Chiranjeevi: నవంబర్ 30న తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు ముగిశాయి. ఓటు వేసేందుకు సెలెబ్రిటీలు క్యూ కట్టారు. ఉదయం నుండే హైదరాబాద్ లో పోలింగ్ కేంద్రాల వద్ద తారల సందడి నెలకొంది. ఎన్టీఆర్, మహేష్ బాబు, నాని, వెంకటేష్, రవితేజ, అల్లు అర్జున్, రామ్ చరణ్ తో పాటు పలువురు సినీ ప్రముఖులు బాధ్యతగా ఓటు వేశారు. సామాన్యుల వలె క్యూ లైన్లో నిల్చొని ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఒకప్పుడు సెలెబ్స్ నేరుగా వెళ్లి ఓటు వేశారు. సోషల్ మీడియాలో దీనిపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
దీంతో టాప్ స్టార్స్ కూడా విధిగా లైన్లో నిలబడి ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు. కాగా మెగాస్టార్ చిరంజీవి భార్య సురేఖతో పాటు పోలింగ్ కేంద్రానికి వచ్చారు. జూబ్లీహిల్స్ క్లబ్ బూత్ నంబర్ 149లో ఓటు వేశారు. క్యూ లైన్లో నిల్చున్న చిరంజీవిని ఓ ఛానల్ ప్రతినిధి మాట్లాడించే ప్రయత్నం చేశాడు. చిరంజీవి మొదట సైగలతో మాట్లాడకూడదు అని చెప్పారు. అప్పటికీ ఆ రిపోర్ట్ అడగడంతో మౌనవ్రతం అన్నారు.
ఓటింగ్ సరళి గురించి రిపోర్టర్ అడిగిన ప్రశ్నకు చిరంజీవి సమాధానం చెప్పలేదు. మౌనవ్రతం అని చెప్పడంతో చిరంజీవి కామెడీ టైమింగ్ కేక అంటూ సోషల్ మీడియాలో కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఈ వీడియో వైరల్ అవుతుంది. కాగా హైదరాబాద్ లో అతి తక్కువ ఓటింగ్ నమోదైనట్లు తెలుస్తుంది. ఓటింగ్ లో పాల్గొనేందుకు యువత పెద్దగా ఆసక్తి చూపలేదు. కొందరు వృద్ధులు, అనారోగ్యంతో బాధపడుతున్న వారు కూడా పోలింగ్ కేంద్రాలకు వచ్చి ఓటు హక్కు వినియోగించుకున్నారు.
మరోవైపు చిరంజీవి తన 156 వ చిత్ర షూటింగ్ లో బిజీగా ఉన్నారు. బింబిసార ఫేమ్ వశిష్ట్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి విశ్వంభర అనే టైటిల్ నిర్ణయించినట్లు ప్రచారం అవుతుంది. ఇక ఇది మూడు లోకాలలో సాగే సోషియో ఫాంటసీ మూవీ అట. భారీ బడ్జెట్ తో తెరకెక్కిస్తున్నారు. యూవీ క్రియేషన్స్ బ్యానర్ లో రూపొందుతుంది. చిరంజీవి ముగ్గురు హీరోయిన్స్ తో రొమాన్స్ చేస్తాడని సమాచారం.