సినిమా ఇండస్ట్రీలో ప్లాప్ తీసిన డైరెక్టర్ అంటే అందరికీ చులకనే. గతంలో హిట్లు ఇచ్చాడు అనే కోణంలో కూడా ఎవరూ ఆలోచించరు. ఇప్పుడేంటి ? హిట్ లో ఉన్నాడా ? అని హీరోలు ఆలోచిస్తే.. ఏమిటయ్యా అతగాడు స్టార్ హీరో డేట్లు తెచ్చుకోగలడా ? అంటూ నిర్మాతలు యోచన చేస్తారు. ఏది ఏమైనా ఒక్క ప్లాప్ చాలు, దర్శకుడి కెరీర్ మసకబారడానికి.
ఇప్పుడు ఆ దశలోనే ఉన్నాడు మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను. యాక్షన్ సినిమాలకు బోయపాటి కేరాఫ్ అడ్రస్. దానిలో ఎలాంటి డౌట్ లేదు. పైగా ఒకప్పుడు బోయపాటికి అడ్వాన్స్ లు ఇవ్వడానికి నిర్మాతలు తెగ ఉబలాట పడేవారు. కానీ, పరిస్థితి మారింది. బోయపాటికి ప్రస్తుతం ఏ నిర్మాత అడ్వాన్స్ ఇవ్వడానికి ముందుకు రావడం లేదనేది ఇండస్ట్రీ టాక్.
కారణం ఒక్కటే.. బోయపాటి పేరు వింటేనే ఏ స్టార్ హీరో ఇంట్రెస్ట్ చూపించడం లేదట. స్టార్ హీరోలంతా పాన్ ఇండియా మోజులో ఉన్నారు. ఇలాంటి టైంలో బోయపాటితో సినిమా చేస్తే పెద్ద రిస్క్ అనే స్టేజ్ లోకి వెళ్ళిపోయారు అందరూ. బోయపాటి లోకల్ ఎమోషన్స్ కి ఊరమాస్ కి పాన్ ఇండియా సెట్ అవ్వదు. అందుకే ఏ స్టార్ హీరో ముందుకు రావడం లేదు.
నిజంగా ఇది బోయపాటికి బాధ కలిగించే అంశమే. మరి బోయపాటి బాధను పోగొట్టడానికి ఆయన సన్నిహితులు గట్టి ప్రయత్నాలు చేస్తున్నారు. తమిళ యాక్షన్ హీరో విశాల్ తో బోయపాటి సినిమా ఫిక్స్ అయిందని కొన్ని రోజులు, లేదు కేజీఎఫ్ హీరో యష్ తో బోయపాటి సినిమా దాదాపు ఖాయం అని మరికొన్ని రోజులు.. అంతలో పవన్ కళ్యాణ్ తో కూడా బోయపాటి సినిమా చేస్తున్నాడు అని మరో పుకారు.. కొన్ని చోట్ల అయితే బోయపాటి కోసం యష్ – పవన్ కళ్యాణ్ పోటీ పడుతున్నారని కూడా రాస్తున్నారు.
అసలు ఈ పుకార్లు ఎక్కడ నుండి వస్తున్నాయి అని ఆరా తీస్తే.. అసలు విషయం బయట పడింది. బోయపాటి రేంజ్ ను పెంచడానికి ఆయన సన్నిహితులు ఈ విధంగా వార్తలు రాయిస్తున్నారు. కానీ వాస్తవం మరోలా ఉంది. ఒక్క బాలయ్య తప్ప ఏ హీరో బోయపాటికి డేట్లు ఇచ్చేలా లేడు. పాపం బోయపాటి.