Vijay sethupati: తమిళ చిత్ర పరిశ్రమలో స్టార్‌హీరోల్లో ఒకరు విజయ్ సేతుపతి. ఆయన నుంచి సినిమా వస్తోందంటే చాలు థియేటర్లలో అభిమానుల సందడి మాములుగా ఉండదు. విజయ్ సినిమాలో కనిపిస్తున్నాడంటే అందులో ఏదో కొత్తదనం ఉంటుందని ఆశిస్తుంటారు ప్రేక్షకులు. అయితే, ఆయన సినిమాలపై ఓ ఆసక్తికర విషయాన్ని పంచుకున్నారు విజయ్ సేతుపతి. తాను నటించిన సినిమాలు అసలు చూడనని తెలిపారు. ఇటీవలె ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన ఆయన.. అందుకు గల కారణాలు కూడా వివరించారు.
తాను ఒక యాక్టర్ అని నటన లేకపోతే తాను లేనని తెలుపుతూ.. ఈ స్టార్డమ్ లాంటి బిరుదులను తన మైండ్లోకి ఎక్కించుకోనని అన్నారు. పనిమీద దృష్టిపెట్టి రోజంతా అందులో నిమగ్నమవ్వడం.. ఆనంతరం ఇంటికి వెళ్లి నిద్రపోవడం తన దినచర్య అని రోజూ ఇలాగే ఉంటుందని అన్నారు. సినిమాలు చూడటం కూడా ఇష్టముండదని తెలిపారు. కనీసం మీరు నటించిన సినిమాలైనా చూస్తారా? అని అడగ్గా.. కేవలం డబ్బింగ్ చెప్పినప్పుడే చూస్తానని ఆశ్చర్యపరిచారు. తన సినిమాలు చూడాలంటే భమమని.. అప్పుడు తాను చేసిన తప్పులు కనిపిస్తాయని అన్నారు. అది తనకు మంచిది కాదని వివరించారు.
ఇటీవలె అనబెల్ సేతుపతి సినిమాతో ఓటీటీలో ప్రేక్షకులను పలకరించారు విజయ్. హాట్‌స్టార్ వేదికగా విడుదలైన ఈ సినిమా అందర్నీ ఆకట్టుకుంది. హర్రర్, కామెడీ నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రంలో సేతుపతి సరసన తాప్సీ నటించింది. మరోవైపు విజయ్ ట్రాన్స్‌జెండర్‌గా సూపర్ డీలక్స్ చిత్రంలో నటించిన సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో విజయ్ నటనకు జాతీయ అవార్డు గెలుచుకున్నారు. ఆంథాలజీగా తెరకెక్కిన ఈ సినిమాలో శిల్ప అనే పాత్రలో మెప్పించారు. 2009లో ‘వెన్నిల కబడీ కుళు’ చిత్రంతో హీరోగా వచ్చిన సేతుపతి.. అనంతరం తమిళంలోతో పాటు తెలుగు, మలయాళ భాషల్లోనూ నటించారు. ఇప్పుడు బాలీవుడ్‌లోనూ సినిమాలు, వెబ్ సిరీస్ చేస్తూ బిజీగా ఉన్నారు.