Vishvak Sen and Megastar Chiranjeevi : యంగ్ హీరోలలో యూత్ ఆడియన్స్ ని ప్రత్యేకంగా ఆకర్షించే హీరో విశ్వక్ సేన్. తన ప్రతీ సినిమాతో ఆడియన్స్ ని సరికొత్త రీతిలో అలరించి మార్కులు కొట్టేయాలని చూస్తుంటాడు. ఎక్కువ శాతం పాస్ అయ్యాడు కానీ, కొన్ని సార్లు విఫలం అవుతున్నాడు. కుంభస్థలాన్ని బద్దలు కొట్టడానికి గట్టి ప్రయత్నాలు చేస్తున్నాడు కానీ, ఆ రేంజ్ కి మాత్రం చేరుకోలేకపోతున్నాడు. ఇకపోతే ఈయన బాలకృష్ణ, జూనియర్ ఎన్టీఆర్ లకు వీరాభిమాని అనే సంగతి అందరికీ తెలిసిందే. ఆయన దర్శకత్వం వహిస్తూ హీరో గా చేసిన ‘పాగల్’ చిత్రం ప్రీ రిలీజ్ ఈవెంట్ కి జూనియర్ ఎన్టీఆర్ ముఖ్య అతిథిగా పాల్గొన్నాడు. అదే విధంగా బాలయ్య తో కూడా విశ్వక్ సేన్ కి మంచి సాన్నిహిత్యం ఉంది. ఎన్నోసార్లు బయట బాలయ్య తో కలిసి ఇతగాడు సంబరాలు చేసుకోవడం మనమంతా చూసాము. దానికి సంబంధించిన వీడియోలు కూడా సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యాయి.
ఇది ఇలా ఉండగా విశ్వక్ సేన్ లేటెస్ట్ గా ‘లైలా’ అనే చిత్రం చేసిన సంగతి అందరికీ తెలిసిందే. ఈ సినిమాలో ఆయన అమ్మాయిగా కనిపిస్తూ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకునే ప్రయత్నం చేయబోతున్నాడు. టీజర్ కి కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది. వాలెంటైన్స్ డే సందర్భంగా ఈ చిత్రం ఫిబ్రవరి 14 న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాకి సంబంధించిన ప్రీ రిలీజ్ ఈవెంట్ ని హైదరాబాద్ లో ఫిబ్రవరి 9వ తారీఖున గ్రాండ్ గా చేయబోతున్నారు. ఈ ఈవెంట్ కి ముఖ్య అతిథిగా మెగాస్టార్ చిరంజీవి రాబోతున్నట్టుగా తెలుస్తుంది. ఈ సినిమాని షైన్ స్క్రీన్స్ ఎంటర్టైన్మెంట్స్ సంస్థ నిర్మించింది. ఈ నిర్మాణ సంస్థలోనే త్వరలో మెగాస్టార్ చిరంజీవి, అనీల్ రావిపూడి కాంబినేషన్ లో కొత్త చిత్రం తెరకెక్కబోతుంది. అందుకే ఆ చిత్ర నిర్మాతలు మెగాస్టార్ చిరంజీవి ని ముఖ్య అతిథిగా పిలిచినట్టు, చిరంజీవి కూడా వచ్చేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు తెలుస్తుంది.
అయితే బాలయ్య తో ఎంతో మంచి సాన్నిహిత్యం ఉన్న విశ్వక్ సేన్, బాలయ్య ని ప్రీ రిలీజ్ ఈవెంట్ కి పిలుస్తాడని అభిమానులు అనుకున్నారు. కానీ అనూహ్యంగా విశ్వక్ సేన్ సినిమాకి మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిథి అనే వార్త రావడంతో వాళ్ళు షాక్ కి గురయ్యారు. ఇదంతా పక్కన పెడితే గతంలో విశ్వక్ సేన్ , ప్రముఖ హీరో అర్జున్ సర్జా దర్శకత్వంలో ఒక సినిమాని మొదలు పెట్టాడు. ఈ సినిమా ముహూర్తం సన్నివేశానికి ప్రస్తుత ఆంధ్ర ప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ముఖ్య అతిథిగా విచ్చేశాడు. ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ మొదలయ్యే ముందు అర్జున్, విశ్వక్ సేన్ మధ్య అభిప్రాయం భేదాలు రావడం వల్ల సినిమాని ఆపేయాల్సి వచ్చింది. ఈ అంశంపై అప్పట్లో అర్జున్ ప్రెస్ మీట్ ని ఏర్పాటు చేసి విశ్వక్ సేన్ తీరుపై తీవ్రమైన అసంతృప్తి వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే.