The Kerala Story: సినిమాలకు వివాదాలు కొత్తేమీ కాదు. అయితే కొందరు తమ మూవీకి హైప్ క్రియేట్ చేసుకోవడానికి చేసే జిమ్మిక్కు అని కొట్టిపారేస్తారు. మరికొందరు మాత్రం డబ్బులు వసూలు చేయడానికి అని అంటుంటారు. కానీ లేటేస్టుగా ‘ది కేరళ స్టోరీ’పై మాత్రం దేశ వ్యాప్తంగా వివాదం రాజుకుంటుంది. ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ తరువాత రెండు మతాలకు చెందిన వారు తీవ్ర నిరసన వ్యక్తం చేస్తున్నారు. గతేడాది టీజర్ విడుదలయిన నేపథ్యంలో సినిమాను బ్యాన్ చేయాలని కొంత మంది రోడ్డుకెక్కారు. అయినా సినిమా పూర్తి చేసుకొని మే నెల 5న రిలీజ్ కు రెడీ అవుతోంది. ఈ నేపథ్యంలో మరోసారి సినిమా పై ఆందోళన పెరిగిపోతోంది. ఇంతకీ ఈ సినిమాపై వివాదమెందుకు?
కేరళలో జరిగిన వాస్తవ సంఘటనల ఆధారంగా సినిమాను తెరకెక్కించామని చిత్రబృందం తెలుపుతోంది. ఈ సినిమా సన్ షైన్ పిక్చర్స్ బ్యానర్ పై విపుల్ అమృత్ పాల్ షా నిర్మిస్తున్నారు. సుదీప్తో సేన్ డైరెక్షన్ చేయగా.. వీరేష్ శ్రీ వాల్స బిషాఖ్ జ్యోతి సంగీతం అందిస్తున్నారు. ఇందులో నటి ఆదాశర్మ, యోగితా బిహాని, సోనియా బిలానీ, సిద్ధి ఇద్నానీ, విజయ్ కృష్ణ, ప్రణయ్ పచౌర్ తదితరులు నటించారు.
కేరళలోని హిందూ, క్రిస్టియన్ మతాలకు చెందిన కొందరు యువతులును ఐసీస్ ఉగ్రవాదులు లవ్ జిహాద్ లో భాగంగా వారిని వలలో వేసుకున్నారు. ఆ తరువాత వారిని సిరియా, ఇరాక్ దేశాలకు పంపించి బలవంతంగా టెర్రరిస్టులుగా మార్చారు. ఆ తరువాత కొందరు అరెస్టయి జైలు జీవితాన్ని గడుపుతున్నారు. ఆ ఘటన ఆధారంగా సినిమా తీశారని తెలుస్తోంది. అయితే ఈ సినిమాలో ఓ మతాన్ని కించపరిచేలా చూపించారని, దీనిని బ్యాన్ చేయాలని కొందరు డిమాండ్ చేస్తున్నారు. ఈ మూవీ బయటకు వస్తే మతాల మధ్య చిచ్చు రేగుతుందని వారు ఆరోపిస్తున్నారు.
అయితే సినిమా బృందం మాత్రం మేం కేరళలోని యువతులకు అన్యాయం జరిగిందనే విషయాన్ని మాత్రమే చూపించామని అంటున్నారు. బాధిత కుటుంబాలతో మాట్లాడిని తరువాతే సినిమాను తెరకెక్కిస్తున్నామని అన్నారు. అంతర్జాతీయ ఉగ్రవాద సంస్థ ఐసీస్ కారణంగా 32 వేల మంది అమాయకపు యువతులు కేరళ నుంచి మిస్ అయ్యారనే సమాచారం తమ వద్ద ఉందని అంటున్నారు.
ఇందులో ప్రధానంగా మతం మార్చుకున్న ఫాతిమాగా ఆదాశర్మ నటిస్తున్నారు. ఎన్నో వివాదాలు వస్తున్న ఈ సినిమాను మే 5న రిలీజ్ చేస్తామని చిత్ర బృందం పట్టుబడుతోంది. మరి ఆ రోజు నాటికి ఏం జరుగుతుందో చూడాలి. ఇదిలా ఉండగా గతంలో కర్ణాటకలో జరిగిన హిజాబ్ సంఘటనను కూడా ప్రస్తావించినట్లు ట్రైలర్ చూస్తే తెలుస్తోంది.