
సినిమా పరిశ్రమకు బెస్ట్ పాలసీని తీసుకొచ్చేందుకు తెలంగాణ ప్రభుత్వం ప్రయత్నిస్తుందని సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. బుధవారం మాసాబ్ ట్యాంక్లోని పశుసంవర్ధక శాఖ డైరెక్టరేట్ కార్యాలయంలో సినీ నిర్మాతలు, ఎగ్జిబిటర్స్ తో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సినిమా షూటింగులకు అనుమతి, థియేటర్ల ఓపెనింగ్ వంటి అంశాలపై చర్చించారు. అనంతరం మంత్రి శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ సినీ పరిశ్రమ విషయంలో ప్రభుత్వం సానుకూలంగా ఉందని తెలిపారు. సినీ పరిశ్రమను నమ్ముకొని వేలాది మంది కార్మికులు జీవిస్తున్నారని తెలిపారు. లాక్డౌన్ కారణంగా షూటింగులు నిలిచిపోవడంతో కళాకారులు ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. వీరిని ఆదుకునేందుకు ప్రభుత్వం అన్నివిధలా సహాయసహకారాలు అందిస్తుందని తెలిపారు.
ఇటీవల మెగాస్టార్ చిరంజీవి ఇంట్లో టాలీవుడ్ పెద్దలతో సమావేశం నిర్వహించిన సమస్యలను ముఖ్యమంత్రి కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లినట్లు తెలిపారు. ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా సినీ పెద్దలతో సమావేశంలో నిర్వహించినన పరిశ్రమలో కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలన్నింటిని సావధానంగా విన్నారని తెలిపారు. ఇప్పటికే ప్రభుత్వం పోస్టు ప్రొడక్షన్ పనులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని తెలిపారు. ఇక షూటింగులకు సంబంధించి మార్గదర్శకాలను పరిశ్రమలోని అందరితో చర్చించి నిర్ణయం తీసుకుంటున్నట్లు పేర్కొన్నారు. థియేటర్ల ఓపెనింగ్ సంబంధించి కూడా త్వరలో నిర్ణయం తీసుకుంటామని ఆయన తెలిపారు. గురువారం మధ్యాహ్నం 3గంటలకు ప్రభుత్వ చీఫ్ సెక్రటరీతో సినీరంగంలోని పలువిభాగాలకు చెందిన ప్రముఖులు సమావేశమై చర్చించిన తర్వాత తగు నిర్ణయాన్ని వెల్లడించనున్నట్లు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. ఈ సమావేశంలో నిర్మాతలు సి.కల్యాణ్, దిల్ రాజు, డైరెక్టర్ ఎన్.శంకర్, మా అధ్యక్షుడు నరేష్, ఎఫ్‌డీసీ మాజీ చైర్మన్ రాంమోహన్ రావు, జీవిత, పలువురు నిర్మాతలు, ఎగ్జిబిటర్స్ పాల్గొన్నారు.