Maha Shivaratri 2022: హిందువులు జరుపుకునే పండుగలలో శివరాత్రి పండుగ ఒకటనే సంగతి తెలిసిందే. శివరాత్రి పండుగ రోజున శివుడికి పూజలు చేయడంతో పాటు ఉపవాసం, జాగరణ చేస్తాం. ఈ ప్రపంచమంతా ప్రకృతి ఏర్పరచిన న్యాయసూత్రాల ప్రకారం నడుస్తుంది. సృష్టి స్థితులను నడిపించే లయకారుడు శివుడు అనే సంగతి తెలిసిందే. పురాణాల ప్రకారం మనుషులు జన్మజన్మకు కొంత జ్ఞానం పొందుతూ చివరి జన్మలో సంపూర్ణ జ్ఞానం పొందుతారు.
అది పొందే కాలం లింగోద్భవ కాలం కాబట్టి శివరాత్రి పండుగను రాత్రివేళలో మాత్రమే జరుపుకుంటాం. శివుడిని భక్తులు దిగంబరుడని పిలుస్తారు. దిక్కులే వస్త్రాలుగా కలిగిన వ్యక్తి కాబట్టి శివుడిని ఆ విధంగా పిలుస్తారు. శివుడు భాగ్యవంతుడు కాకపోయినా భక్తులు కోరిన కోరికలను కచ్చితంగా నెరవేరుస్తాడు. శ్మశానంలో సంచరించే శివుడు లోకాలను శాసించగలడు. అయితే శివుడి భార్య పార్వతి మాత్రం ఆయనకు పూర్తి విరుద్ధంగా ఉంటుంది.
శివుడు తనకు లేవు కదా అని పార్వతికి ఆభరణాలు, అలంకారాల విషయంలో ఆంక్షలు విధించలేదు. సౌందర్యానికి అధిపతి శివుడు కాగా అఘోర రూపం కూడా శివుడిదే కావడం గమనార్హం. శివునికి మారేడు దళాలు అంటే ఎంతో ఇష్టం. బిల్వ పత్రాలతో శివుడిని పూజించడం వల్ల మంచి జరుగుతుందని చెప్పవచ్చు. మారేడు చెట్టు గాలి శరీరానికి సోకినా, మారేడు ఆకుల గాలి పీల్చినా ఎలాంటి జబ్బులు వచ్చే అవకాశాలు ఉండవు.
సూర్యుడిలో ఉండే తేజస్సు మారేడులో ఉండటంతో పాటు చెడు ప్రభావాన్ని మారేడు హరిస్తుంది. సింధు నాగరికత కాలం నుంచే శివుడు లింగరూపంలో, పశుపతిగా పూజలు అందుకుంటున్నాడు. శివుడు ఎంచుకున్న ఆయుధం త్రిశూలం కాగా త్రిశూలంలో ఉండే మూడు వాడియైన మొనలు చర్య, కోరిక, జ్ఞానంలను సూచిస్తాయి.