేరి జనం అవస్థలు పడ్డారు. వరద నీటికి బైక్లు, కార్లు కొట్టుకుపోయాయి. గత నెలలో కురిసిన వర్షానికి వరంగల్ సిటీలో ఎక్కడ చూసినా వరద పొంగింది. సుమారు వంద కాలనీలు నీట మునిగాయి.

హైదరాబాద్‌‌ను విశ్వనగరంగా తీర్చి దిద్దుతామని ఎన్నికల టైంలో టీఆర్ఎస్ చెప్పింది. చుక్క నీరు కూడా రోడ్ల మీద నిల్వ లేకుండా చేస్తామంది. రోడ్లను అద్దంలా చేస్తామంది. అద్భుతమైన రోడ్లు, మంచి డ్రైనేజీ వ్యవస్థను రూపొందిస్తామని చెప్పింది. ఎక్స్‌‌పర్ట్‌‌ కమిటీలు వేసి సమస్యకు పరిష్కారం చూపిస్తామంది. కానీ హైదరాబాద్ సిటీ నీట మునిగేందుకు కారణమైన సమస్యలు ఎక్కడివక్కడ ఎప్పటిలాగే పడి ఉన్నాయి.

ఎక్కడ చూసినా నాలాల కబ్జాలు, చెరువుల ఆక్రమణలు, అస్తవ్యస్తమైన డ్రైనేజీ సిస్టమ్‌‌‌‌‌‌‌‌, వరద నీటి కాల్వల నిర్వహణ లోపం, ఇరుకైన రోడ్లు.. ఇలా ఎన్నో  సమస్యలు ఈ రెండు నగరాలను వెంటాడుతూనే ఉన్నాయి. హైదరాబాద్‌‌‌‌‌‌‌‌లో వరద ముంపును అరికట్టేందుకు జేఎన్టీయూ ఎక్స్పర్ట్స్ ‘అర్బన్ ఫ్లడ్స్ -ఇంటిగ్రేటెడ్ స్టోర్మ్ వాటర్ నెట్‌‌‌‌‌‌‌‌వర్క్ (అర్బన్ బైపాస్)’ పేరుతో 2018లో రిపోర్టును ప్రభుత్వానికి అందజేసింది. అప్పట్లో గ్రేటర్‌‌‌‌‌‌‌‌ కమిషనర్‌‌‌‌‌‌‌‌గా ఉన్న దానకిశోర్‌‌‌‌‌‌‌‌ సూచన మేరకు జేఎన్టీయూ ప్రొఫెసర్లు డాక్టర్‌‌‌‌‌‌‌‌ గిరిధర్, లక్ష్మణరావు, జీహెచ్‌‌‌‌‌‌‌‌ఎంసీ ఎస్‌‌‌‌‌‌‌‌ఈలు, ఈఈలు, ఏఈఈలతో కలిసి గ్రౌండ్ లెవల్లో పరిశీలన జరిపారు. వర్షపు నీరు నిలిచిపోతున్న ప్రాంతాలను గుర్తించిన జేఎన్టీయూ ప్రొఫెసర్లు అన్ని ఏరియాల్లో  ఇంకుడు గుంతలు (హార్వెస్టింగ్ పిట్స్) నిర్మించాలని, ఇంజెక్షన్‌‌‌‌‌‌‌‌ వెల్స్‌‌‌‌‌‌‌‌ ఏర్పాటు చేయాలని సూచించారు. వరద, నీటి ముంపు సమస్యల శాశ్వత పరిష్కారానికి 5 వేల కోట్ల రూపాయలు ఖర్చయ్యే ప్రణాళికను జేఎన్‌‌‌‌‌‌‌‌టీయూ ఎక్స్పర్ట్స్ జీహెచ్ఎంసీకి అందజేయగా స్టాండింగ్‌‌‌‌‌‌‌‌ కమిటీ ఆ రిపోర్ట్ను ఆమోదించి రాష్ట్ర ప్రభుత్వ గ్రీన్‌‌‌‌‌‌‌‌ సిగ్నల్‌‌‌‌‌‌‌‌ కోసం పంపింది. కానీ ఆ ప్రతిపాదనలకు ఆమోదముద్ర పడలేదు.

గ్రేటర్‌‌‌‌‌‌‌‌ హైదరాబాద్‌‌‌‌‌‌‌‌ 650 కిలోమీటర్ల పరిధిలో విస్తరించింది. వెయ్యి కిలోమీటర్ల మేర డ్రైనేజీ, వరద నీటి కాల్వలున్నాయి. 216  మేజ‌‌‌‌‌‌‌‌ర్ నాలాలు, 735 కిలోమీట‌‌‌‌‌‌‌‌ర్ల విస్తీర్ణంలో పైప్‌‌‌‌‌‌‌‌లైన్ డ్రెయిన్‌‌‌‌‌‌‌‌లున్నాయి. 9 వేల కిలోమీటర్ల రోడ్లు ఉన్నాయి. వర్షం పడితే హైదరాబాద్ జలమయం కావడానికి వీటి నిర్వహణ సరిగ్గా లేకపోవడమేనని జేఎన్‌‌‌‌‌‌‌‌టీయూ ఎక్స్పర్ట్స్ తేల్చారు. ఓ ఎన్జీవో స్టడీ ప్రకారం గ్రేటర్‌లో నాలాలపై 28 వేల ఆక్రమణలు ఉన్నట్లు తేలింది.

