Homeపండుగ వైభవంFestivels: మన పండుగల వైభవాలు ఏమయ్యాయి?

Festivels: మన పండుగల వైభవాలు ఏమయ్యాయి?

Indian festivalsFestivels: మనది ఆర్య సంస్కృతి. వేద సంస్కృతి. పండుగలకు (Festivels) ఉన్న ప్రాధాన్యత ఎంతటి గొప్పదో తెలుసు. పాశ్చాత్య దేశాలు సైతం మన సంస్కృతి, సంప్రదాయాలకు ఎంత విలువ ఇస్తారో తెలుసు కదా. కానీ మనమే మన సంప్రదాయాలకు స్వస్తి చెబుతున్నాం. రానురాను రాజుగారి గుర్రం గాడిదయిందన్నట్లుగా రోజురోజుకు వచ్చే మార్పులతో మన సంప్రదాయాలు కనుమరుగైపోతున్నాయి. భావి తరాలకు భవిష్యత్ కానుకగా ఇవ్వాల్సిన మన సంస్కృతి నేడు మరుగునపడుతోంది. ఈ నేపథ్యంలో పండుగలకు మన పూర్వీకులు ఇచ్చిన ప్రాధాన్యత మనం ఇస్తలేమని తెలుస్తోంది. సంప్రదాయబద్దంగా అప్పుడు పండుగల్లో కొత్త బట్టలు ధరించి వేడుకలు ఘనంగా నిర్వహించేవారు. ఆడంబరంగా, అట్టహాసంగా, ఆనందంగా జరుపుకునేవారు. మూకుమ్మడిగా ప్రజలందరు కలిసి పండుగలు జరుపుకోవడం ఆనవాయితీగా ఉండేది. ప్రస్తుత కాలంలో పండుగల ప్రాధాన్యత క్రమంగా తగ్గుతోంది.

వినాయక చవితి: భాద్రపద మాసంలో వచ్చే వినాయక చవితి గురించి కూడా పట్టించుకోవాలి. భారతీయుల్లో జాతీయ భావం పెంపొందించాలనే ఉద్దేశంతో స్వాతంత్ర్య సంగ్రామంలో ప్రారంభించిన వినాయక చవితి ఉత్సవాలు నేడు పెడధోరణిలో వెళుతున్నాయి. ఐక్యత కోసం తెచ్చిన పండుగ నేడు పక్కదారి పడుతోంది. కేవలం తాగుడు, ఊగుడుకే ప్రాధాన్యం ఇస్తోంది. డబ్బులన్ని వృథాగా చేసి జల్సాలకు అలవాటు పడుతున్నారు. ఈ సంస్కృతికి చరమగీతం పాడాలని సూచిస్తున్నారు. భక్తుల్లో మార్పు రావాలని కోరుతున్నారు.

దసరా: మన తెలంగాణలో అత్యంత ప్రజాదరణ పొందిన పండుగ దసరా. దీని కోసం నెల రోజులు ఎదురుచూస్తారు. పండుగ పది రోజులు ఆనందంగా జరుపుకుంటారు. బొడ్డెమ్మ నుంచి ఎంగిలిపూల వరకు తరువాత దసరా జరుపుకోవడంలో ఆనందం వెల్లివిరుస్తుంది. ప్రపంచంలో ప్రకృతిలో దొరికే పూలనే పూజించే ఏకైక పండుగ దసరా. దీనికి పూర్వం రోజుల్లో ఆడవారి పాటలతో సందడి నెలకొనేది. కానీ ప్రస్తుతం ఆ పాటలకు బదులు డీజేలు పెట్టుకుని చిందులేస్తున్నారు. మన సంస్కృతిని కాలరాస్తున్నారు. దీనిపై రాబోయే రోజుల్లో ఇంకా ఏం మార్పులు చోటుచేసుకుంటాయోనని అయోమయం ఏర్పడింది.

