Sai Dharam Tej: సమాజం ఎటుపోతుందా అనిపించే… నీచ పరిణామం చోటు చేసుకుంది. నలుగురు యువకులు ఆన్లైన్ చాట్ లో పవిత్రమైన తండ్రి-కూతుళ్ళ రిలేషన్ పై రాయలేని భాషలో జోక్స్ వేసి ఎంజాయ్ చేశారు. ఆ నలుగురు యువకుల ఆన్లైన్ చాట్ సోషల్ మీడియాలో వైరల్ కావడంతో తీవ్ర వ్యతిరేకత వ్యక్తం అవుతుంది. హీరో సాయి ధరమ్ తేజ్, మంచు మనోజ్ ఈ ఉదంతం పై స్పందించారు. వారు ఒకింత ఆగ్రహానికి గురయ్యారు. సోషల్ మీడియాలో చైల్డ్ అబ్యూస్ కి పాల్పడే వారి మీద చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.
తండ్రి-కూతురు బంధం మీద అసహ్యమైన జోక్స్ వేసుకున్న ఆ యువకుల ఆన్లైన్ చాట్ వీడియోలు ట్యాగ్ చేసిన సాయి ధరమ్ తేజ్… ఏపీ, తెలంగాణ పోలీస్ డిపార్ట్మెంట్స్, ముఖ్యమంత్రులు, డిప్యూటీ ముఖ్యమంత్రులకు విజ్ఞప్తి చేశారు. ఇది అత్యంత భయానకమైన, నీచమైన చర్య. హాస్యం ముసుగులో చైల్డ్ అబ్యూస్ కి పాల్పడుతున్న వీరిని ఉపేక్షించవద్దు. వీరిపై వెంటనే తగు చర్యలు తీసుకోవాలని సాయి ధరమ్ విజ్ఞప్తి చేశాడు.
సాయి ధరమ్ సోషల్ మీడియా పోస్ట్ కి తెలంగాణ పోలీసులు స్పందించారు. వెంటనే చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. అయితే ఈ చర్యలు పాల్పడిన వ్యక్తుల్లో ప్రణీత్ హనుమంత్ ఒకరు. ఇతడి బ్యాక్ గ్రౌండ్ కి అతడు చేసిన కామెంట్స్ కి అసలు సంబంధం లేదు. ప్రణీత్ విద్యావంతుల కుటుంబం నుండి వచ్చాడు. ప్రణీత్ తండ్రి సీనియర్ ఐఏఎస్ అధికారి. ప్రణీత్ మాత్రం యూట్యూబ్ కంటెంట్ క్రియేటర్. ఇటీవల విడుదలైన సుధీర్ బాబు చిత్రం హరోం హర లో ఒక చిన్న పాత్ర చేశాడు ప్రణీత్.
ఒక ఐఏఎస్ అధికారి కొడుకు కనీస సంస్కారం లేకుండా తండ్రి-కూతురు బంధం మీద సమాజం తలదించుకునే కామెంట్స్ చేశాడు. సదరు జోక్స్ కి పగలబడి నవ్వాడు. హీరో మనోజ్ కుమార్ సైతం ఈ విషయాన్ని సీరియస్ గా తీసుకున్నాడు. పిల్లలు, మహిళల భద్రతకు ప్రభుత్వాలు ప్రాధాన్యత ఇవ్వాలని అన్నారు. జోక్స్ పేరుతో సోషల్ మీడియాలో జరుగుతున్న చైల్డ్ అబ్యూస్ పై చర్యలు తీసుకోవాలని అన్నారు. నిన్ను వదలను అంటూ ఓ వ్యక్తికి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చాడు.