
రాజ్ కుంద్రా అరెస్టుతో బాలీవుడ్ లో.. నీలి చిత్రాల వ్యవహారం ఎంత సంచలనం రేకెత్తించిందో తెలిసిందే. ఈ వ్యవహారంపై పోలీసుల దర్యాప్తు కొనసాగుతుండగానే.. మరో వార్త బయటకు వచ్చింది. మాజీ మిస్ ఇండియా యూనివర్స్ పరీ పశ్వాన్ సంచలన ఆరోపణలు చేశారు. ఓ చిత్ర నిర్మాణ సంస్థకు సంబంధించిన వారు తనకు మత్తు మందు ఇచ్చి, వివస్త్రను చేసి, అశ్లీల వీడియోలు చిత్రీకరించారని తెలిపింది. పరీ పశ్వాన్ చేసిన ఈ వ్యాఖ్యలు.. ఇప్పుడు బాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారాయి.
2019లో వీవీఎన్ మిస్ ఇండియా యూనివర్స్ గా ఎంపికైంది పరీ పశ్వాన్. దీంతో.. పాపులర్ అయిన పరీ పశ్వాన్ సినీ రంగం వైపు అడుగులు వేసింది. ఇందుకోసం ముంబై వెళ్లింది. అయితే.. ఆ సమయంలో తన జీవితంలో ఊహించని ఘటన చోటుచేసుకుందని ఆవేదన వ్యక్తం చేసింది. బాలీవుడ్ లోని ఓ ప్రొడక్షన్ హౌస్ నుంచి తనకు అవకాశం రావడంతో ఎంతో సంతోషంగా వెళ్లినట్టు చెప్పింది. అయితే.. షూటింగ్ కొనసాగుతుండగా ఒక రోజు ప్రొడక్షన్ హౌజ్ కు సంబంధించిన వారు కూల్ డ్రింకులో మత్తు మందు కలిపి ఇచ్చారని తెలిపింది. ఆ తర్వాత తనను వివస్త్రను చేసి, అశ్లీల వీడియోలు చిత్రీకరించారని ఆరోపించింది.
మత్తు నుంచి తేరుకున్న తర్వాత తాను ఎలా మోసపోయాననే విషయం తెలిసిందని ఆవేదన వ్యక్తం చేసింది పరీ పశ్వాన్. తనను మోసం చేసిన సదరు ప్రొడక్సన్ హౌజ్ నిర్వాహకులతోపాటు లైంగిక దాడికి ప్రయత్నించిన వారిపైనా కేసు పెట్టినట్టు చెప్పింది. ప్రస్తుతం ఈ విచారణ కూడా కొనసాగుతోందని తెలిపింది. అమ్మాయిల అవసరాలను ఆసరాగా చేసుకొని, లైంగిక దాడిచేసే వాళ్ల చేతుల్లో తాను కూడా బాధితురాలిని అయ్యానని ఆవేదన వ్యక్తం చేసింది పరీ పశ్వాన్.
ఇలాంటి దుండగులు మరొక అమ్మాయి విషయంలో ఇలా చేయకూడదనే ఉద్దేశంతోనే పోలీసులకు ఫిర్యాదు చేసినట్టు చెప్పారు. ఈ కారణంగానే.. ఇప్పుడు ఈ విషయాన్ని వెల్లడిస్తున్నట్టు చెప్పారు. అయితే.. సదరు ప్రొడక్షన్ హౌజ్ పేరు మాత్రం చెప్పేందుకు నిరాకరించింది పశ్వాన్. ఇదిలాఉంటే.. పరీ పశ్వాన్ ఆ మధ్య తన భర్తపైనా కేసు పెట్టింది. అదనపు కట్నం కోసం తనను వేధిస్తున్నాడని, భర్త కుటుంబ సభ్యులు తనపై దాడికి పాల్పడుతున్నారని ఫిర్యాదులో పేర్కొంది. దీంతో.. ఆమె భర్తను పోలీసులు అరెస్టు కూడా చేశారు.