AP BJP- YCP: ప్రధాని మోదీ విశాఖ పర్యటనను వైసీపీ తెగ హడావుడి చేస్తోంది. పార్టీ కార్యక్రమం అన్నట్టు జన సమీకరణ చేస్తోంది. ఇక ఎంపీ విజయసాయిరెడ్డి ప్రధాని టూర్ సక్సెస్ చేయడానికి తెగ ఆరాటపడిపోతున్నారు. విశాఖలో మకాం వేసి రివ్యూల మీద రివ్యూలు పెడుతున్నారు. అటు అధికారులకు, ఇటు ప్రజాప్రతినిధులకు ఆదేశాలిస్తున్నారు. అయితే ఎంపీ విజయసాయిరెడ్డికి ఇది అనుకోని అవకాశంలా కనిపిస్తోంది. ఎందుకంటే ఆయన తన ట్విట్టర్ ఖాతాను ప్రధాని మోదీ, అమిత్ షాలకు పొగిడేందుకే కొనసాగిస్తున్నారన్న రేంజ్ లో ఉంటాయి అందులో కామెంట్స్. పోనీ అందులో రాష్ట్ర ప్రయోజనాలు ఏమైనా ఉంటాయంటే అదీ లేదు. జాతీయ స్థాయిలో ఎటువంటి నిర్ణయాలు తీసుకున్నా.. ఆహా ఓహో అంటూ ట్విట్టర్ ఖతాలో తెగ కామెంట్స్ పెడతారు.. కాదు కాదు పెట్టిస్తారు. ఆ మధ్యన ఓ ప్రైవేటు ఏజెన్సీకి ఇచ్చి హిందీలో ఎన్ని పొగడ్తలు ఉన్నాయో అన్నింటితో ట్విట్టర్ ఖాతాను నింపేశారు. అటువంటిది ప్రధానే నేరుగా విశాఖ రావడం, రెండు రోజులు బస చేస్తుండడంతో ఆయన దృష్టిలో పడడానికే విజయసాయి హడావుడి అంటూ కామెంట్స్ వినిపిస్తున్నాయి.

వాస్తవానికి ప్రధాని మోదీ విశాఖ పర్యటన విషయం రాష్ట్ర బీజేపీ నేతలకు సమాచారం లేదని వార్తలు వచ్చాయి. అయితే అదే సమయంలో రాష్ట్రంలో ఉన్న అధికార పార్టీ కనుక ప్రోటోకాల్ ప్రకారం చాలావరకూ బాధ్యతలు రాష్ట్ర ప్రభుత్వమే తీసుకోవాలి. అయితే తాజాగా నెలకొన్న రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో కేంద్ర పెద్దలు తమకు దూరం కాలేదని సంకేతాలిచ్చేలా జగన్ సర్కారు కార్యక్రమాన్ని హైజాక్ చేసే ప్రయత్నం చేసింది. మొత్తం అన్నీతానే చేస్తున్నట్టు బిల్డప్ ఇచ్చింది. గతం కంటే భిన్నంగా సాక్షి మీడియాలో ప్రధానితో పాటు కేంద్ర ప్రభుత్వాన్ని ఆకాశానికి ఎత్తేసింది. ప్రధాని వస్తున్నది రైల్వేస్టేషన్ ఆధునీకరణ పనులు, ఇతర కేంద్ర సంస్థల కార్యక్రమాలకే అయినా రాష్ట్ర ప్రభుత్వ చొరవతోనేని అర్ధం వచ్చేలా కథనాలు వండి వార్చింది. విశాఖ ప్రత్యేక రైల్వేజోన్, భోగాపురం ఎయిర్ పోర్టు నిర్మాణ పనులు ప్రారంభిస్తారని కూడా ఊహాగానాలు మొదలయ్యేలా మీడియా ద్వారా లీకులిచ్చింది. మరోవైపు వైసీపీ చేస్తున్న హడావుడి చూసి లోకల్ బీజేపీ నేతలు కంగారుపడిపోయారు. జరుగుతున్న విషయాలను హైకమాండ్ కు చేరవేశారు.
జగన్ సర్కారు మరోసారి తమను డిఫెన్స్ లో పడేయనుందని తెలుసుకున్న కేంద్ర పెద్దలు అప్రమత్తమయ్యారు. కార్యక్రమాన్ని వైసీపీ హైజాక్ చేస్తుందని గ్రహించి ఉపశమన చర్యలు మొదలు పెట్టారు. రాష్ట్రంలో అధికారంలో ఉన్నారు కాబట్టి.. ప్రధాని పర్యటన రాష్ట్ర ప్రభుత్వ బాధ్యత కాబట్టి ఊరుకుంటున్నామని.. లేకుంటే పరిస్థితి మరోలా ఉండేదని బీజేపీ పెద్దలు ఆగ్రహం వ్యక్తంచేసినట్టు సమాచారం. ఇప్పటికే షెడ్యూల్ దగ్గర పడడంతో వైసీపీ సభకు ప్రత్యామ్నాయంగా రోడ్డు షో ఏర్పాటు చేయాలని రాష్ట్ర బీజేపీ నేతలకు హైకమాండ్ పెద్దల నుంచి ఆదేశాలు వచ్చాయట. సాయంత్రం 4 గంటలకు ఐఎన్ఎస్ డేగా నుంచి నావల్ డాక్ యార్డు మీదుగాశోభయాత్ర జరిపించాలని బీజేపీ నేతలు నిర్ణయించారు.

బీజేపీ నేతల శోభాయాత్ర ప్లాన్ తో వైసీపీ నేతల్లో కలవరం ప్రారంభమైంది. బహిరంగ సభ బాధ్యత మనకు వదిలారు కాబట్టి భారీగా జన సమీకరణ చేయాలని ఉత్తరాంధ్ర ప్రజాప్రతినిధులకు సీఎం జగన్ స్పష్టమైన ఆదేశాలు జారీచేశారు. దీంతో ఉత్తరాంధ్ర మంత్రులు, ఎమ్మెల్యేలు నియోజకవర్గాల వారీగా సమావేశాలు పెట్టి మరీ నేతలకు జనసమీకరణ టార్గెట్లు ఇస్తున్నారు. ఆర్టీసీతో పాటు ప్రైవేటు పాఠశాలల బస్సులను సైతం ప్రధాని టూర్ కు వినియోగించాలని నిర్ణయించారు. అదే సమయంలో బీజేపీ శోభాయాత్ర ఫెయిల్ కావాలని కూడా చూస్తున్నట్టు సమాచారం. తద్వారా ప్రధాని మోదీని ఆకట్టుకొని తమ గుప్పెట్లో నుంచి జారిపోకుండా చూడాలని సీఎం జగన్ ప్లాన్ అని ప్రచారం సాగుతోంది.