Brahmastra Defects: ది బెస్ట్ అనిపించే ఇంటర్నేషనల్ టెక్నీషియన్స్ అందరినీ ఒక్క చోటకి తెచ్చి, మార్వలెస్ అనే విజువల్ వండర్స్ ని మార్వెల్ తెర మీద చూపిస్తే దాన్ని అవెంజర్స్ అన్నాం ! భారతీయ పురాణ సారాన్ని సూపర్ హీరోస్ టచ్ తో ఆవిష్కరిస్తే దాన్ని బహుశా బ్రహ్మాస్త్ర అనొచ్చేమో! శివుడు ఎవరు ? కాళికెవరు ? దేవుడికి ఆయుధాలెందుకు ? మన గాథల్లో చెప్పేవన్నీ కబుర్లేనా ? వాటికి సైంటిఫిక్ బేసిస్ ఏంటి ? లాంటి సాధారణ ఉత్సుకతకు ఉత్సాహాన్ని ఇచ్చే సమాధానాలు ఇస్తున్నట్టుగా బాలీవుడ్ మోడల్లో వచ్చిన సినిమా బ్రహ్మాస్త్ర ! భర్త మాజీ ప్రేయసి చేసిన ఐటమ్ సాంగ్ కి భార్య డాన్సులాడటం, అదేనండీ చిక్కినీ చమేలీ – ఒకప్పటి గాళ్ ఫ్రెండ్ దీపిక ఇందులో రణబీర్ కి తల్లిగా కనిపించడం లాంటి టిపికల్ బాలీవుడ్ ట్రీట్ ఉంటుంది. దానికితోడు విజువల్ ఎఫెక్ట్స్ మనం ఊహించనంత వండర్ పుల్ గా అనిపిస్తే బ్రహ్మాస్త్ర బ్రహ్మాండం.

వయసు అయిపోయింది కదా అందుకే నన్ను తక్కువగా అంచనా వేస్తున్నట్టు ఉన్నారు మీరు – అంటూ షారుఖ్ సటిల్ పెర్ఫామెన్స్ తో కనిపించగానే సగటు సినీ అభిమానికి అర్థం అయిపోతుంది ఏ రేంజ్ సినిమా చూడబోతున్నామో ! ఆ వెంటనే ఈజ్ కి ఎగ్జాంపుల్ అనిపించే అప్పీల్ తో నాగార్జున వస్తాడు. 63 అనేది కేవలం నంబర్ అన్నట్టు నాగ్ కనపడుతుంటే ఆ పది నిమిషాలు ఎప్పుడు అయిపోయాయో మనకి గుర్తుండదు. హిందీ సినిమా స్టైల్లో చలాకీగా మొదలైపోయే లవ్ స్టోరీ… అటు నుంచి అటే సీరియస్ టోన్ అందుకుంటుంది. అసలు విశ్వాన్ని శాసించేది ఎవరు… యుగాల కాలం నుంచి నేటి వరకూ హిందూ ధర్మం ఎలా నిలిచింది… అనే బేస్ లైన్ ను మొదట్లోనే చెప్పడం వల్ల ఈ ట్రాన్సిషన్ పెద్ద ఇబ్బంది అనిపించదు. ఆ తర్వాత గుడ్ వర్సెస్ ఈవిల్ థీమ్, ఎఫెక్ట్స్ ఇంపాక్ట్ ఫుల్ గా ఉంటాయ్. ఒక్కో ట్విస్టూ రివీల్ అవుతూ ఉంటుంది.
ఫ్లాష్ బ్యాక్ లో కనిపించీ కనిపించకుండా ఉన్నామె, దీపికే… ఆమె రణబీర్ కి తల్లిగా చేసింది అని ఆశ్చర్యపడే లోపు, కాస్త ఛాయ తక్కువున్న దృఢమైన దేవ్ రూపం వెనక నుంచి కనడపడి – వీడు రణవీర్ సింగే అనిపిస్తుంది. అంటే సెకండ్ పార్ట్ లో కథ అంతా దీపిక, రణవీర్ ల చుట్టూ తిరుగుతుందన్నమాట ! అంటే డైరెక్టర్ అయాన్… చాలా కంఫర్టబుల్ గా బాలీవుడ్ లో ది బెస్ట్ అనిపించే కాంబినేషన్లు అన్నిటినీ ఇందులో ఇమిడ్చేంత స్కోప్ ఉన్న కేన్వాస్ గీసేశాడు. అందుకే అవెంజర్స్ తో పోల్చింది. ఫ్రాంఛైజీ కంటిన్యుటీకి ప్రొబ్లమ్ లేదు. కమర్షియాలిటీకి ఢోకా లేదన్నమాట. పైపెచ్చు… ఎవడైనా ఎప్పుడైనా రావొచ్చు. షారుఖ్ వచ్చినట్టు ! యూత్ కోసం ఆలియా లవ్ ట్రాక్, పెద్దోళ్ల కోసం సనాతన సెంటిమెంట్, పిల్లల కోసం విజువల్ వండర్ అన్నీ పెట్టేశాడు. కలిపి కుట్టేందుకు ఈ జనరేషన్ సూపర్ స్టార్ రణబీర్ ఉన్నాడు.
