కరోనా కల్లోలం రోజురోజుకూ ప్రళయంలా విరుచుకు పడుతూ ఉంది. ఇప్పటికే సినిమాల షూటింగ్ లను మెలమెల్లగా ఆపేసి.. అందరూ ఖాళీగా కూర్చున్నారు. ఈ సెకెండ్ వేవ్ ఇంకా ఎన్నాళ్ళు ఉంటుందో.. ఇంకా ఎంతమందిని బలి తీసుకుంటుందో ఇప్పుడే ఓ క్లారిటీకి రాలేని పరిస్థితులు కనిపిస్తున్నాయి బయట. కాబట్టి.. సినిమాల పరిస్థితి మరీ దారుణమైపోయింది. పాపం ఈ కరోనా వచ్చినప్పటి నుండి షెడ్యూల్స్ వేయడం, షూటింగ్ స్టార్ట్ చేయడం, మధ్యలోనే షూట్ ను ఆపేయడం.
గత కొన్ని నెలలుగా ఇదే వ్యవహారం జరుగుతుంది ఇండస్ట్రీలో. మరోపక్క కరోనా నివారణ విషయంలో ఇంకా కిందా మీదా అవుతున్నాయి ప్రభుత్వాలు. థియేటర్స్ పై ఆంక్షలు విధించినా అవి అమలు అవుతున్నాయో లేదో తెలియదు. కొన్ని థియేటర్స్ ను మూసేసుకుని కూర్చున్నారు యజమానులు. కొన్ని థియేటర్స్ ను తెరుస్తున్నా జనంలో అటు వైపు పోయే వాడే కనబడుటలేదు. ఇలాంటి టైంలో సినిమాలను రిలీజ్ కి సిద్ధం చేసుకుంటున్నారు చిన్నాచితకా చిత్రాల నిర్మాతలు.
మరి ఏ ధైర్యంతో రిలీజ్ కి రెడీ చేస్తున్నారో అర్ధం కావడం లేదు. అసలు కలెక్షన్స్ రావు అని తెలిసి కూడా థియేటర్స్ కి రెంట్ కట్టి మరీ సినిమాలను ఎందుకు రిలీజ్ చేయాలి ? చిన్న సినిమాల నిర్మాతలకు అర్ధమవుతుందా ? అలాగే ఫారెన్ బ్యాక్ డ్రాప్ లో సినిమా షూటింగ్స్ ను ప్లాన్ చేసుకున్న పెద్ద సినిమాల యూనిట్ లు కూడా ఇక తమ ఆలోచనను ఈ ఏడాది అంతా విరమించుకోవడం ఉత్తమమైన పని.
కానీ, పూరి లైగర్, వరుణ్ తేజ్ బాక్సర్, అదేవిధంగా నితిన్ సినిమా, మెగాస్టార్ – మెహర్ రమేష్ కలయికలో వస్తోన్న సినిమా ఫారెన్ లొకేషన్స్ లోనే షూటింగ్ ను జరువుకోవాలని మేకర్స్ మెంటల్ గా ఫిక్స్ అయిపోయారట. అందుకే జూన్ నుండి ఫారెన్ లో షూటింగ్ కోసం ఇప్పటి నుండే ఆయా చిత్రాల మేకర్స్ ప్రయత్నాలను ముమ్మరం చేశారు. కానీ ఇది ఎంతవరకు సాధ్యం అవుతుందో చూడాలి,
ఏది ఏమైనా అక్టోబర్ రెండో వారానికి గానీ, నిర్మాణంలో వున్న సినిమాలు సెట్ మీదకు రావు. అది కూడా చివరి దశలో ఉన్న సినిమాలు మాత్రమే అక్టోబర్ లో షూట్ చేసుకునే అవకాశం కనిపిస్తోంది. ఇక కొత్తగా మొదలయ్యే సినిమాలు మాత్రం నవంబర్ నుండి షూట్ కి రెడీ అయ్యే ఛాన్స్ ఉంది. ఎలాగూ ఈ సెకెండ్ వేవ్ ప్రభావం మరో మూడు నెలలు ఉండే అవకాశం ఉంది. ఇది కూడా గ్యారంటీ లేదు. మొత్తమ్మీద ఈ కరోనా వల్ల అసలు ఎప్పుడు ఏమి జరుగుతుందో తెలియక గందరగోళంలో సినీ లోకం అయోమయంలో సినిమా జనం ఉండిపోవాల్సి వస్తోంది.