ప్రముఖ దర్శకుడు శేఖర్ కమ్ముల అప్ కమింగ్ మూవీ ‘లవ్ స్టోరీ.’ ఈ చిత్రానికి సంబంధించి ఇటీవల రిలీజైన ‘సారంగ దరియా’ అనే పాట ఎంత పాపులర్ అయ్యిందో.. అంతకన్నా ఎక్కువ విదాస్పదమైంది. ఈ జానపద గీతం తనదేనంటూ గీత రచయి సుద్దాల అశోక్ తేజ.. ఇటు కోమలి అనే ఫోక్ సింగర్ వాదించుకుంటున్న విషయం తెలిసిందే. కొన్ని రోజులుగా సాగుతున్న ఈ పంచాయితీలో కోమలికే మద్దతు పెరుగుతూ వచ్చింది. సోషల్ మీడియాలో సినిమా యూనిట్ పై ట్రోల్ భారీగానే సాగింది. దీంతో ఎట్టకేలకు దర్శకుడు శేఖర్ కమ్ముల దిగివచ్చారు.
Also Read: కలల ప్రేమ మైకంలో ప్రభాస్-పూజా.. రాధేశ్యామ్ పోస్టర్ రిలీజ్..
అప్పట్లో మాటీవీ ఛానల్ లో ‘రేలారే రేలా’ అనే ఓ ప్రోగ్రామ్ కొనసాగింది. జానపద గీతాల షో అయిన ప్రోగ్రామ్‌లో కోమలి ‘సారంగ దరియా’ పాటను తొలిసారిగా పాడింది. ఇది తెలంగాణలోని జానపద గేయం. ఇది తరాల నుంచి ఉన్నప్పటికీ.. దాన్ని సేకరించి, తగిన గుర్తింపు తెచ్చింది మాత్రం కోమలి అని చెప్పడంలో సందేహం లేదు. అంతేకాదు.. సారంగ దరియా అనే పాట వినిపిస్తే.. అది కోమలిదే అయి ఉంటుందని నాటి జడ్జిగా సుద్దాల అశోక్ తేజ మెచ్చుకోవడం విశేషం.
అయితే.. ఇప్పుడు లవ్ స్టోరీ సినిమా కోసం ఈ పాటలో పల్లవిని యథాతథంగా ఉంచి, చరణాలను కొత్తగా రాసి, తన పేరు వేసుకున్నారు సుద్దాల. ఇది తాను సేకరించిన పాట అని, తనకు కనీస గుర్తింపు కూడా ఇవ్వకుండా.. సుద్దాల అశోక్ తేజ తన పేరు ఎలా వేసుకుంటారని ప్రశ్నిస్తోంది కోమలి. దీనికి సుద్దాల బదులిస్తూ.. జానపదం అందరిదనీ, ఎవరికైనా దానిపై హక్కు ఉందంటూ.. తన పేరు వేసుకోవడం సరైందే అన్నారు. అయినప్పటికీ.. తొలిగా సేకరించింది తానేకాబట్టి, తనకూ క్రెడిట్ ఇవ్వాలన్నది కోమలి.
Also Read: సినిమా రివ్యూః జాతి రత్నాలు
ఇలా.. రోజుల తరబడి సాగిన వ్యవహారం రచ్చ రచ్చగా మారింది. సోషల్ మీడియా వేదికగా పెద్ద చర్చే నడిచింది. అందరూ కోమలికి మద్దతు తెలపడంతో.. ఇక వివాదాన్ని తెరదించడానికి రంగంలోకి దిగారు దర్శకుడు శేఖర్ కమ్ముల. ఈ మేరకు వివరణ ఇచ్చారు. ఈ పాటను శిరీష అనే ఫోక్ సింగర్ ద్వారా పాడిద్దామని తాను చెప్పగా.. కోమలితోనే పాడిద్దామని సుద్దాల చెప్పారని శేఖర్ చెప్పారు. ఈ మేరకు కోమలికి ఫోన్ చేస్తే దగ్గు, జలుబు ఉండటం వల్ల సమయం కోరిందని చెప్పారు.
అయితే.. అప్పటికే చెన్నై నుంచి సంగీత దర్శకుడు వచ్చి ఉండడంతో మంగ్లీతో పాడించినట్టు చెప్పారు శేఖర్. పాట రిలీజ్ అయిన తర్వాత కోమలి వాదనలు తాను చూడలేదని చెప్పారు. ఈ పాట క్రెడిట్ తప్పకుండా కోమలికి ఇస్తామని, ఆమెకు ఇవ్వాల్సిన డబ్బులు కూడా ఇస్తామని, ఆడియో ఫంక్షన్లో తనతోనే పాట పాడిస్తానని చెప్పారు శేఖర్ కమ్ముల. మొత్తానికి.. ఈ విధంగా వివాదాన్ని పరిష్కరించడానికి సిద్ధమయ్యారు దర్శకుడు. మరి, ఈ ప్రతిపాదనపై కోమలి ఎలా స్పందిస్తుందన్నది చూడాల్సి ఉంది.
మరిన్ని సినిమా వార్తల కోసం టాలీవుడ్ న్యూస్