Homeపండుగ వైభవంGanesh Immersion: వినాయకుడి నిమజ్జనం ఎందుకు చేస్తారో తెలుసా?

Ganesh Immersion: వినాయకుడి నిమజ్జనం ఎందుకు చేస్తారో తెలుసా?

భాద్రపదమాసంలో ఎటుచూసినా పచ్చదనమే కనిపిస్తుంది. ఆ ప్రకృతిలో తిరగడమే ఓ పండుగలా తోస్తుంది. సృష్టికి కారణమైన శక్తికి ప్రతిరూపంగా, ఆ వాతావరణం నిలుస్తుంది. ఆ శక్తిని తల్చుకుంటూ, తమ జీవితాలు ఎలాంటి ఆటంకాలూ లేకుండా ముందుకు సాగిపోవాలనుకుంటూ విఘ్నాధిపతి అయిన వినాయకుడిని కొలుచుకుంటాం. అదే వినాయక చవితి. వినాయక చవితి సంప్రదాయం యావత్తూ, ప్రకృతికి అనుగుణంగానే సాగుతుంది. నదులలోను, వాగులలోను దొరికే ఒండ్రుమట్టితో ఆ స్వామి ప్రతిమను రూపొందిస్తాము. ఏకవింశతి పత్రపూజ పేరుతో 21 రకాల ఆకులతో ఆయనను కొలుస్తాము. ఇలా కొలుచుకున్న స్వామిని, ఆయనను పూజించిన పత్రితో సహా నిమజ్జనం చేస్తాం. అయితే మహారాష్ట్రలో కరువు వచ్చిందని, నిమజ్జనానికి నీళ్లు లేవని కర్ర గణేశ్‌ను నవరాత్రులు పూజించారు. ఆ సంప్రదాయం ఇప్పటికీ కొనసాగుతోంది. అయితే నిమజ్జనం అనేది గణపతి నవరాత్రి ఉత్సవాల్లో ప్రధాన ఘట్టం. స్వామివారి ప్రతిష్టాపన ఎంత వైభవంగా నిర్వహిస్తారో.. నిమజ్జనం అంతకన్నా వైభవంగా జరుపుతారు.

ప్రకృతి సిద్ధంగా వినాయక పూజ..
సృష్టి, స్థితి, లయలనే మూడు దశలూ వినాయక పూజలో కనిపిస్తాయి. ఈ మూడింటికీ విరుద్ధంగా పూజ సాగిందంటే అందులో ఏదో కృత్రిమత్వం మొదలైందనే అర్థం. వినాయకుడి పూజ కోసం మట్టి విగ్రహం, పత్రాలు ఉపయోగించడం వెనక మరో కారణం కూడా కనిపిస్తుంది. ఒండ్రు మట్టిలోనూ, పత్రాలలోనూ ఔషధి గుణాలు ఉంటాయి. గణపతికి చేసే షోడశోపచార పూజలో భాగంగా మాటిమాటికీ ఈ విగ్రహాన్ని, పత్రాలనూ తాకడం వల్లాం వాటిలోని ఔషధి తత్వం మనకి చేరుతుంది. పూజ ముగిసిన తర్వాత ఓ తొమ్మిది రోజుల పాటు ఆ విగ్రహాన్నీ, పత్రాలనూ ఇంట్లో ఉంచడం వల్ల చుట్టూ ఉన్న గాలిలోకి ఆ ఔషధి గుణాలు చేరతాయి.

తొమ్మిది రాత్రల ర్వాత నిమజ్జనం..
ఇక తొమ్మిది రోజుల పాటు విగ్రహాన్నీ, పత్రాలనీ ఇంట్లో ఉంచుకున్న తర్వాత దగ్గరలో ఉన్న జలాశయంలో కానీ, బావిలోకానీ నిమజ్జనం చేస్తాము. ఈ క్రతువులో ఎక్కడా ఎలాంటి శేషమూ మిగలదు. వినాయక చవితి నాటికి వర్షాలు ఊపందుకుంటాయి. వాగులూ, నదులూ ఉధృతంగా ప్రవహిస్తూ ఉంటాయి. అలాంటి సమయంలో తీరం వెంబడి మట్టి విగ్రహాలను నిమజ్జనం చేయడం వల్ల వరద పోటు తగ్గే అవకాశం ఉంటుంది. పైగా ఈ కాలంలో ప్రవహించే నీటిలో క్రిమికీటకాలు ఎక్కువగా ఉంటాయని అంటారు. నిమజ్జనంలో విడిచే పత్రితో నీరు కూడా క్రిమి రహితంగా మారిపోతుందన్నది పెద్దల మాట. నిమజ్జనం చేసే ఆచారం ఉన్న దసరా, బతుకమ్మ పండుగలు కూడా వర్ష రుతువులోనే వస్తాయి. ఇదీ∙నిమజ్జనం వెనుక ఉన్న విశేషం. అయితే ప్రకృతి పరమైన విశేషాలతోపాటు ఇందులో సామాజికాంశాలూ లేకపోలేదు. వాడవాడలా వినాయక చవితి విగ్రహాలు వెలసిన తర్వాత, ఇరుగుపొరుగూ కలిసి కోలాహలంగా ఈ వేడుకని జరుపుకోవడమూ చూడవచ్చు.

Ashish D
Ashish Dhttps://oktelugu.com/
Ashish. D is a senior content writer with good Knowledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.
Exit mobile version