
Taraka Ratna : తారకరత్న బ్యాక్ గ్రౌండ్ చాలా పెద్దది. తెలుగు చిత్ర పరిశ్రమను శాసించిన కుటుంబం కాబట్టి అతనికి ఎక్కడికి పోయినా రెడ్ కార్పెట్ దక్కేది. కానీ చెప్పుకున్నత గొప్పగా తారకరత్న జీవితం లేదు. అతడు ఎన్నో ఇబ్బందులు పడ్డాడు. వ్యక్తిగత జీవితంలో ఒడిదుడుకులు ఎదుర్కొన్నాడు. వాస్తవానికి అలేఖ్య రెడ్డిని వివాహం చేసుకున్న కారణంగా నందమూరి ఫ్యామిలీకి తారకరత్న దూరంగా ఉండాల్సి వచ్చింది. ఆంధ్రప్రదేశ్లోని అధికార వైఎస్ఆర్సిపి ముఖ్య నేతల్లో ఒకరైన విజయసాయిరెడ్డికి తారకరత్న భార్య అలేఖ్య రెడ్డి బంధువు అవుతారు.
నందమూరి తారకరత్న, అలేఖ్య వివాహం 2012 ఆగస్టు రెండున హైదరాబాద్ నగర శివారులోని సంఘీ టెంపుల్ లో చాలా నిరాడంబరంగా జరిగింది. సింపుల్, సీక్రెట్ మ్యారేజ్ చేసుకున్నారు.. పెద్దలు ఒప్పుకోకపోవడంతో అలా చేసుకున్నామని పలు సందర్భాల్లో తారకరత్న చెప్పుకొచ్చాడు. దీంతో తమ మాటను కాదని ప్రేమ వివాహం చేసుకోవడంతో కొన్నాళ్లపాటు తారకరత్నను నందమూరి కుటుంబం దూరం పెట్టింది. ఈ సమయంలో తారకరత్న చాలా వేదన అనుభవించాడని ఆయన సన్నిహితులు చెబుతుంటారు.
విజయసాయిరెడ్డి భార్య, అలేఖ్య రెడ్డి తల్లి స్వయనా అక్కా చెల్లెళ్ళు. అలేఖ్య రెడ్డి తండ్రి కొన్నాళ్లపాటు అనంతపురంలో రవాణా శాఖలో ఉద్యోగం చేశాడు. తన మరదలు కుమార్తెను తారకరత్న వివాహం చేసుకున్నాడని, ఆయన తమ ఇంటి అల్లుడని, చంద్రబాబు తనకు సోదరుడి వరుస అని విజయసాయిరెడ్డి ఆమధ్య ఇంటర్వ్యూలో చెప్పారు. తారకరత్న కుటుంబ సభ్యులు, తమ కుటుంబ సభ్యులు పెళ్ళికి సమ్మతం తెలుపలేదని, అప్పుడు విజయసాయిరెడ్డి పెదనాన్న తనకు అండగా నిలిచారని అలేఖ్య రెడ్డి పలుమార్లు గుర్తు చేసుకున్నారు.
ఇలా పరిచయం
నందమూరి తారకరత్న, అలేఖ్యకు పరిచయం ఎలా ఏర్పడింది? ఎవరు మొదటగా తమ ప్రేమను వ్యక్తపరిచారు? ఇప్పటికీ ఇది ఒక సినిమాను తలపిస్తుంది. అలేఖ్య రెడ్డి సోదరి చెన్నైలోని పాఠశాలలో చదువుకున్నారు. ఆమెకు తారకరత్న సీనియర్. అయితే హైదరాబాద్ షిఫ్ట్ అయ్యాక ఒక ఫ్రెండ్ ద్వారా ఇద్దరూ కలుసుకున్నారు. నందీశ్వరుడు సినిమాకి ఆమె కాస్ట్యూమ్స్ డిజైన్ చేశారు. ఆ పరిచయం ప్రేమగా మారింది. తొలుత తారకరత్న లవ్ ప్రపోజ్ చేశారు. అలేఖ్యకు రెండో పెళ్లి కావడంతో.. తారకరత్న కుటుంబ సభ్యులు ఆమెతో పెళ్లికి నిరాకరించారు. మాజీ హోంమంత్రి ఎలిమినేటి మాధవ రెడ్డికి అలేఖ్య మాజీ కోడలు.. మాధవ రెడ్డి కొడుకు సందీప్ తో అలేఖ్యకు వివాహం జరిగింది. అయితే భేదాభిప్రాయాలు తలెత్తడంతో ఇద్దరు విడాకులు తీసుకున్నారు.. అయితే అలేఖ్యతో వివాహానికి కుటుంబ సభ్యులు ఒప్పుకోకపోవడంతో సీక్రెట్ గా పెళ్లి చేసుకోవాల్సి వచ్చింది. ఇదే సమయంలో తారకరత్న కుటుంబ సభ్యులు దూరం పెట్టారు. చివరకు తన సొంత చెల్లెలు రూప వివాహానికి కూడా తారకరత్నకు ఆహ్వానమందలేదు. ఇక పెళ్లయిన మరుసటి ఏడాది తారకరత్న, అలేఖ్య దంపతులకు కుమార్తె నిష్క జన్మించారు. ఆమె అంటే తారకరత్నకు ప్రాణం. ఆమెతో ఎక్కువ టైం గడిపేవారు. కుమార్తె ఫోటోలను తరచూ సోషల్ మీడియాలో పోస్ట్ చేసేవారు.
ఇక తారకరత్న నారాయణ ఆసుపత్రిలో ఉన్నప్పుడు విజయసాయిరెడ్డి తన సహాయ సహకారాలు అందించినట్టు తెలుస్తోంది. అంతేకాదు ఆసుపత్రికి విజయసాయిరెడ్డి వెళ్లి తారకరత్న ఆరోగ్య పరిస్థితి గురించి వైద్యులతో మాట్లాడి తెలుసుకున్నారు. బాలకృష్ణకు కృతజ్ఞతలు కూడా తెలిపారు. ఇప్పుడు తారకరత్న కన్ను మూయడం తో చిన్న వయసులోనే అతనిని కోల్పోవడం బాధాకరంగా ఉందని విజయసాయిరెడ్డి సోషల్ మీడియా వేదికగా భావోద్వేగానికి గురయ్యారు.