ఇంత పగడ్బందీ ప్లానింగ్ తో బాలీవుడ్ రివైవల్ కి బ్రహ్మాస్త్ర దారులు పరిచింది. నిజమే ! మొన్నటి వరకూ ఇండియన్ సినిమా అంటే హిందీ సినిమా అనే తలబిరుసు హ్యాండ్లింగ్ సౌత్ లో కంపరం పుట్టించింది. మన కేజీఎఫ్, ఆర్ఆర్ఎర్, పుష్ప పుట్టించిన ప్రకంపనల్లో ఆ కంపరం కనుమరుగైంది. బాలీవుడ్ తలపట్టుకుంది. ఇలాంటి టైమ్ లో డామినేషన్ నుంచి యూనిఫికేషన్ వైపు బాలీవుడ్ అడుగు వేసేందుకు బ్రహ్మాస్త్ర లైట్ చూపించింది. అందుకే ఇందులో బాలీవుడ్ స్టార్స్ అంతా ఇప్పుడో ఇక ముందే కనిపించేశారు. పైగా సౌత్ మాకు చుట్టమే అని చెప్పేందుకు నాగార్జున ఉండనే ఉన్నాడు. సీనియర్ యాక్టర్ చిరంజీవి వాయిస్ ఓవర్ వస్తుంటుంది. ఇక ముందు ఇంకొందరొస్తారు – ఈ రిజల్ట్ చూశాక ! ఆ హిందీ సినిమా ఇలాగే మోకాళ్ల మీద దేకాలి అనుకునేంత రివేంజ్ మోడ్ మనలో లేకపోతే గనక… దక్షిణాది కూడా బ్రహ్మాస్త్రను భలేగా ఎంజాయ్ చేయొచ్చు. ఎందుకంటే మన పెద్ద సినిమాల్లాగే ఇది కూడా అన్ని భాషల్లోనూ వచ్చేసింది. కాకపోతే డబ్బింగే మనకి అంత తేలిగ్గా మింగుడుపడదు. ఈ వివాహం అనే బంధం మనల్ని ఏకం చేసిందంటే – లాంటి భాష ఉంటుంది. పెళ్లి చేసుకుందామా అంటే సరిపోయేదానికి వచ్చిన తిప్పలు ఇవన్నీ ! పాటలన్నా తెలుగులో రాయించి ఉండాల్సింది. ట్రాన్స్ లేట్ చేయకుండా ! ప్రేమ పావురాల టైమ్ నుంచి మనం చూస్తున్న డబ్బింగ్ రుబ్బింగ్ ఇది.

నిజానికి ఇలాంటి సినిమాలు భారతీయను తట్టి లేపుతాయ్. అసలు బ్రహ్మాస్త్రం అంటే ఏంటి, అవతార పురుషులు, ఆయుధాలు మనకీ ఉన్నాయా…మనం మొహవాచిపోయి సూపర్ హీరోస్ కోసం వెంపర్లాడక్కర్లేదన్న మాట అనే ఆలోచన కల్గుతుంది. ఆయుధాలకీ ప్రకృతికీ లింకేంటి, సాధన ఎలాంటి యోధులను తయారు చేయగలదు – లాంటి విషయాలపై పిల్లలకి ఆసక్తి కలిగితే కల్చురల్ కనెక్ట్ ఆటోమేటిగ్గా పెరుగుతుంది కదా! ఇట్స్ ఎ ప్రోసెస్. మరి ఇలాంటి మహత్తరమైన అవకాశం తెచ్చిన బ్రహ్మాస్త్ర మీద కూడా కొందరు ఎందుకు పడి ఏడుస్తున్నారో అర్థం కావడం లేదు. బహుశా ఇప్పుడు పక్కనోళ్లమీద పడి ఏడవడం కొందరి జన్మహక్కు అయిపోయినట్టుంది. అలాంటి బ్యాచ్ కి పాజిటివ్ పాడూ ఏమీ ఉండవ్. ఓన్లీ నెగెటివ్ వైబ్రేషన్. అందుకే బ్రహ్మాస్త్ర మీద కూడా దాడి చేశారు కానీ రణబీర్ కాంబో సక్సెస్ పుల్ గా సస్టైన్ అయినట్టు కనపడుతోంది. ట్రూలీ ఇదో ఇండియన్ వర్షన్ ఫర్ అవెంజర్స్ అనుకుంటే తప్పేంలేదు.