Cruel Doctor: క్రూర వైద్యుడు: వీధి కుక్కను కారుకు కట్టేసి లాక్కెళ్లాడు

Cruel Doctor: శునకం అంటే విశ్వాసానికి మారుపేరు. ఇంత మద్ద పెడితే తోక ఆడిస్తూ ఇంటికి కాపలా ఉంటుంది. అలాంటి ఓ వీధి శునకం మీద ప్రాణాలు కాపాడాల్సిన ఓ వైద్యుడు తన క్రూరత్వాన్ని చూపాడు. ఏకంగా తన కారుకు కట్టేసి కిలోమీటర్ల కొద్దీ లాక్కెళ్లాడు. ఆ కారు వేగంతో సమానంగా పరిగెత్త లేక ఆ శునకం తల్లడిల్లిపోయింది. తీవ్రంగా గాయపడింది. ఆదివారం రాజస్థాన్ రాష్ట్రంలోని జోధ్ పూర్ లో ఈ ఘటన జరిగింది. ఓ శునకాన్ని […]

Written By: Rocky, Updated On : September 19, 2022 2:07 pm
Follow us on

Cruel Doctor: శునకం అంటే విశ్వాసానికి మారుపేరు. ఇంత మద్ద పెడితే తోక ఆడిస్తూ ఇంటికి కాపలా ఉంటుంది. అలాంటి ఓ వీధి శునకం మీద ప్రాణాలు కాపాడాల్సిన ఓ వైద్యుడు తన క్రూరత్వాన్ని చూపాడు. ఏకంగా తన కారుకు కట్టేసి కిలోమీటర్ల కొద్దీ లాక్కెళ్లాడు. ఆ కారు వేగంతో సమానంగా పరిగెత్త లేక ఆ శునకం తల్లడిల్లిపోయింది. తీవ్రంగా గాయపడింది. ఆదివారం రాజస్థాన్ రాష్ట్రంలోని జోధ్ పూర్ లో ఈ ఘటన జరిగింది. ఓ శునకాన్ని కారుకు కట్టేసి లాక్కెల్లిన ఘటన తాలూకుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. రాజస్థాన్ లోని జోద్ పూర్ ప్రాంతంలో రద్దీగా ఉన్న రోడ్డులో ఒక కారు కు పొడవైన తాడు కట్టి కుక్కను లాక్కెళ్తుండగా స్థానికులు చూశారు. కొందరు ధైర్యం చేసి ఆపేందుకు యత్నించగా డ్రైవర్ స్పీడ్ గా పోనిచ్చాడు. దీంతో కొంతమంది ద్విచక్ర వాహనాల సహాయంతో కారును వెంబడించి ఎట్టకేలకు ఆపగలిగారు. కానీ అప్పటికే ఆ కుక్క దీనస్థితిలో ఉంది. కాలు విరిగింది. మెడ చుట్టూ గాయాలయ్యాయి. చలించిపోయిన స్థానికులు ఆ కుక్కను విడిపించి హుటాహుటిన పశువుల ఆసుపత్రికి తరలించారు. కుక్కను అలా ఎందుకు లాక్కెళుతున్నావని స్థానికులు నిలదీయగా.. ఆ కారులో ఉన్న వ్యక్తి చెప్పిన సమాధానం విస్తు గొలిపింది.

Cruel Doctor

..
శునకం ఇంటిముందు ఉండటాన్ని జీర్ణించుకోలేక
..
రాజస్థాన్లోని జోద్ పూర్ ప్రాంతానికి చెందిన రజనీష్ గ్వాలా అనే వ్యక్తి స్థానిక ప్రభుత్వ ఆసుపత్రిలో ప్లాస్టిక్ సర్జన్ గా పనిచేస్తూ ఉంటాడు. ఈ ప్రాంతంలో ఆయనకు ఒక ఇల్లు ఉంది. ఆ ఇంటి ఎదుట ఎప్పుడు చూసినా ఓ వీధి శనకం ఉంటున్నది. దానిని ఎప్పుడు తరిమేసినా మళ్లీ ప్రత్యక్షమవుతోంది. దీంతో ఆ డాక్టర్ ఆ వీధి శనకాన్ని పట్టుకొని పొడవైన తాడుతో కట్టేసి.. ఆ తాడును కారుకు బిగించి ఊరి చివరన వదిలిపెట్టేందుకు లాక్కెళ్లాడు. కారుతో సమానంగా పరిగెత్త లేక ఆ శునకం తీవ్రంగా గాయపడింది. ఈ దృశ్యాన్ని ఓ వ్యక్తి తన ఫోన్ లో వీడియో తీసి జంతువుల సంరక్షణ కోసం పాటుపడుతున్న ఓ ఎన్జీవో కు సెండ్ చేశాడు. దీంతో రంగంలోకి దిగిన ఆ సంస్థ సభ్యులు స్థానికుల సహాయంతో ఆ డాక్టర్ ను, కారును పట్టుకున్నారు. శునకాన్ని విడిపించి హుటాహుటిన పశు వైద్యశాలకు తరలించారు. అనంతరం వైద్యుడు తీరు పట్ల స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇంటి ఎదుట కుక్క ఉన్నంత మాత్రాన నీకు వచ్చిన నష్టం ఏమిటని నిలదీశారు. శునకం దయనీయస్థితిని చూసిన కొంత మంది డాక్టర్ పై దాడి చేసేందుకు ప్రయత్నించారు. ఈ విషయాన్ని కొంతమంది పోలీసులకు తెలపడంతో.. వారు సంఘటన స్థలానికి వచ్చి డాక్టర్ను అదుపులోకి తీసుకున్నారు. అతనిపై జంతువులను హింసించినందుకు గానూ కేసు నమోదు చేశారు. ప్రస్తుతం అతడు పోలీస్ స్టేషన్ లో ఉన్నాడు. కాగా సోషల్ మీడియాలో ఈ వీడియో వైరల్ గా మారడంతో నెటిజన్లు వైద్యుడి తీరుపై మండిపడుతున్నారు. అతడి లైసెన్స్ రద్దు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. కొంతమంది ఈ వీడియోని కేంద్ర అటవీ, జంతు శాఖ మంత్రిత్వ శాఖకు ట్యాగ్ చేశారు. సదరు వైద్యాధికారిపై చర్యలు తీసుకోవాలని జోద్ పూర్ ప్రాంతంలో జంతు సంరక్షణ ఎన్జీవోలు ఆందోళనలు, ప్రదర్శనలు జరుపుతున్నాయి. ముందస్తు జాగ్రత్తగా పోలీస్ స్టేషన్ పరిసర ప్రాంతాల్లో పోలీసులు 144 సెక్షన్ విధించారు.

Tags