Dhantrayodashi 2023: హిందూ సాంప్రదాయం ప్రకారం ప్రతి పండుగకు ఓ విశిష్టత ఉంటుంది. దసరా నవరాత్రి ఉత్సవాలు పూర్తయిన తరువాత దీపావళి వేడకలకు సిద్ధమవుతారు. ఈ మధ్యలో ధన్ త్రయోదశి ప్రత్యేకంగా నిలుస్తుంది. ఆశ్వయుజ మాసంలోని కృష్ణ పక్షంలో బహుళ త్రయోదశినాడు ధన్ త్రయోదశిని జరుపుకుంటారు. ధన్వంతరి జయంతిగా భావించే ఈరోజున బంగారం, వెండి, ఇత్తడి, రాగి వంటి వస్తువులను కొనుగోలు చేస్తారు. ఇలా ఏదో ఒక వస్తువు కొనడం వల్ల ఇంట్లో సంతోష వాతావరణం ఉంటుందని భావిస్తారు. కొందరు పండితులు చెబుతున్న ప్రకారం ధన్ త్రయోదశి 2023 సంవత్సరంలో ఎప్పుడు వస్తుంది? ఆరోజున ఎలాంటి పూజలు నిర్వహిస్తారు? అనే విషయాలు తెలుసుకుందాం…
కొన్ని పురాణాల ప్రకారం.. హిమ అనే రాజుకు ఓ కుమారుడు ఉండేవారు. వీరిది క్షత్రియ వంశం కనుక విలు విద్యలన్నీ అతనికి నేర్పిస్తాడు. అయితే రాకుమారుడికి పెళ్లయిన నాలుగో రోజే మరణిస్తాడని కొందరు చెబుతారు. అయినా ఓ రాజవంశానికి చెందిన యువతి రాకుమారుడిని పెళ్లి చేసుకోవడానికి ముందుకు వస్తుంది. అయితే తన భర్తను కాపాడుకోవడానికి తన వద్ద ఉన్న ఆభరణాలన్నీ రాశులుగా పోసి వాటికి దీపాలను వెలిగించి తన ఆరాధ్య దేవత లక్ష్మీని పూజిస్తుంది.
ఇంతలో రాకుమారుడి ప్రాణాలను తీసుకోవడానికి యమధర్మరాజు పాము రూపంలో వస్తాడు. కానీ అక్కడున్న దీప కాంతులకు పాము చూపు మందగిస్తుంది.ఇదే సమయంలో రాకుమారి లక్ష్మీదేవిని కొలుస్తూ పాటలు పాడుతుంది. ఆ పాటలకు మైమరిచిపోయిన యమధర్మరాలజు రాకుమారుడి ప్రాణాలను తీసుకోవాలనే విషయం మరిచిపోతాడు. దీంతో యమగడియాలు దాటిపోయి తెల్లారుతుంది. ఆ తరువాత ఖాళీ చేతులతో ఇంటికి వెళ్తాడు. అప్పటి నుంచి యముడికి ఈరోజున దీపం వెలిగిస్తారు.
అలాగే ధన త్రయోదశి రోజు ధన్వంతరిని పూజిస్తారు. ధనత్రయోదశి నాడు లక్ష్మీ అమ్మవారిని ప్రతిష్టించి ప్రత్యేకంగా పూజలు చేయడం ద్వారా అనుగ్రహం పొందుతారని కొందరు పండితులు చెబుతున్నారు. ఈరోజు కొంచెమైనా బంగారం కొనుగోలు చేయాలని అనుకుంటారు. బంగారం కొనుగోలు చేయడం ద్వారా లక్ష్మీదేవిని ఇంటికి తెచ్చుకున్నవారవుతారని అంటున్నారు. దీంతో బంగారం షాపులకు ఈరోజు డిమాండ్ ఉంటుంది.
2023 ఏడాదిలో నవంబర్ 10న ధన త్రయోదశిని నిర్వహించుకునేందుకు ఏర్పాట్లు సాగుతున్నాయి. ఈరోజు మధ్యాహ్నం 12.35 గంటలకు ప్రారంభమై నవంబర్ 11 మధ్యాహ్నం 1.57 వరకు ఉంటుంది. ఈసారి లక్ష్మీ దేవికి ఇష్టమైన శుక్రవారం రోజునే ధన త్రయోదశి వస్తుంది. దీంతో ఆరోజున లక్ష్మీ దేవికి ప్రత్యేకంగా పూజలు చేసేందుకు భక్తలు సిద్ధమవుతున్నారు. అటు బంగారం దుకాణాలు సైతం తమ విక్రయాలు పెంచుకునేందుకు ప్రత్యేక ఆఫర్లు ప్రకటిస్తున్నాయి.