హైదరాబాద్లో వర్షపు నీళ్లు వెళ్లేలా ట్రంక్‌‌‌‌‌‌‌‌ లైన్లు ఏర్పాటు చేయాలని మరికొందరు ఎక్స్పర్ట్స్ సూచించారు. నాలాల్లో పూడిక తీత పనులు చేపట్టాలని చెప్పారు. 2007లో జీహెచ్‌‌‌‌‌‌‌‌ఎంసీ ఏర్పడ్డ తర్వాత ఓయెంట్స్‌‌‌‌‌‌‌‌ కన్సల్టెంట్‌‌‌‌‌‌‌‌ గ్రేటర్ సమస్యలను స్టడీ చేసింది. సిటీలో గంటకు 2 సెం.మీ. వర్షం పడితే చాలా ప్రాంతాలు నీట మునుగుతాయంది. బుధవారం సాయంత్రం హైదరాబాద్‌లో 7.5 నుంచి 10.9 సెంటీమీటర్ల దాకా వాన పడింది. మరో సర్వేలో నాలాలను డెవలప్ చేయాలంటే  12 వేల నిర్మాణాలను తొలగించాల్సి ఉందని తెలిసింది.

ఇక వరంగల్‌ నగరం చుట్టు పక్కలా హన్మకొండ నయీంనగర్ నాలా మొదలు భద్రకాళి నాలా వరకు ఆక్రమణకు గురయ్యాయి. పెద్దపెద్ద లీడర్లు నాలాలపైనే కట్టిన బిల్డింగులు, ఇతర కట్టడాలు అన్నీ కలిసి 415 వరకు కబ్జాలు ఉన్నట్లు ఆఫీసర్లు గుర్తించారు. సిటీకి చుట్టుపక్కల కాకతీయులు నిర్మించిన దాదాపు 52  గొలుసుకట్టు చెరువులు ఆక్రమణకు గురయ్యాయి. దీంతో ఒకదాని నుంచి ఒకదాంట్లోకి నీళ్లు వెళ్లే లింక్లు తెగిపోయి వరద కాలనీల్లోకి ప్రవహిస్తోంది. అందుకే కొద్దిపాటి వాన పడ్డా వరంగల్సిటీ వణికిపోతోంది. వరద, మురుగు నీరు ప్రవహించే నాలాలు కబ్జాలకు గురికావడం.. డ్రైనేజీ వ్యవస్థ సరిగాలేకపోవడంతో రోడ్లన్నీ కెనాళ్లను తలపిస్తున్నాయి. జీడబ్ల్యూఎంసీ గానీ, కుడా గానీ కాల్వల విస్తరణ, పొడిగింపుపై దృష్టి పెట్టకపోవడంతో జనం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

ట్రై సిటీస్ గా పేరున్న వరంగల్, హన్మకొండ, కాజీపేటలో వరద, మురుగునీరు ప్రవాహానికి ప్రధానమైన హన్మకొండ నయీంనగర్ నాలా, హంటర్ రోడ్డు బొందివాగు, కరీమాబాద్ శాకరాసికుంట, వరంగల్ భద్రకాళి నాలాలు ఆక్రమణకు గురయ్యాయి. పెద్దపెద్ద లీడర్లు నాలాలపైనే కట్టిన బిల్డింగులు, ఇతర కట్టడాలు అన్నీ కలిసి 415 వరకు కబ్జాలు ఉన్నట్లు ఆఫీసర్లు గుర్తించారు.

మరి.. ఈ రెండు నగరాలకు మేజర్‌‌ సమస్య అయిన నాలాలకు సంబంధించి ఏదైనా పరిష్కారం చూడాల్సిన బాధ్యత కూడా ప్రభుత్వంపై ఉంది. లేదంటే భవిష్యత్తులో మరిన్ని ఇబ్బందులు పడకతప్పదేమో. దీనికితోడు ఇప్పుడు గ్రేటర్‌‌ హైదరాబాద్‌, గ్రేటర్‌‌ వరంగల్‌లోనూ ఎన్నికలు ఉన్నాయి. మరి ఈ నేపథ్యంలో టీఆర్‌‌ఎస్‌ ప్రభుత్వం పెద్దలు ఎలాగూ మరోసారి ప్రచారాలకు వచ్చే అవకాశం ఉంది. ప్రజలు ఈ సమస్యను తెరపైకి తెచ్చే అవకాశాలూ లేకపోలేదు. ఇక ప్రజల ప్రశ్నలకు పాలకులు ఎలాంటి సమాధానాలు ఇస్తారో చూడాలి మరి.

– వాసు  

Velishala Suresh
Velishala Sureshhttps://oktelugu.com/
Velishala Suresh is Journlist and a Web Admin and is working with our organisation from last 4 years and he has good knowledge on Content uploads and Content Management in website.
RELATED ARTICLES

Most Popular