Heroine Vedika : ఎన్టీఆర్ నటించిన లేటెస్ట్ చిత్రం ‘దేవర’ భారీ అంచనాల నడుమ ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా విడుదలై మంచి రెస్పాన్స్ ని దక్కించుకొని బాక్స్ ఆఫీస్ వద్ద కళ్ళు చెదిరే వసూళ్లతో ముందుకు దూసుకుపోతున్న సంగతి అందరికీ తెలిసిందే. ఈ సినిమా విడుదల రోజు అభిమానుల చేసిన హంగామా ని అంత తేలికగా ఎవ్వరూ మర్చిపోలేరు. ఇతర హీరోల అభిమానులకు ఈ సంబరాలు ఒక బెంచ్ మార్క్ అని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. అనకాపల్లి నుండి అమెరికా వరకు తెలుగు ప్రేక్షకులు ఉన్న ప్రతీ చోట ఈ సినిమాకి ఓపెనింగ్స్ ఎలా అయితే అదిరాయో, థియేటర్స్ బయట ఫ్యాన్స్ సంబరాలు కూడా అదే రేంజ్ లో జరిగాయి. అందుకు సంబంధించిన వీడియోలు, ఫోటోలు సోషల్ మీడియా లో ఇప్పటికీ ట్రేండింగ్ అవుతూనే ఉన్నాయి. ఆరేళ్ళ తర్వాత ఎన్టీఆర్ నుండి వస్తున్న సోలో చిత్రం కాబట్టి అభిమానులు ఒక్క పెద్ద పండుగ లాగా జరుపుకున్నారు. అయితే కొన్ని వీడియోలు చూసేందుకు చాలా ఇబ్బందికరంగా ఉన్నాయి. రాయలసీమ వంటి ఊర మాస్ ప్రాంతాలలో ఎన్టీఆర్ కి వీరాభిమానులు ఉంటారు.
ఆయన కోసం ప్రాణాలను సైతం ఇచ్చేస్తుంటారు. చాలా మంది అభిమానులు చేతులు కోసుకొని రక్తలతో ఎన్టీఆర్ కటౌట్స్ కి తిలకం దిద్దిన సందర్భాలు ఉన్నాయి. అంతే కాకుండా సీమ ప్రాంతాల్లో మాస్ హీరోల సినిమా విడుదల సమయం లో మేకను బలి ఇచ్చి, దాని తలను కటౌట్ కి వేలాడదీస్తుంటారు. దశాబ్దాల నుండి ఇలాంటివి అక్కడ జరుగుతూనే ఉన్నాయి. ‘దేవర’ విషయం లో కూడా అభిమానులు ఇలాంటి పనే చేసారు. మేక తలకు తాడు కట్టి ఒకరు గట్టిగా పట్టుకోగా మరొకరు దాని తలని నరికేస్తాడు. ఈ వీడియో సోషల్ మీడియా అంతటా తెగ వైరల్ గా మారడం తో ప్రముఖ యంగ్ హీరోయిన్ వేదిక స్పందించింది.
ఆమె మాట్లాడుతూ ‘ఏంటీ ఈ ఘోరం..చూస్తేనే భయంకరంగా అనిపిస్తుంది. మనుషులు అయ్యుండి ఇలాంటి హింస తలపెట్టడానికి మీకు మనసు ఎలా వచ్చింది. ఇలాంటివి చూస్తేనే నా హృదయం కలిచివేసేంత వేదనకు గురైంది. అలాంటిది మీరు ఎలా ఇలాంటి పనులు ప్రత్యక్షంగా చేయగలిగారు. పాపం ఆ మూగజీవి మీకు ఏమి అన్యాయం చేసింది. ఒకరు తల పట్టుకొని లాగుతున్నారు, మరొకరు నరుకుతున్న, ఆ తర్వాత మీ హీరో పోస్టర్ కి రక్తాభిషేకం చేస్తున్నారు. సంబరాల పేరిట ఇంత హింస అవసరమా?, ఇలాంటివి మీ హీరో కూడా అభినందించడు. ఆ మూగజీవి ఆత్మకు శాంతి చేకూరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మళ్ళీ ఇలాంటి ఘటనలు పునరావృత్తం కాకూడదని ఆ దేవుడికి ప్రార్థన చేస్తున్నాను’ అంటూ వేదిక చెప్పుకొచ్చింది. వేదిక ఈ ఘటనపై స్పందించడంతో ఆ వీడియో మరింత వైరల్ అయ్యింది. దీంతో ట్విట్టర్ రూల్స్ ప్రకారం ఆ పోస్ట్ ని తొలగించి వేశారు. గతంలో కూడా పవన్ కళ్యాణ్, ప్రభాస్ వంటి మాస్ హీరోల సినిమాల విడుదల సమయంలో ఇలాంటి ఘటనలు చోటు చేసుకున్నాయి.