దీపావళి: మనం జరుపుకునే పండుగల్లో దీపావళి కూడా ప్రధానమైనదే. దీన్ని దేశవ్యాప్తంగా జరుపుకుంటాం. రసాయనాలతో కూడిన మందులతో పర్యావరణానికి హాని కలుగుతుందని తెలిసినా విచ్చలవిడిగా బాంబుల వినియోగించి వాతావరణాన్ని కలుషితం చేస్తున్నాం. ఎవరు పట్టించుకోకపోవడంతో పండుగ ప్రాధాన్యతను మరిచి కేవలం బాంబుల వినియోగంలోనే పోటీ పడుతూ మన రక్షణను మనమే సంహరించుకుంటున్నాం. ప్రజల్లో మార్పు అనేది రావాల్సిన అవసరం ఏర్పడింది.

హోళీ: మన దేశంలో జరుపుకునే పండుగల్లో హోళీ కూడా ఒకటి. దీన్ని కూడా దేశవ్యాప్తంగా జరుపుకుంటాం. ఉత్తరాదిలో ఇంకా ఎక్కువగా వైభవంగా జరుపుకుంటారు. సంప్రదాయ రంగుల్లో మనం వాడుకోవాల్సి ఉండగా రసాయనాలతో తయారు చేసిన రంగుల వాడకంతో వాతావరణం మారిపోతోంది. సంప్రదాయానికి టాటా చెప్పి వికృతంగా తయారు చేసిన వాటినే మనం నమ్ముతున్నాం. అందుకే మనకు సరైన రీతిలో రంగులతో లాభం లేకుండా పోతోంది. దీంతో భవిష్యత్తులో మరిన్ని అనర్థాలు జరిగే సూచనలు కనిపిస్తున్నాయి. దీనికి అడ్డుకట్ట వేయాల్సిన అసవరం ఎంతైనా ఉంది.

సంక్రాంతి: సంక్రాంతి అంటే రైతుల పండుగ. ఇందులో కూడా నేడు విచిత్ర పోకడలు కనిపిస్తున్నాయి. పూర్వం రోజుల్లో పిండివంటలకే ప్రాధాన్యం ఇచ్చేవారు. కానీ నేడు కోడిపందాలు, పేకాటలు జోరుగా సాగుతున్నాయి. అయినా ఎవరు పట్టించుకోవడం లేదు. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ లో అయితే కోడిపందాలే ప్రధానంగా జరుగుతున్నాయి. తెలంగాణలో మాత్రం కొంత పరిస్థితి మెరుగ్గా ఉన్నా ఇంకా పరిస్థితిలో మార్పు రావాల్సిన అవసరం ఏర్పడింది. పండుగలు పక్కదారి పట్టకుండా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది.

పండుగల ప్రాధాన్యంలో పలు మార్పులు చోటుచేసుకుంటున్నాయి. హిందూ సంస్కృతికి భిన్నంగా పాశ్చాత్య దేశాల పోకడలు వంట బట్టించుకుంటున్నారు. దీంతో పండుగల్లో పూర్వం స్థితి కనిపించడం లేదు. దసరా వేడుకల్లో మహిళలు పాడే పాటలు చెవులకు ఇంపుగా ఉండేవి. కానీ ప్రస్తుతం డీజేల సంగీతంతో చిందులేస్తూ సంప్రదాయానికి చరమగీతం పాడుతున్నారు. కానీ మానవ నాగరికత క్రమంలో ప్రస్తుతం వస్తున్న మార్పులను ఆహ్వానించడం సబబు కాదు.మన సంస్కృతిని ప్రతిబింబించే విధంగా పండుగలు జరుపుకోవాలి. మన పూర్వీకులు అందించిన నాగరికతను మనం పెంచి పోషించాలి. అప్పుడే అంతే జాగ్రత్తగా భావి తరాలు సైతం పాటించి వారి పిల్లలకు అందించే వీలుంటుంది. దీనికి అందరు నడుం బిగించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. స్వచ్చంధ సంస్థలైనా యువత కానీ పండుగల ప్రాశస్త్యాన్ని గుర్తించి మనలో మార్పు తీసుకొచ్చేందుకు పాటుపడాల్సిన బాధ్యతను గుర్తించాలి.

Srinivas
Srinivashttps://oktelugu.com/
Srinivas is a Political Reporter working with us from last one year. He writes articles on latest political updates happening in both Telugu States. He has the experience of more than 15 years in Journalism.
RELATED ARTICLES

Most Popular