Homeజాతీయ వార్తలుBarrelakka: బర్రెలక్కకు ఎన్ని ఓట్లు వస్తాయి? శిరీష నెక్ట్స్ స్టెప్ ఏంటి?

Barrelakka: బర్రెలక్కకు ఎన్ని ఓట్లు వస్తాయి? శిరీష నెక్ట్స్ స్టెప్ ఏంటి?

Barrelakka: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కొల్లాపూర్‌ శాసనసభ స్థానం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి రాష్ట్ర రాజకీయాల్లో సంచలనంగా మారింది శిరీష అలియాస్‌ బర్రెలక్క. పోలింగ్‌ ముగియడంతో బర్రెలక్కకు ఎన్ని ఓట్లు పడ్డాయి? విజయావకాశాలు ఎలా ఉన్నాయనేది చర్చనీయాంశంగా మారింది. బర్రెలక్క విజయం సాధిస్తుందా? గురువారం ముగిసిన పోలింగ్‌లో ఆమెకు ఎన్ని ఓట్లు పడి ఉంటాయి? అనేదానిపై చర్చ జరుగుతోంది. ఓడిపోతే బర్రెలక్క పరిస్థితి ఏమిటి.. ఆమె పయనం ఎటువైపు సాగుతుంది అన్నది యువతలో ఆసక్తికరంగా మారింది.

15 వేల ఓట్లు..
గురువారం సాయంత్రం వెలువడిన ’ఆరా మస్తాన్‌ సర్వే’ శిరీషకు 15 వేల వరకు ఓట్లు రావొచ్చని లెక్కగట్టింది. శిరీష గెలవకపోయినా గట్టి పోటీ ఇస్తుందని, ఓటర్లను ఆమె పెద్ద సంఖ్యలో ఆకర్షించుకోగలిగిందని పేర్కొంది. ఇక ఈ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్‌ అభ్యర్థి జూపల్లి కృష్ణారావు గెలుస్తారని విశ్లేషించింది.

ప్రత్యేక ఆకర్షణగా బర్రెలక్క
తెలంగాణ పాలిటిక్స్‌లో నాగర్‌కర్నూల్‌ జిల్లా పెద్ద కొత్తపల్లి మండలం మరికల్‌ గ్రామానికి చెందిన శిరీష అలియాస్‌ బర్రెలక్క ప్రత్యేక ఆకర్షణగా మారింది. నిరుపేద కుటుంబంలో జన్మించిన శిరీష తండ్రి మద్యానికి బానిసయ్యాడు. చిన్నప్పుడే కుటుంబాన్ని వదిలేసి వెళ్లిపోయాడు. తల్లితో కలిసి ఎన్నో కష్టాలు పడుతూ చదువుకుంది. ఓపెన్‌ యూనివర్సిటీలో డిగ్రీ చేసి.. గ్రూప్‌–1, గ్రూప్‌–2 ఇతర పోటీ పరీక్షలకు ప్రిపేర్‌ అయ్యింది. ఎన్నోసార్లు ప్రయత్నించిన శిరీష.. ఇక తనకు ఉద్యోగం రాదంటూ.. అందుకే నాలుగు బర్రెలు కొనుక్కుని కాస్తున్నాంటూ రాష్ట్రంలోని నిరుద్యోగుల సమస్యల గురించి చెబుతూ ఓ రీల్‌ చేసింది. 30 సెకన్లు ఉన్న ఆ రీల్‌ నెట్టింట విపరీతంగా ట్రెండ్‌ కావడంతో శిరీష కాస్త బర్రెలక్కగా ఫేమస్‌అయింది. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రచారం చేసిందని పోలీసులు కేసు పెట్టారు.

కసితో రాజకీయాల్లోకి..
తాను ఏ తప్పు చేయకపోయినా పోలీసులు తనపై కేసు పెట్టడంపై శిరీష అసహనానికి లోనైంది. కేసు ఎత్తివేయాలని ప్రభుత్వాన్ని కోరింది. పాలకులను ఆశ్రయించింది. కానీ స్పందన రాలేదు. దీంతో న్యాయపోరాటం చేస్తోంది. ఈ క్రమంలో వచ్చిన అసెంబ్లీ ఎన్నికల్లో స్వతంత్రంగా పోటీ చేయాలని నిర్ణయించుకుంది. అనుకున్నదే తడవుగా కొల్లాపూర్‌ నియోజకవర్గం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్‌ వేసింది.

మద్దతుగా నిలిచిన యువత..
అయితే తన వద్ద ఎలాంటి డబ్బులు లేవని, సోషల్‌ మీడియాలో బర్రెలక్క ప్రాచరం మొదలు పెట్టింది. డబ్బులు లేవనే విషయాన్ని కూడా షేర్‌ చేసింది. స్పందించిన రాష్ట్రలలోని పలువురు ప్రముఖులు, నిరుద్యోగులు ఆమెకు అండగా నిలిచారు. ఆర్థికసాయం చేశారు. ప్రచారంలో భాగస్వాములయ్యారు. దీంతో ప్రధాన పార్టీలకు ఏమాత్రం తగ్గకుండా ప్రచారం చేసింది. సమస్యలను ప్రస్తావిస్తూ ప్రజలను ఆకట్టుకునే ప్రయత్నం చేశారు. దీంతో అన్ని వర్గాల మద్దతు ఆమెకు లభించింది. ఈ తరుణంలో ఫలితం ఎలా ఉంటుంది.. బర్రెలక్క భవితవ్యం ఏమిటి అన్న చర్చ జరుగుతోంది.

Ashish D
Ashish Dhttps://oktelugu.com/
Ashish. D is a senior content writer with good Knowledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.
Exit mobile version