Nagarjuna Hello Brother Movie: దర్శకుడు ఈవీవీ సత్యనారాయణ అప్పుడప్పుడే వరుస విజయాలు అందుకుంటున్న రోజులు అవి. ఆయనకు ఆ సమయంలో ఓ కోరిక కలిగింది. ఓ స్టార్ హీరోతో ఓ ద్విపాత్రాభినయం సినిమా చేయాలని. అప్పటికే ఆయన అక్కినేని నాగార్జునతో ‘వారసుడు’ అనే చిత్రాన్ని తీశారు. పైగా నాగ్ తో మంచి పరిచయం ఉంది, అలాగే సాన్నిహిత్యం కూడా ఉంది. అందుకే నాగార్జున ద్విపాత్రాభినయంగా ‘హలో బ్రదర్’ సినిమాని ప్లాన్ చేశారు ఈవీవీ.
నాగార్జునకి కథ బాగా వచ్చింది. తొలిసారిగా ద్విపాత్రాభినయం చేయడానికి నాగార్జున కూడా ఆసక్తి చూపించాడు. కానీ.. ఎలా ? నాగార్జునలు ఇద్దరూ ఒకే ఫ్రేమ్ లో కనిపించాలి. అంటే… నాగార్జునకి అచ్చం నాగార్జునలా ఉండే వ్యక్తి డూప్ గా చేయాలి. పైగా కొన్ని సన్నివేశాల్లో రెండు పాత్రలు ఒకే ఫ్రేమ్ లో ఒకేలా నటించాలి. కాబట్టి, నాగ్ కి పర్ఫెక్ట్ గా సూట్ అయ్యే బాడీ కావాలి.
హీరో శ్రీకాంత్ అయితే బాగుంటాడు అనిపిచింది ఈవీవీకి. కానీ, శ్రీకాంత్ హీరోగా చేస్తున్నాడు. మరి, నాగార్జునకు డూప్ గా చేస్తాడా ? ఈవీవీ మొహమాటపడుతూనే వెళ్లి శ్రీకాంత్ కి విషయం చెప్పారు. ఈవీవీతో శ్రీకాంత్ కి మంచి సాన్నిహిత్యం ఉంది. అందుకే, శ్రీకాంత్ చేస్తాను అని నాగ్ కి డూప్ గా నటించాడు. అలా ‘హలో బ్రదర్’ సినిమా మొదలైంది.
ఇక నాగార్జున సరసన ఒక హీరోయిన్ గా సౌందర్యను ఫైనల్ చేశారు. వీరిద్దరి కలయికలో వచ్చిన తొలి సినిమా ఇదే. అన్నపూర్ణ స్టూడియోలో ‘ప్రియ రాగాలే’ పాట చిత్రీకరణతో ఈ ‘హలో బ్రదర్’ చిత్రం షూటింగ్ స్టార్ట్ అయింది. ఈ సాంగ్ షూట్ సమయంలోనే మొదటిసారి సౌందర్య – నాగార్జున కలుసుకున్నారు. ఆమె నటన చూసి నువ్వు గొప్ప నటిగా పేరు తెచ్చుకుంటావు అని అప్పుడే నాగ్ చెప్పారట.
నాగార్జునకు మంచి జడ్జ్ మెంట్ ఉంది. టాలెంట్ ను బాగా గుర్తించగలడు. ఇక ‘హలో బ్రదర్’ విషయానికి వస్తే.. రెండు పాత్రల్లో ఒక పాత్ర చిన్న సైజు దొంగ. మరో పాత్ర పాప్ సింగర్ పాత్ర. రెండు పాత్రల్లో నాగార్జున అద్భుతంగా నటించారు. ఈ చిత్రాన్ని దర్శకుడు ఈవీవీ పూర్తి వినోద భరితంగా తీర్చిదిద్దారు. పైగా నాగార్జున చేత మొదటిసారి పూర్తి స్థాయి కామెడీ పాత్రను పోషించేలా చేశారు.
అందరి అంచనాలను తలకిందులు చేస్తూ ‘హలో బ్రదర్’ అద్భుత విజయాన్ని సాధించింది. 1994వ సంవత్సరంలో రిలీజ్ అయిన చిత్రాల్లో ‘హలో బ్రదర్’ టాప్ గ్రాసర్ గా నిలిచింది. లవ్ .. యాక్షన్ .. ఎమోషన్ .. సెంటిమెంట్ .. రొమాన్స్ .. కామెడీ .. ఇలా అన్ని అంశాలను ఈవీవీ సమపాళ్లలో రంగరించి అందించిన కథ ఇది. అందుకే ఇప్పటికీ ప్రత్యేకంగా నిలిచిపోయింది.
Also Read:Pranhita River: పుష్కరాలు: ప్రాణహితకు మిలియన్ల సంవత్సరాల చరిత్ర.. ఇవిగో ఆనవాళ్లు..
Recommended Videos: