Aryan Khan: డ్రగ్స్ దందా సినిమా ఇండస్ట్రీని కుదిపేస్తోంది. రెండేళ్లుగా టాలీవుడ్ లో ప్రకంపనలు సృష్టించిన ఈ వ్యవహారం ఇప్పుడు బాలీవుడ్ కు చేరుకుంది. ప్రముఖ నటుడు, బాలీవుడ్ బాద్ షా షారుఖ్ ఖాన్ తనయుడు ఆర్యన్ ఖాన్ చుట్టూ డ్రగ్స్ ఉచ్చు బిగుసుకుంటోంది. అతడిని విచారిస్తున్నకొద్ది సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఇప్పటికే ముంబయి కోర్టు ఆర్యన్ కు బెయిల్ ఇచ్చేందుకు తిరస్కరించింది. అతడితో పాటు మరో ఇద్దరిని నిందితులుగా పేర్కొన్న కోర్టు అందరిపై.. ఎన్సీబీ విచారణకు ఆదేశాలు జారీ చేసింది. ఆదివారం అరెస్టు చేసిన మరో ఆరుగురిని కూడా ఎన్సీబీ అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టనుంది. ఒక వేళ డ్రగ్స్ తీసుకున్నట్లు నేరం రుజువైతే మాత్రం షారుక్ తనయుడు ఆర్యన్ కు పదేళ్ల జైలు శిక్ష పడే అవకాశం ఉంది. దీంతో పాటు లక్ష వరకు జరిమానా విధించేలా చట్టాలు ఉన్నాయి.

ఈ కేసును ఎన్సీబీ సీరియస్ గా తీసుకుంది. డ్రగ్స్ దందా వ్యవహారంలో ఎవరెవరు ఉన్నారు? ఎన్నాళ్ల నుంచి సాగుతోందని విచారణ చేస్తున్నారు. ఆర్యన్ కు డ్రగ్స్ మాఫియాతో లింక్స్ గురించి ఆరా తీస్తున్నారు. ఆర్యన్ స్నేహితుడు శ్రేయస్ ను కూడా ఎన్సీబీ అధికారులు అరెస్టు చేసి విచారణ చేస్తున్నారు. క్రూయిజ్ షిప్ లో దొరికిన డ్రగ్స్ ఆధారంగా ఇద్దరి ఇళ్లపై కూడా అధికారులు దాడులు నిర్వహించి, కీలక ఆధారాలు సేకరించేందుకు సిద్ధం అవుతున్నారు. డ్రగ్స్ ఎక్కడి నుంచి వస్తున్నాయి.. ఎవరు సరఫరా చేస్తున్నారనే అంశంపై విచారణ వేగవంతం చేశారు.
అయితే డ్రగ్స్ కేసులో కీలక నిందితుడిగా అభియోగం ఎదుర్కొంటున్న ఆర్యన్ విషయంలో మరో కీలక అంశాన్ని ఎన్సీబీ అధికారులు గుర్తించారు. ఆర్యన్ ఖాన్ కార్డెలియా క్రూయిస్ షిప్ రేవ్ పార్టీ నుంచి స్వాధీనం చేసుకున్న డ్రగ్స్ ను శనివారం రాత్రి క్రిప్టోకరెన్సీని ఉపయోగించి కొనుగోలు చేసినట్లు కార్కోటిక్ కంట్రోల్ బ్యూరో అధికారులు భావిస్తున్నారు. ఆర్యన్ డార్క్ వెబ్ ద్వారా డ్రగ్స్ కోసం ఆర్డర్లు అందుకున్నాడని, బిట్ కాయిన్ చెల్లింపులు చేశాడని అధికారులు తెలిపారు. అయితే డ్రగ్స్ కేసు విషయలో బాలీవుడ్ బాద్ షా షారుఖ్ ఖాన్ ను కావాలనే టార్గెట్ చేస్తున్నారని ఆయన అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆర్యన్ అమాయకుడని, సోషల్ మీడియాలోనూ జోరుగా ప్రచారం చేస్తున్నారు. ఇదే క్రమంలో ఎన్సీబీ పై ఆరోపణలను సంబంధిత డైరెక్టర్ ఖండించారు. తాము ఎవరినీ టార్గెట్ చేయడం లేదని.. చట్టం పరిధిలోని పని చేస్తున్నట్లు వెల్లడించారు.
మొత్తానికి బాలీవుడ్ ను షేక్ చేస్తున్న డ్రగ్స్ కేసు మొన్నటి వరకు టాలీవుడ్ ను కూడా గడగడలాడించింది. చాలా మంది సినీ ప్రముఖులు డ్రగ్స్ వాడుతున్నారని, వీటిని వివిధ ప్రాంతాల నుంచి దిగుమతి చేసుకుంటున్నారని ఆరోపణలు సైతం వచ్చాయి. నిషేధిత మత్తు పదార్థాలు వాడితే చట్ట పరమైన చర్యలు తీసుకుంటామని సర్కారు చెబుతుండగా.. అయినా కొందరి తీరుమారక పోవడం.. సంపన్నుల కుటుంబాల్లోని వ్యక్తులు ఇలా మత్తు పదార్థాలకు బానిసలుగా మారిపోవడం ఆందోళన కలిగిస్తున్న పరిణామం.