
దర్శక దిగ్గజం రాజమౌళి సినిమాలు చేయడానికి ఎంత టైం తీసుకుంటాడో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. సినిమాలోని ప్రతీ షాట్ అద్భుతంగా తెరకెక్కించేందుకు రాజమౌళి ఆరాటపడుతూ ఉంటాడు. దీనిలో భాగంగానే ఒక్కో సినిమా చేయడానికి ఈజీగా రెండు మూడేళ్ల సమయం తీసుకుంటూ ఉంటాడు. సినిమా అవుట్ పుట్ కూడా ఓ రేంజులో ఉండటంతో ఇండస్ట్రీలో రాజమౌళికి తిరుగులేకుండా పోతుంది.
‘బాహుబలి’ సినిమా తర్వాత రాజమౌళి రేంజ్ మరింత పెరిగింది. ఈ సినిమా ఇండియన్ సినిమా రికార్డులను కొల్లగొట్టి అత్యధిక కలెక్షన్లు సాధించింది. ఈ సినిమాలో నటించిన ప్రభాస్.. రానాలు ప్రస్తుతం ప్యాన్ ఇండియా స్టార్లుగా మారిపోయారు. ‘బాహుబలి’ తర్వాత రాజమౌళి ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న చిత్రం ‘ఆర్ఆర్ఆర్’.
మెగా పవర్ స్టార్ రాంచరణ్.. జూనియర్ ఎన్టీఆర్ కలిసి ‘ఆర్ఆర్ఆర్’ నటిస్తుండటంతో సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇప్పటికే ఈ మూవీకి సంబంధించిన టీజర్స్.. పోస్టర్లు అభిమానులను ఎంతోగానో ఆకట్టుకున్నాయి. అయితే కరోనా కారణంగా పలుమార్లు వాయిదాపడిన ఈ మూవీ షూటింగ్ ఇటీవల మళ్లీ ప్రారంభమైంది.
తాజాగా ఈ మూవీకి సంబంధించిన ఓ అప్టేడ్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. రెండు సాంగ్స్ మినహా షూటింగ్ మొత్తం పూర్తయినట్లు వెల్లడిస్తూ ఓ కొత్త పోస్టర్ ను ‘ఆర్ఆర్ఆర్’ యూనిట్ విడుదల చేసింది. ఈ పోస్టర్లో ఎన్టీఆర్ బైక్ నడుపుతుండగా రాంచరణ్ వెనుక కూర్చొని ఉంటాడు. ఎన్టీఆర్ భుజంపై చేతులు వేసి రాంచరణ్ నవ్వుతుండగా ఎన్టీఆర్ సైతం నవ్వుతున్నట్లు చూపించారు.
ఇదంతా బాగానే ఉన్నప్పటికీ పోస్టర్లో మాత్రం ‘ఆర్ఆర్ఆర్’ రిలీజ్ డేట్ అక్టోబర్ 13న ఉండటం ఆసక్తిని రేపుతోంది. ఈ మూవీ రిలీజు డేట్ ఇప్పటికే పలుసార్లు వాయిదాపడి చివరగా అక్టోబర్ 13న ఫిక్స్ అయింది. ఈ సమయంలో కరోనా థర్డ్ వేవ్ వచ్చే అవకాశం ఉన్నట్లు నిపుణులు అంచనా వేస్తున్నారు. ప్యాన్ ఇండియా సినిమా అయిన ‘ఆర్ఆర్ఆర్’కు ఈ డేట్ కలిసి వచ్చే అవకాశం లేదని తెలుస్తోంది.
అయితే చిత్రయూనిట్ పోస్టర్ పై అక్టోబర్ 13న రిలీజ్ డేట్ ప్రకటించడం చూస్తుంటే రాజమౌళి దసరా సెలవులపై ముందుస్తు ఖర్చీఫ్ వేసినట్లు తెలుస్తోంది. ఆ సమయానికి పరిస్థితులు అనుకూలించకపోతే అప్పుడు చూసుకోవచ్చనే ధోరణిలో ఉన్నట్లు కనిస్తోంది. మొత్తానికి ‘ఆర్ఆర్ఆర్’ రిలీజ్ డేట్ ను మరోసారి చర్చనీయాంశంగా మార్చిన క్రెడిట్ మాత్రం రాజమౌళికే దక్కుతుంది. దీంతో జక్కన్న పబ్లిసిటీనా.. మజాకా అని అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు.