PKSDT Bro Movie Poster: పవన్ కళ్యాణ్-సాయి ధరమ్ తేజ్ ల మల్టీస్టారర్ టైటిల్ అండ్ మోషన్ పోస్టర్ నేడు విడుదల చేశారు. అనూహ్యంగా ‘బ్రో'(Bro) అనే టైటిల్ నిర్ణయించారు. నిమిషానికి పైగా ఉన్న బ్రో మోషన్ పోస్టర్ లో పవన్ కళ్యాణ్ ని మాత్రమే చూపించారు. మరో హీరో సాయి ధరమ్ ని పరిచయం చేయలేదు. థీమ్ లో గడియారం చూపించారు. మనిషి జీవితంలో టైం కి చాలా విలువ ఉంటుంది. దాన్ని ఎవరూ మార్చలేరు. అలాగే కాలానికి ఎవరూ అతీతులు కాదంటారు. కాబట్టి మూవీలో భూత, భవిష్యత్ కాలాలకు సంబంధించిన గట్టి లింక్ ఉండే అవకాశం కలదు.
పవన్ కళ్యాణ్ ఈ చిత్రంలో భగవంతుడిగా చేస్తున్న విషయం తెలిసిందే. ఇది వినోదయ సితం అనే తమిళ చిత్ర రీమేక్. పవన్ ని మోడరన్ భగవంతుడిగా చూపించారు. సాధారణంగా దేవుడు అనగానే ప్రేక్షకులు ఊహించుకునే ఫీచర్స్ అయితే కాదు. బ్రో మోషన్ పోస్టర్ కి థమన్ బీజీఎం హైలెట్ అనాలి. మోషన్ పోస్టర్ ని బీజీఎం ఓ రేంజ్ లో ఎలివేట్ చేసింది. ఓ రక్షా శ్లోకంతో కూడిన బీజీఎం అది. బ్రో అనే పదాన్ని హైలెట్ చేస్తూ ఆ శ్లోకం సాగింది.
టైటిల్ అర్థం ఏమిటీ? ఎందుకు ఇలాంటి టైటిల్ ఎంచుకున్నారు? అనే సందేహాలు ఉన్నాయి. టైటిల్ అర్థం ఏమిటో… అది కథకు ఎలా సరిపోతుందో పరిశీలిస్తే… బ్రో ప్రస్తుతం బాగా వాడుకలో ఉన్న పదం. ఇంగ్లీష్ పదం బ్రదర్ షార్ట్ ఫార్మ్ బ్రో. నిజానికి బ్రదర్ అనే ఇంగ్లీష్ పదానికి మూలం భ్రాతః(అన్న-తమ్ముడు) అనే సంస్కృత పదం అంటారు. కాబట్టి బ్రో ఇంగ్లీష్ పదం కాదు. మన ఇండియన్ లాంగ్వేజ్ నుండి పుట్టించే అనుకోవాలి.
ఈ మూవీలో దేవుడు మనిషి రూపంలో ఒక వ్యక్తిని గైడ్ చేస్తూ ఉంటాడు. పవన్ సాయి ధరమ్ తేజ్ ని గైడ్ చేస్తుంటాడు. వీరిని ఒకరినొకరు బ్రో అని పిలుచుకునే అవకాశం కలదు. అందుకు బ్రో ఫిక్స్ చేసి ఉండొచ్చు. మరొక వర్షన్ పరిశీలిస్తే… బ్రో అంటే కాపాడటం అని కూడా అర్థం వస్తుంది. బ్రోచేవారెవరు?, నను బ్రోవగ రావా! అనే పదాల్లో బ్రో మనం చూడవచ్చు. బ్రో అంటే కాపాడటం. ఒకరిని రక్షించడం అని కూడా అర్థం. ఆ విధంగా భగవంతుడు అందరినీ కాపాడేవాడు కాబట్టి ఆ టైటిల్ ఎంచుకొని ఉండొచ్చు… అదన్నమాట మేటర్. ఈ చిత్రానికి సముద్ర ఖని దర్శకుడు. త్రివిక్రమ్ స్క్రీన్ ప్లే అందించారు. టి జీ విశ్వప్రసాద్ నిర్మిస్తున్నారు.
