Sandhya Theater Incident: అల్లు అర్జున్ వర్సెస్ తెలంగాణ గవర్నమెంట్ అన్నట్లు పరిస్థితి తయారైంది. అల్లు అర్జున్ ఒక మహిళ మృతికి కారణం అయ్యాడంటూ కాంగ్రెస్ నేతలు విమర్శలు గుప్పిస్తున్నారు. అదే సమయంలో అల్లు అర్జున్ ఫ్యాన్స్, సినిమా ప్రముఖులు…. ఆయనకు మద్దతుగా నిలుస్తున్నారు. కావాలనే అల్లు అర్జున్ ని తెలంగాణ గవర్నమెంట్ టార్గెట్ చేస్తుంది. అనుకోకుండా జరిగిన ప్రమాదానికి అల్లు అర్జున్ ని బాధ్యుడిని చేస్తూ వ్యక్తిత్వ హననం చేస్తున్నారని అసహనం వ్యక్తం చేశారు.
డిసెంబర్ 4వ తేదీన సంధ్య థియేటర్ వద్ద తొక్కిసలాట చోటు చేసుకుంది. కుటుంబంతో పాటు పుష్ప 2 సినిమా చూసేందుకు వెళ్లిన రేవతి అనే వివాహిత ఈ ఘటనలో కన్నుమూసింది. ఆమె తొమ్మిదేళ్ల కుమారుడు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు. థియేటర్ యాజమాన్యంతో పాటు మేనేజర్ ని అరెస్ట్ చేశారు. డిసెంబర్ 13న అల్లు అర్జున్ ని సైతం అదుపులోకి తీసుకున్నారు.
అరెస్ట్ అయిన అల్లు అర్జున్ ఒక రాత్రి జైలు జీవితం గడిపాడు. మరుసటి రోజు ఉదయం బెయిల్ పై రిలీజ్ అయ్యాడు. అల్లు అర్జున్ అరెస్ట్ వెనుక సీఎం రేవంత్ రెడ్డి ప్రమేయం ఉందంటూ విమర్శలు వినిపించాయి. ప్రమాదానికి అల్లు అర్జున్ ని బాధ్యుడిని చేయడం సబబు కాదంటూ కొందరు చిత్ర ప్రముఖులు సైతం తెలంగాణ ప్రభుత్వాన్ని విమర్శించారు. అసెంబ్లీ వేదిక అల్లు అర్జున్ మీద సీఎం రేవంత్ రెడ్డి ఫైర్ అయ్యాడు. ఇండస్ట్రీ ప్రముఖులను కూడా ఆయన పరుష పదజాలంతో ఏకిపారేశారు.
ఉస్మానియా యూనివర్సిటీ జాయింట్ యాక్షన్ కమిటీ సైతం రంగంలోకి దిగింది. రేవతి మృతికి నిరసనగా అల్లు అర్జున్ ఇంటిపై దాడి చేశారు. పోలీసులు అల్లు అర్జున్ సంధ్య థియేటర్ కి వెళ్లడం వలనే మహిళ మృతి చెందింది అంటూ సీసీ టీవీ ఫుటేజ్ విడుదల చేశారు. సంధ్య థియేటర్ ఘటనలో తప్పు ఎవరిది? అనే చర్చ నడుస్తుంది. ఒక వర్గం అల్లు అర్జున్ ని మరొక వర్గం సీఎం రేవంత్ రెడ్డిని సమర్థిస్తున్నారు. ఈ క్రమంలో ఒక సర్వే నిర్వహించారు. సోషల్ మీడియాలో ఈ సర్వే రిపోర్ట్ వైరల్ అవుతుంది. ఆ సర్వే ప్రకారం మెజారిటీ పీపుల్ అల్లు అర్జున్ తప్పు చేశాడని తేల్చారు. 63 శాతం మంది అల్లు అర్జున్ కి వ్యతిరేకంగా ఓటు వేశారు. 37 శాతం మంది.. రేవంత్ రెడ్డి దే తప్పని తమ అభిప్రాయం తెలియజేశారు.