Shivaratri 2022: ప్రతి సంవత్సరం దేశంలోని హిందువులు ఘనంగా జరుపుకునే పండుగలలో శివరాత్రి పండుగ ఒకటనే సంగతి తెలిసిందే. శివరాత్రి పండుగ రోజున ప్రజలు శివుడిని స్మరించడంతో పాటు ఉపవాసం, జాగరణ చేస్తారు. ఈరోజు శివుడికి ఎంతో ఇష్టమైన రోజు అనే సంగతి తెలిసిందే. హిందువులు భక్తిశ్రద్దలతో శివరాత్రి పండుగను జరుపుకుంటారు. ఈరోజు లింగోద్భవం జరిగిన రోజు కాబట్టి శివరాత్రి పండుగను జరుపుకుంటామని కొందరు భావిస్తే మరి కొందరు మాత్రం శివపార్వతుల కళ్యాణం జరిగిన రోజు శివరాత్రి అని భావిస్తారు.
ఈరోజు బిల్వ పత్రాలతో, నీళ్లతో శివుడిని పూజించడం వల్ల అనుకూల ఫలితాలు కలిగే అవకాశం అయితే ఉంటుందని చెప్పవచ్చు. ఈరోజు కొంతమంది పండ్లను మాత్రమే ఆహారంగా తీసుకుని ఉపవాసం చేస్తే మరి కొందరు ద్రవ పదార్థాలను మాత్రమే ఆహారంగా తీసుకుని ఉపవాసం చేస్తారు. రాత్రి సమయంలో జాగరణ చేస్తే శివనామస్మరణతో శివుడిని భక్తులు పూజిస్తారు. శివరాత్రి పండుగ రోజున శివుడిని పూజిస్తూ ఉపవాసం, జాగరణ చేస్తే పాపాలు తొలగిపోతాయి.
బ్రహ్మ, విష్ణు, శివుడులలో ఎవరు గొప్ప అనే చర్చ జరిగిన సమయంలో శివుడు లింగ రూపాన్ని ధరించి ఆ లింగానికి ఆది అంతం కనుక్కోవాలని సూచించాడు. బ్రహ్మ, విష్ణు లింగం ఆది, అంతాలను ఎంత ప్రయత్నించినా కనుక్కోవడంలో విఫలమవుతారు. ఆ సమయంలో వాళ్లకు మొగలిపువ్వు, గోవు దర్శనమివ్వగా బ్రహ్మ లింగానికి ఆదిని చూశానని చెప్పమని మొగలిపువ్వు, గోవుకు చెబుతాడు. గోవు, మొగలిపువ్వు అబద్ధం చెప్పడంతో మొగలిపువ్వు పూజకు పనికిరాదని శివుడు శపిస్తాడు.
గోమాత ముఖంతో అబద్ధం చెప్పి తోకతో నిజం చెప్పగా ఆవు ముఖం చూస్తే పాపమని, తోక చూస్తే పాప పరిహారమని శివుడు శపిస్తాడు. విష్ణువు మాత్రం తాను లింగానికి అంతం కనుక్కోలేకపోయానని నిజం చెప్పడంతో శివుడు ఆయనకు విశ్వ వ్యాపకత్వాన్ని అనుగ్రహించారు. పురాణాల ప్రకారం ఈరోజు శివుడికి జలాభిషేకం చేయడం వల్ల శుభ ఫలితాలు కలిగే అవకాశాలు అయితే ఉంటాయి.