Viswambhara Movie: ‘భోళా శంకర్’ వంటి ఘోరమైన డిజాస్టర్ ఫ్లాప్ తర్వాత మెగాస్టార్ చిరంజీవి చేస్తున్న ఫాంటసీ చిత్రం ‘విశ్వంభర’. ‘అంజి’ తర్వాత మళ్ళీ ఇన్నాళ్లకు ఆయన ఈ జానర్ లో సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా ప్రకటించిన కొత్తల్లో అంచనాలు వేరే లెవెల్ లో ఉండేవి. మెగాస్టార్ ఊర మాస్ కం బ్యాక్ ఈ చిత్రం తో ఉంటుందని అనుకున్నారు. కానీ టీజర్ విడుదల తర్వాత ఈ చిత్రం మీదున్న అభిప్రాయం మారిపోయింది. స్టోరీ, కాన్సెప్ట్ కొత్తగానే అనిపించినప్పటికీ, VFX వర్క్ తేలిపోవడంతో అభిమానులు చాలా నిరుత్సాహానికి గురయ్యారు. ఎన్నో ఆశలు పెట్టుకుంటే ఇలాంటి ప్రోడక్ట్ ఇస్తున్నారేంటి అని తీవ్రమైన విమర్శలు వచ్చాయి. ఇది మూవీ టీం వరకు చేరింది. కానీ యూవీ క్రియేషన్స్ సంస్థ ప్రస్తుతం ఆర్ధిక సంక్షోభం లో ఉండడంతో, మళ్ళీ VFX మీద రీ వర్క్ చేసేంత డబ్బులు పెట్టలేమని, ఓటీటీ రైట్స్ మేము అనుకున్న రేట్ కి అమ్ముడుపోతే ఆలోచిస్తామని చెప్పినట్టు సమాచారం.
మరోపక్క VFX మినహా, ఈ చిత్రానికి సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ కూడా చకచకా జరుగుతుందట. మొదటి పాటని రీ రికార్డింగ్ ని కూడా పూర్తి చేసినట్టు సమాచారం. ఈ శివరాత్రికి ఆ పాటను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారట. ఈ టైటిల్ సాంగ్ చాలా అద్భుతంగా వచ్చిందని, ఎక్కువ సంవత్సరాలు వినబడే పాట అవుతుందని, సినిమా మీద హైప్ అమాంతం పెంచేస్తుందని మూవీ టీం బలమైన నమ్మకం తో ఉంది. త్వరలోనే ఈ పాటకు సంబంధించిన అధికారిక ప్రకటన చేయబోతున్నారు మేకర్స్. ఈ చిత్రంలో హీరోయిన్ గా త్రిష నటిస్తుండగా, మీనాక్షి చౌదరి, ఆషిక రంగనాథ్ , సురభి, ఇషా చావ్లా తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. చిరంజీవి, త్రిష కాంబినేషన్ లో తెరకెక్కుతున్న రెండవ చిత్రమిది. గతంలో వీళ్ళ కాంబినేషన్ లో స్టాలిన్ అనే చిత్రం వచ్చింది.
ఇక ఈ సినిమా ఈ ఏడాది సంక్రాంతి కానుకగా విడుదల కావాల్సి ఉంది. కానీ ‘గేమ్ చేంజర్’ చిత్రం కోసం వాయిదా వేసుకున్నారు. ఇప్పుడు కొత్త విడుదల తేదీ కోసం తర్జన భర్జన పడుతున్నారు. మే9 న విడుదల చేయాలని ఆలోచిస్తున్నారు, కానీ ఓటీటీ డీల్ ఇంకా క్లోజ్ అవ్వకపోవడంతో అప్పటికి విడుదల అవ్వడం కష్టమే అని అంటున్నారు. ఒకవేళ మే9 న ఈ చిత్రం విడుదల కాకుంటే, సెప్టెంబర్ 25న విడుదలయ్యే అవకాశాలు ఉన్నాయి. ప్రస్తుతానికి అయితే ఈ చిత్రం పై నెగటివ్ అంచనాలే ఉన్నాయి. గ్రాఫిక్స్ విషయం లో కేవలం టీజర్ తోనే దారుణమైన ట్రోల్స్ ని ఎదురుకుంది. జనాల్లో ఉన్న ఈ నెగటివ్ అభిప్రాయాన్ని మార్చి, మేకర్స్ పాజిటివ్ అభిప్రాయాన్ని ఎలా కలిగిస్తారో చూడాలి. ప్రస్తుతానికి టాకీ పార్ట్ మొత్తం పూర్తి అయ్యింది, కేవలం ఒక్క పాట షూటింగ్ మాత్రమే బ్యాలన్స్ ఉందట.