మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ హీరోలుగా.. దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న చిత్రం RRR. ఈ సినిమాపై అటు అభిమానుల్లో ఇటు ప్రేక్షకుల్లో అంచనాలు ఏ స్థాయిలో ఉన్నాయో అందరికీ తెలిసిందే. ప్రతిష్టాత్మకంగా రూపొందుతున్న ఈ పీరియాడికల్ డ్రామాను మరో వివాదం చుట్టుముడుతుందా? అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఈ చిత్రానికి సంబంధించి ఓ న్యూస్ లీక్ కావడమే ఈ అనుమానాలకు కారణం!
ఈ చిత్రంలో రామ్ చరణ్ మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు పాత్ర పోషిస్తున్న సంగతి తెలిసిందే. జూనియర్ ఎన్టీఆర్ గోండు బెబ్బులి కొమరం భీమ్ క్యారెక్టర్లో నటిస్తున్నాడు. సమకాలీనులుగా ఉన్న ఈ చారిత్రక వీరులకు సంబంధించిన కొంత చరిత్ర అందుబాటులో లేదు. ఆ సమయంలో వీరు ఎక్కడికి వెళ్లారు? ఏం చేశారనేది ఎవ్వరికీ తెలియదు. ఆ గ్యాప్ ను సెంటర్ పాయింట్ చేసుకొని, వీళ్లిద్దరూ కలిస్తే ఎలా ఉంటుందనే ఫిక్షన్ తో ఈ సినిమాను రూపొందిస్తున్నాడు రాజమౌళి.
ఆ భాగం కల్పితం కాబట్టి.. దర్శకుడు ఏమైనా ఊహించుకోవచ్చు. ఏదైనా పెట్టొచ్చు. కానీ.. ఆయన తెరకెక్కిస్తున్న కథ ఆషామాషీది కాదు. బ్రిటీష్, నైజాం బానిస సంకెళ్లను ఎదిరించి పోరాడిన వీరుల చరిత్ర అది. కాబట్టి.. ఏదిపడితే అది పెడతానంటే కుదరదు.
ఇప్పటికే.. కొమరం భీమ్ పాత్ర పోషిస్తున్న ఎన్టీఆర్ ను ముస్లింగా చూపించినందుకే పెద్ద రచ్చ జరిగింది. అలాంటిది.. ఇప్పుడు మరో వివాదాస్పద అంశాన్ని భీమ్ పాత్ర చుట్టూ అల్లారని అంటున్నారు. ఎన్టీఆర్ సరన ఈ చిత్రంలో హాలీవుడ్ హీరోయిన్ ఒలీవియా నటిస్తున్న సంగతి తెలిసిందే.
అయితే.. లేటెస్ట్ అప్డేట్ ఏమంటే.. కొమరం భీమ్ సరసన మరో పాత్రను కూడా చూపిస్తున్నారట. అంటే.. భీమ్ ఇద్దరితోనూ ప్రేమాయణం నడిపినట్టు చూపించబోతున్నారనే పుకార్లు షికారు చేస్తున్నాయి. ఇందులో ఎంత వరకు వాస్తవం ఉంది అనేది తెలియదుగానీ.. ఇదే నిజమైతే మాత్రం మరోసారి వివాదం రగిలే అవకాశం ఉందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.