
Chiranjeevi – Rajamouli: టాలీవుడ్ తెరపై నంబర్ 1 రైటర్ ఎవరైనా ఉన్నారంటే అది విజయేంద్రప్రసాద్ అని చెప్పక తప్పదు. రాజమౌళి ప్రతి సినిమాకు ఆయన తండ్రియే కథను అందిస్తాడు. బాహుబలితో విజయేంద్రప్రసాద్ స్థాయి విశ్వవ్యాప్తం అయ్యింది. ఇక భజరంగీ భాయ్ జాన్ లాంటి సినిమాతో జాతీయ స్థాయిలో విజయేంద్రప్రసాద్ పేరు మారుమోగింది.
ఇక ఈ తండ్రీ కొడుకులు టాలీవుడ్ లోనే నంబర్ 1 హీరో అయిన చిరంజీవితో మాత్రం ఇప్పటివరకూ చేయలేదు. నిజానికి కథ రెడీ అయ్యాక దానికి అనుగుణమైన హీరోను ఎంపిక చేసుకోవడం రాజమౌళికి అలవాటు. అందుకే ఆయన అన్ని చిత్రాల్లోనూ అందరూ యంగ్ హీరోలకే అవకాశం దక్కింది. చిరంజీవి, బాలక్రిష్ణ, నాగార్జున, వెంకటేశ్ లాంటి అగ్రతారలకు ఇప్పటిదాకా రాజమౌళి దర్శకత్వంలో నటించే అదృష్టం దక్కలేదు.
ఇక రాజమౌళి తండ్రి, రైటర్ విజయేంద్రప్రసాద్ కు మాత్రం ఎప్పటి నుంచో చిరంజీవితో కలిసి పనిచేయాలని అనుకుంటున్నారు. ఇటీవల విజయేంద్రప్రసాద్-చిరంజీవి మధ్య భేటీ కూడా జరిగిందట.. ఇద్దరూ కథ గురించి చర్చించుకున్నారని తెలుస్తోంది.
చిరంజీవికి సూటయ్యే మంచి కథను ఒకటి విజయేంద్రప్రసాద్ రాశాడని.. అందుకోసమే ఇద్దరి మధ్య దీనిపై చర్చ జరిగిందని తెలుస్తోంది.
ఇటీవలే చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా విజయేంద్రప్రసాద్ ఒక హాట్ కామెంట్ చేశాడు. ‘టాలీవుడ్ లో నంబర్ 1,2,3 హీరో చిరంజీవినే. ఆయనకు సరిపడా కథ సినిమా పడాలే కానీ పాత రికార్డులన్నీ చెరిపేస్తాడు. నా వంతు ప్రయత్నం నేను చేస్తాను’ అని అన్నాడు. దీంతో చిరంజీవి కోసం మంచి కథ సిద్ధం చేశాడని తెలుస్తోంది.
బహుశా ఇప్పుడు రాజమౌళి-మహేష్ కాంబినేషన్ లో తీస్తున్న మూవీ తర్వాత చిరంజీవితో రాజమౌళి దర్శకత్వంలో ఈ సినిమా రూపొందించే అవకాశాలు లేకపోలేదంటున్నారు. ప్రస్తుతం చిరంజీవి కూడా నాలుగు సినిమాలతో బిజీగా ఉండడంతో ఈ కాంబినేషన్ ఖచ్చితంగా పట్టాలెక్కడం ఖాయం అన్న అంచనాలు నెలకొన్నాయి. ఏం జరుగుతుందనేది భవిష్యత్ నిర్ణయించనుంది.