Krishnam Raju Funeral Rites: టాలీవడ్ రెబల్ స్టార్ కృష్ణంరాజు ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్లారు. ఆయన మరణం టాలీవుడ్ లో విషాదం నింపింది. అభిమానులను శోకసంద్రంలో ముంచింది. సినీ, రాజకీయాల్లో వెలుగు వెలిగిన కృష్ణంరాజు మరణంపై చాలా మంది సంతాపం తెలుపుతున్నారు. ఆయన మృతికి ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నారు.

హైదరాబాద్ లో ఈ రోజు తెల్లవారుజామున 3.25 నిమిషాలకు కన్నుమూశారు. ఆయనకు భార్య, ముగ్గురు కుమార్తెలు. ఆయన వయస్సు 83 సంవత్సరాలు. బీజేపీ ప్రభుత్వంలో కేంద్ర మంత్రిగా కృష్ణంరాజు పనిచేశారు. ఏపీ నుంచి ఎంపీగా గెలిచారు. గత కొంతకాలం నుంచి అనారోగ్యంతో ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ పరమపదించారు. రేపు ఉదయం హైదరాబాద్ లో అంత్యక్రియలు జరుగుతాయని కుటుంబ సభ్యులు తెలిపారు. 1940 జనవరి 20న పశ్చిమగోదావరి జిల్లా మొగల్తూరులో ఉప్పలపాటి వెంకట కృష్ణంరాజు జన్మించారు. కృష్ణంరాజుకు భార్య శ్యామలా దేవి, ముగ్గురు కుమార్తెలు ఉన్నారు.

తెలుగు చిత్రసీమలో కూడా కృష్ణంరాజు గారి మరణం జీర్ణించుకోలేకపోతున్నారు సినీ ప్రముఖులు. ఈ మేరకు స్వయంగా వచ్చి ఆయన భౌతిక ఖాయాన్ని సందర్శించి నివాళులు అర్పిస్తున్నారు. ట్విట్టర్, ఫేస్ బుక్ లోనూ ఆయన మృతికి మన సినీ, రాజకీయ ప్రముఖులు సంతాపం చెబుతున్నారు. ముఖ్యంగా రెబల్ స్టార్ కృష్ణం రాజు మరణంతో ప్రభాస్ అభిమానులు శోకసంద్రంలో మునిగిపోయారు. ప్రభాస్ జీవితంలో ఈ ఉదయం విషాద ఉదయంగా మారిపోయింది. ఇక కృష్ణంరాజు గారి కుటుంబం నుంచి ప్రభాస్ సన్నిహితులు తాజాగా ఆయన అంత్యక్రియలకు సంబంధించిన ఓ వార్త అధికారికంగా తెలిపారు.
కృష్ణంరాజు గారి అంత్యక్రియలు రేపు అనగా సెప్టెంబర్ 12వ తేదీ సోమవారం నాడు జరుపుతామని కృష్ణంరాజు ఫ్యామిలీ మెంబర్స్ స్పష్టం చేశారు. ప్రభాసే కృష్ణంరాజుకి తలకొరివి పెట్టనున్నారు.