
వచ్చిన ఛాన్స్ అందిపుచ్చుకుని సక్సెస్ కొట్టేవాడికే ఈ పోటీ ప్రపంచంలో స్థానం ఉంటుంది. ఒకప్పుడు విజయాలు సాధించినా, ప్రస్తుతం విజయం లేకపోతే, ఇక ఆ వ్యక్తికి విలువ ఇవ్వదు ఈ సమాజం. అలాంటిది ఇక సినిమా ఇండస్ట్రీ గురించి చెప్పేది ఏముంది ? అన్ని ఉండి అవకాశం వస్తేనే అదృష్టవంతుడు అంటారు, ఆ అదృష్టానికి సక్సెస్ తోడు అవ్వడం అనేది లక్షల్లో ఒక్కరికో ఇద్దరికో కుదిరే పని.
అలా చాలాసార్లు కుదిరింది దర్శకుడు వీవీ వినాయక్ కు. కానీ, ఫామ్ కోల్పోయాక వినాయక్ కి అవకాశం ఇచ్చేవాడే లేకుండా పోయాడు. చివరకు బాలయ్య కూడా వినాయక్ కి సినిమా ఇవ్వలేదు అంటే.. వినాయక్ ప్రస్తుత పరిస్థితి అర్ధం చేసుకోవచ్చు. అయితే వినాయక్ మాత్రం ఏకంగా మెగాస్టార్ కోసం ట్రై చేస్తున్నాడు. చిరు కోసం ప్రస్తుతం ఒక కథ రాస్తున్నాడు.
చిరంజీవి సీఎం అయితే ఎలా ఉంటుందనే కాన్సెప్ట్ తో గతంలో వినాయక్ ఒక కథ రాశాడట. ఇప్పుడు ఆ కథనే అటుఇటుగా మార్చి మళ్ళీ కొత్త సీన్స్ రాసుకుని, రచయిత గోపీ మోహన్ తో కలిసి, స్క్రీన్ ప్లే కూడా కూర్చుంటున్నాడట. త్వరలోనే ఈ స్క్రిప్ట్ పూర్తి చేసి.. చిరుని కలిసి ఒప్పించాలని వినాయక్ ప్లాన్ చేస్తున్నాడు. మరి కథ నచ్చితే.. వినాయక్ కి చిరు ఛాన్స్ ఇస్తారా ?
మొత్తం కథ కూడా వినకుండా సినిమాలు ఒప్పుకునే బాలయ్య బాబునే వినాయక్ ఒప్పించలేకపోయాడు. అలాంటిది ఇక మెగాస్టార్ ను ఒప్పిస్తాడు అంటే నమ్మశక్యంగా లేదు. ఏది ఏమైనా వినాయక్ ఫామ్ కోల్పోయాక స్టార్ హీరోలు మొత్తం వినాయక్ ను దూరం పెట్టారు. వినాయక్ తో ఎంతో సన్నిహితంగా ఉండే ఎన్టీఆర్ కూడా వినాయక్ కి ఛాన్స్ ఇవ్వడానికి ఆసక్తి చూపించడం లేదు.