
భారత్-చైనా సరిహద్దుల్లో జరిగిన ఘర్షణల్లో వీరమరణం పొందిన భారత జవానులకు యావత్ దేశం కన్నీటి నివాళి అర్పించింది. డ్రాగన్ దేశ సైనికుల చేతిలో తెలుగు కల్నల్ సంతోష్ బాబుతో పాటు మరో 19 మంది భారత జవాన్లు మృతి చెందినట్లు ఆర్మీ ప్రకటించింది. దీనిపై దేశవ్యాప్తంగా ఆగ్రహ జ్వాలలు చెలరేగుతుండగా.. సామాన్యుల నుంచి సెలబ్రెటీల వరకు అమర సైనికులకు సోషల్ మీడియా ద్వారా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నారు. ఈ విషయంపై టాలీవుడ్ ప్రముఖులు స్పందించారు. ‘గాల్వన్ లోయ వద్ద మన జవాన్లు అమరులయ్యారని తెలుసుకుని కలత చెందాను. వారి త్యాగాల మన గుండెల్లో ఎప్పటికీ ఉండి పోతాయి. మన యోధులకు, వారిలోని దేశ భక్తికి సెల్యూట్ చేస్తున్నాం. అమరులైన జవాన్ల కుటుంబాలకు సానుభూతి తెలుపుతున్నాను’ అని మహేశ్ బాబు ట్వీట్ చేశాడు.
‘ మన వీర జవాన్ల బలిదానం పట్ల మాటలు రావట్లేదు. దేశాన్ని కాపాడడం కోసం విధులు నిర్వర్తిస్తూ ప్రాణాలు అర్పించిన వీర జవాన్ల కుటుంబాలకు నా సానుభూతి’ అని సాయితేజ్ ట్వీట్ చేశాడు. సుధీర్ బాబు.. ‘బరువెక్కిన గుండెతో ఈ వార్త చదివాను. అమరవీరులకు సెల్యూట్’ అని అని పేర్కన్నాడు. ‘అమరులైన భారత జవాన్లకు సెల్యూట్ చేస్తున్నాను. ఓం శాంతి.. ఆ జావాన్ల కుటుంబాలకు సానుభూతి తెలుపుతున్నాను’ అని హీరోయిన్ కాజల్ అగర్వాల్ ట్వీట్ చేసింది.
చైనా అహంకార చర్య చూసి తన రక్తం మరిగిపోతోందని, టిక్‌టాక్ నుంచి మొదలు చైనా వస్తువులన్నింటిని బహిష్కరించాలని యువ హీరో నిఖిల్ సిద్దార్థ్ పిలుపునిచ్చాడు. అంతేకాకుండా వీర జవాను సంతోష్ బాబు తల్లిని ఉద్దేశిస్తూ ‘అమ్మ నీ త్యాగాన్ని మేము ఎప్పటికీ మర్చిపోము. మేమందరం మీతోనే ఉన్నాం. ధైర్యంగా ఉండండి’ అంటూ ట్వీట్ చేశాడు. దేవిశ్రీప్రసాద్, అనిల్ సుంకర, ప్రణీత, మంచు విష్ణు, లక్ష్మీ మంచు, వరుణ్ తేజ్, అనిల్ రావిపూడి, తదితరులు కూడా అమర సైనికులకు ఘన నివాళులు అర్పించారు.