Manchu Vishnu: మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ ఎన్నికల్లో మంచు విష్ణు విజయం సాధించాక, చేసిన ప్రమాణాలు పై ఏకాగ్రత పెట్టాడు. ‘మా’ సంస్థ మన కోసం మనం పెట్టుకున్నాం. మరి మన కోసం పని చేయడానికి మనలో ఒకడు కూడా పనికి రాడా?’ అంటూ విష్ణుకి సపోర్ట్ చేసిన రవిబాబు లాంటి వాళ్ళు విష్ణుకు కొన్ని సలహాలు ఇస్తున్నారు. అందులో ముఖ్యంగా నటీనటులకు ‘మా’లో సభ్యత్వానికి వెసులుబాటు కల్పించడం.

నిజానికి తెలుగు సినిమా రంగంలో ఎందరో నటీనటులకు ఇప్పటికీ ‘మా’లో సభ్యత్వం లేదు. అయినా ఇన్నేళ్ల సుదీర్థ ప్రయాణంలో ‘మా’లో ఇంకా 900 సభ్యులు మాత్రమే ఎందుకున్నారు ? నిజానికి నటించిన వారందరూ ‘ మా’ లో చేరితే సంఖ్య వేలల్లో ఉంటుంది. కానీ ఎందుకు చేరరు ? చాలా మంది సభ్యత్వం పై శ్రద్ధ చూపించరు. ఇక శ్రద్ధ చూపించిన వారికి సభ్యత్వం ఇవ్వరు.
ఎందుకంటే వారికి అర్హత ఉండకపోవచ్చు. ‘మా’ లో సభ్యత్వానికి కొన్ని అర్హతలు ఉన్నాయి. నటీనటులు ఎన్ని చిత్రాలలో నటించినా, కనీసం అయిదు చిత్రాలలో ఒక్కో డైలాగ్ అయినా ఉన్నట్టు చూపించాలి. అలాగే సభ్యత్వానికి లక్ష రూపాయలు చెల్లించాలి. అయితే విష్ణు లక్షను మా’ సభ్యత్వ రుసుము రూ.75,000 వేలకు తగ్గిస్తామని హామీ ఇచ్చాడు.
ఇక సభ్యత్వానికి రుసుము ఒకేసారి చెల్లిస్తే, ఏడాది తర్వాత గుర్తింపు ఇస్తారు. ఒకేసారి చెల్లించలేని వారు రెండేళ్లలో దఫాలుగా చెల్లించాలి. వారికి ఏడాది అనంతరం గుర్తింపు ఇస్తారు. అప్పటినుంచే ‘మా’ లో ఓటు హక్కు లభిస్తుంది. పైగా సభ్యుడిగా చేరాలి అంటే.. అది పెద్ద ప్రాసెస్ గా ఉంది ఇన్నాళ్లు. అయితే, విష్ణు సలహాదారులు ఆ ప్రాసెస్ ను మార్చమని సలహా ఇస్తున్నారు.
మంచు విష్ణు కూడా సభ్యత్వానికి కావాల్సిన అర్హతలను మార్చాలని నిర్ణయించుకున్నారు. విష్ణు మారిస్తే సభ్యత్వం కోసం వందల మంది దరఖాస్తు చేసుకునేలా ఉన్నారు. కారణం.. ‘మా’ అనేక సంక్షేమ కార్యక్రమాలు నిర్వహిస్తోంది. అవి పేద కళాకారులకు ఎంతో మేలు చేస్తున్నాయి. అయితే ‘మా’లో సభ్యత్వానికి విష్ణు ఎలాంటి మార్పులు చేయబోతున్నాడు అనేది చూడాలి.