Tollywood: సంధ్య థియేటర్ ఉదంతం మొత్తం చిత్ర పరిశ్రమనే కుదేలు చేస్తుంది. మొన్నటి వరకు అల్లు అర్జున్ సమస్యగా ఉన్న ఈ ఉదంతం టాలీవుడ్ ప్రయోజనాలనే దెబ్బ తీసింది. డిసెంబర్ 4వ తేదీ రాత్రి సంధ్య థియేటర్ కి రేవతి అనే మహిళ కుటుంబ సభ్యులతో పాటు పుష్ప 2 సినిమా వీక్షించేందుకు వెళ్ళింది. తొక్కిసలాట చోటు చేసుకోవడంతో రేవతి అక్కడికక్కడే మృతి చెందింది. ఆమె కుమారుడు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. కేసు నమోదు చేసిన పోలీసులు అల్లు అర్జున్ ని సైతం అరెస్ట్ చేశారు. సంధ్య థియేటర్ వద్దకు అనుమతులు లేకుండా అల్లు అర్జున్ సినిమా చూసేందుకు వెళ్లడం కారణంగానే తొక్కిసలాట చోటు చేసుకుందని.. పోలీసులు ఆరోపిస్తున్నారు.
అల్లు అర్జున్ అరెస్ట్ వెనుక సీఎం రేవంత్ రెడ్డి హస్తం ఉందని ప్రతిపక్షాలు విమర్శలు గుప్పించాయి. చిత్ర ప్రముఖులు కొందరు తమ అసహనం వెళ్లగక్కారు. సోషల్ మీడియాలో సీఎం రేవంత్ కి వ్యతిరేకంగా పోస్ట్స్ దర్శనమిచ్చాయి ముఖ్యంగా అల్లు అర్జున్ ఫ్యాన్స్ రేవంత్ రెడ్డిని ఏకిపారేశారు. ఈ సోషల్ మీడియా పోస్ట్స్ మీద సీఎం రేవంత్ రెడ్డి సీరియస్ అయ్యారు. అల్లు అర్జున్ ని, టాలీవుడ్ ప్రముఖులను తప్పుబట్టారు. ఇకపై తెలంగాణలో బెనిఫిట్ షోలు, టికెట్స్ ధరల పెంపు ఉండదు అంటూ నిర్ణయం తీసుకున్నారు.
భారీ బడ్జెట్ చిత్రాలను సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయం దెబ్బ తీయనుంది. మరో మూడు వారాల్లో సంక్రాంతి సినిమాలు విడుదల కానున్నాయి. గేమ్ ఛేంజర్, డాకు మహారాజ్ నిర్మాతలకు ఇది పెద్ద షాక్. ఈ క్రమంలో సీఎం రేవంత్ రెడ్డిని టాలీవుడ్ ప్రముఖులు కలిసేందుకు సిద్ధం అవుతున్నారంటూ కథనాలు వెలువడుతున్నాయి. సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయం పై స్టార్ ప్రొడ్యూసర్ నాగ వంశీ స్పందించారు.
ఎఫ్డీసీ చైర్మన్ దిల్ రాజు గేమ్ ఛేంజర్ ప్రమోషన్స్ లో భాగంగా అమెరికా వెళ్లారు. ఆయన తిరిగొచ్చాక సీఎం రేవంత్ రెడ్డిని కలుస్తాము. టికెట్స్ ధరల పెంపు, బెనిఫిట్ షోలకు అనుమతి వంటి విషయాలు చర్చిస్తాము. నా సినిమా డాకు మహారాజ్ కంటే ముందే దిల్ రాజు నిర్మించిన గేమ్ ఛేంజర్ విడుదల అవుతుంది. కాబట్టి టికెట్స్ ధరల విషయంలో దిల్ రాజు ఏమి తెలుస్తారో అదే అందరికీ వర్తిస్తుంది.. అన్నారు.
టాలీవుడ్ ఏపీకి తరలి వెళ్లనుందని సమాచారం. దీనిపై మీ కామెంట్ ఏమిటని అడగ్గా… నేను కోట్ల రూపాయలు ఖర్చు చేసి హైదరాబాద్ లోనే ఇల్లు నిర్మించుకున్నాను. అలాంటప్పుడు హైదరాబాద్ వదిలి మరో చోటికి ఎందుకు వెళతాను. తెలుగు చిత్ర పరిశ్రమకు రెండు రాష్ట్రాల అనుమతి ఉంది, అన్నారు.