గత వారం రోజులుగా ‘మా’ అధ్యక్ష ఎన్నికల గురించి మూవీ న్యూస్ లో తెగ అప్ డేట్స్ వస్తున్నాయి. మొదట బరిలో ఉన్నాను అంటూ ప్రకాష్ రాజ్ బయటకు వచ్చాడు. నువ్వు ఏమిటి నేను కూడా పోటీ చేస్తా అంటూ మంచు విష్ణు రంగంలోకి దిగాడు. దాంతో ప్రకాష్ రాజ్ కి మెగా ఫ్యామిలీ అండగా నిలబడింది. మరోపక్క మంచు ఫ్యామిలీ సూపర్ స్టార్ ఫ్యామిలీ సపోర్ట్ కోసం పావులు కదపడం మొదలెట్టింది.
ఈ లోపు జీవిత నేనేం తక్కువా.. నాకు అందరి కంటే ఎక్కువమంది సపోర్టర్స్ ఉన్నారు. అందుకే నేను కూడా పోటీలో దిగుతున్నా అంటూ నటుడు నరేష్ సహకారంతో బరిలోకి దిగింది. సరే జీవిత అంటే కాస్త గుర్తింపు ఉంది, పైగా గతంలో కొన్ని మంచి పనులు చేసింది. కానీ కామెడీగా నటి హేమ కూడా పోటీలో ఉన్నాను అంటుంది.
మొత్తానికి వీరందరూ పోటీలో ఉన్నా.. ఇందులో ప్రకాష్ రాజ్ కి చిరంజీవి సంపూర్ణ మద్దతు ఉందనేది ఓపెన్ సీక్రెట్. అలాగే ఎన్టీఆర్, ప్రభాస్ లాంటి పలువురు స్టార్ హీరోలు కూడా ఇప్పటికే ప్రకాష్ రాజ్ తో మేము సపోర్ట్ చేస్తాం అంటూ మాటిచ్చారు. ఈ లిస్ట్ లో మహేష్ కూడా ఉన్నాడు అనేది ఇండస్ట్రీ టాక్. మహేష్ మద్దతు కోసం మంచు ఫ్యామిలీ వారం రోజులుగా బాగా ప్రయత్నాలు చేస్తోంది.
కానీ మహేష్ నుండి మాత్రం క్లారిటీ రాలేదు. ఓ దశలో నేను ఈ ఎన్నికల్లో ఇన్ వాల్వ్ కాలేను అని మహేష్ చెప్పినట్టు తెలుస్తోంది. మరి ఈ లెక్కన మంచు విష్ణుకి ఎవరి మద్దతు ఉంటుంది ? ఇంతకీ బాలయ్య బాబు ఎవరి వైపు ఉంటారు ? చిరంజీవి ప్రకాష్ రాజ్ కి సపోర్ట్ చేస్తున్నాడు కాబట్టి, బాలయ్య ఈ వర్గానికి వ్యతిరేక వర్గంలోనే ఉంటారని బాలయ్య గురించి తెలిసిన వాళ్ళు చెబుతున్నారు.
అంటే.. ‘మా’ ఎన్నికల్లో బాలయ్య, మంచు విష్ణుకే మద్దతు ఇస్తారని తెలుస్తోంది. మరి బాలయ్య ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి.