Liger Movie: “కాట్ లాగా దేంగే.. ఇండియాను షేక్ చేయబోతున్నాం”.. ఇవీ లైగర్ సినిమా ప్రమోషన్లలో ఆ సినిమా హీరో విజయ్ దేవరకొండ నోటి నుంచి వెలువడిన ఆణిముత్యాలు. అఫ్ కోర్స్ వరల్డ్ ఫేమస్ లవర్ సినిమా ముందు కూడా ఆయన ఇంతకంటే గొప్పగానే మాట్లాడాడు. దేశం మొత్తం చుట్టి వచ్చాడు. కథలో దమ్ముంటే ఆటోమేటిగ్గా వసూళ్లు ఎలా దక్కుతాయో కార్తికేయ_2, కాంతారా నిరూపించాయి. కానీ టన్నుల కొద్దీ ఈగో తలకు ఎక్కితే ఎవరు ఏం చేయగలరు? పాన్ ఇండియా లో రేంజ్ లో విడుదలై అతిపెద్ద రాడ్ సినిమాగా రికార్డుల్లోకి ఎక్కిన లైగర్ సినిమా నష్టాలు అంతులేని కథను తలపిస్తున్నాయి. ఒకప్పుడు బాలకృష్ణ నటించిన పలనాటి బ్రహ్మనాయుడు సినిమా రోజులు గుర్తుకు వస్తున్నాయి. ముఖ్యంగా ఈ మధ్య కొన్ని డిజాస్టర్ సినిమాలను చూస్తే అడుసు తొక్క నేల? కాలు కడగనేల? అనే సామెత జ్ఞప్తికి వస్తుంది. కేవలం కాంబినేషన్ మాత్రమే నమ్ముకుని కోట్ల రూపాయలు ముందు వెనుకా చూడకుండా కుమ్మరించడం, తీరా అది బాక్సాఫీస్ వద్ద దారుణంగా ఫెయిల్ అయ్యాక లబోదిబోమంటూ ఆ నిర్మాతల చుట్టూ ప్రదక్షిణలు చేయడం ఈమధ్య పరిపాటిగా మారిపోయింది. కనీసం కంటెంట్ ఎలా ఉందో చేసుకోకుండా, ట్రైలర్ చూశాక కూడా ఓ అంచనాకు రాకుండా గుడ్డిగా రంగం లోకి దిగితే ఎవరు మాత్రం ఏం చేయగలరు? బయ్యర్లు ఉన్నంత అమాయకంగా ప్రేక్షకులు ఉండరు కదా! అయ్యో పాపం తీశారన్న జాలితోనో, సానుభూతితోనో ఫలానా సినిమాకు టికెట్లు కొని ప్రేక్షకులు వసూళ్ల వాన కురిపించిన దాఖలాలు చరిత్రలో ఎప్పుడూ లేవు.

మొదటిరోజు సాయంత్రానికే జనం లేరు
పాన్ ఇండియా స్థాయిలో ఓవర్ ప్రమోషన్ చేసి కాట్ లాగా దేంగే అంటూ పదే పదే మంత్రాన్ని జపించిన ఈ బాక్సింగ్ ఎంటర్టైనర్ ఎంత ఘోరంగా విఫలమైందో చూశాం కదా. మొదటి రోజు సాయంత్రానికే జనం లేక థియేటర్లు మొత్తం వెలవెలబోయాయి. కట్ చేస్తే 100 కోట్ల దాకా బిజినెస్ చేస్తే కనీసం అందులో పావు వంతు కూడా వెనక్కి రాలేదు. ఇప్పుడు పంపిణీ దారులు పూరి జగన్నాథ్ కార్యాలయం ముందు ధర్నా చేయాలని నిర్ణయించుకున్నట్టు వచ్చిన వార్త పరిశ్రమలో కలకలం రేపుతోంది. వాళ్ల వాట్స్అప్ గ్రూపులో పెట్టిన ఓ మెసేజ్ ఇప్పుడు చక్కర్లు కొడుతోంది. వారికి కూడా పూరి జగన్నాథ్ అదే స్థాయిలో కౌంటర్ ఇచ్చాడు. ఈ రెండింటిని పూరి జగన్నాధ్ గురువు రాంగోపాల్ వర్మ తన ట్విట్టర్ ఎకౌంట్లో పోస్ట్ చేశాడు. అయితే ఇలా ఓవర్ యాక్షన్ చేస్తే నేను పైసా కూడా ఇవ్వనని పూరి ఒక ఫోన్ కాల్ లో అన్న మాటలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

ఈ వ్యవహారం ఎక్కడిదాకా వెళ్తుందో కానీ మొత్తానికి పంపిణీదారులకు పూరి జగన్నాథ్ కు మధ్య పెద్ద గ్యాప్ చాలా ఉంది. ఆ మధ్య ఆచార్య విషయంలోనూ ఇలాంటి రగడే జరిగింది. నిర్మాణ భాగస్వామ్యం ఉన్నందుకు కొరడాల శివ ఆర్థికంగా చాలా ఇబ్బంది పడాల్సి వచ్చింది. వాస్తవానికి సినిమా ఫ్లాప్ అయినప్పుడు వచ్చే నష్టాలను పూడ్చేందుకు రిటర్న్ చేయాలనే రూల్ ఉండదు. అయితే అడ్వాన్స్ పద్ధతిలో అగ్రిమెంట్లు చేసుకున్నప్పుడు కొన్ని నిబంధనలు రాసుకుంటారు.. అయితే వాటిని కచ్చితంగా పాటించే పరిస్థితులు ఉండవు.. అందుకే ఈ సమస్యలు.. పవన్ కళ్యాణ్ అజ్ఞాతవాసి, రజనీ కాంత్ బాబా, మహేష్ బాబు స్పైడర్, బ్రహ్మోత్సవం, చిరంజీవి, రామ్ చరణ్ ఆచార్య, ఎన్టీఆర్ శక్తి, రామయ్య వస్తావయ్య.. ఈ సినిమాలు గతంలో రచ్చ రచ్చ చేసినవే. కానీ లైగర్ మాత్రం మరో స్థాయికి వెళ్లేలా ఉంది. దీనిపై మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ గాని, సినిమా పెద్దలు గాని ఇంతవరకు కల్పించుకోలేదు. బహుశా ఈ వివాదం చినికి చినికి గాలివానలా మారే ప్రమాదం కనిపిస్తోంది.